7
1 ✝పరిసయ్యులూ, కొందరు ధర్మశాస్త్ర పండితులూ జెరుసలంనుంచి వచ్చి యేసు చుట్టూ గుమికూడి, 2 ఆయన శిష్యులలో కొందరు అశుద్ధమైన చేతులతో – అంటే, చేతులు కడుక్కోకుండా – రొట్టెలు తినడం చూచినప్పుడు వారు తప్పు పట్టారు. 3 (పరిసయ్యులు, ఆ మాటకు వస్తే యూదులంతా, తమ పెద్దల సంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రత్యేక విధంగా చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు. 4 బజారునుంచి వస్తే కడుక్కోకుండా తినరు. అంతే గాక, ఇంకా అనేక ఇతర విషయాలను వారు స్వీకరించి పాటిస్తున్నారు, అంటే గిన్నెలూ కుండలూ ఇత్తడి పాత్రలూ పడకలూ కడగడం.)5 ఆ పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ “మీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు తింటున్నారు?” అని యేసును అడిగారు.
6 ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు “కపట భక్తులైన మీ విషయం యెషయా ప్రవక్త ముందుగా పలికినది సరిగానే ఉంది! అతడు వ్రాసినదేమంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు గానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. 7 వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మానవ కల్పితమైన నియమాలను దేవుని ఉపదేశాలుగా బోధిస్తున్నారు.
8 “మీరు దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి మనుషుల సంప్రదాయాలను పట్టుకొన్నవారు. అంటే పాత్రలూ గిన్నెలూ కడగడం, ఇలాంటివి మరి అనేకం చేస్తారు.”
9 ఆయన వారితో ఇంకా అన్నాడు “మీ సంప్రదాయాన్ని పాటించడానికి మీరు దేవుని ఆజ్ఞ త్రోసివేసే విధం బాగుందయ్యా! 10 మోషే ఇలా అన్నాడు గదా: మీ తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిని గానీ తండ్రిని గానీ దూషించేవారికి మరణ శిక్ష విధించితీరాలి. 11 మీరైతే ఇలా అంటారు: ఒక మనిషి తండ్రిని గానీ తల్లిని గానీ చూచి ‘నావల్ల మీరు పొందగలిగి ఉన్న సహాయం కాస్తా ‘కొర్బాన్’ (అంటే, దేవునికి అర్పించబడింది) అని చెపితే, 12 మీరు అతణ్ణి తండ్రికోసం గానీ తల్లికోసం గానీ ఏమీ చేయనివ్వరు. 13 ఈ విధంగా మీరు అందజేసిన సంప్రదాయంకోసం దేవుని వాక్కు చెల్లకుండా చేస్తున్నారు. ఇలాంటివి అనేకం చేస్తున్నారు.”
14 అప్పుడాయన జనసమూహమంతటినీ దగ్గరకు పిలిచి వారికిలా చెప్పాడు: “నేను చెప్పేది మీరంతా విని గ్రహించండి! 15,16 బయటినుంచి మనిషిలోకి వచ్చేదేదీ అతణ్ణి అశుద్ధం చేయజాలదు గాని మనిషిలోనుంచి బయటికి వచ్చేవే అతణ్ణి అశుద్ధం చేస్తాయి! ఎవరికైనా వినడానికి చెవులుంటే అతడు వింటాడు గాక!”
17 ఆయన జన సమూహాన్ని విడిచి ఇంట్లోకి వచ్చిన తరువాత ఆయన శిష్యులు ఆ ఉదాహరణ గురించి ఆయనను అడిగారు. 18 ఆయన వారితో “అయితే మీరు కూడా ఇంత మందబుద్ధులా? బయటినుంచి మనిషిలోకి వచ్చేదేదీ అతణ్ణి అశుద్ధం చేయడం అసాధ్యమని మీరు గ్రహించడం లేదా? 19 ✽అలాంటిది అతని హృదయంలోకి వెళ్ళక కడుపులోకే పోయి విసర్జించబడుతుంది” అన్నాడు. (ఇలా చెప్పడం ద్వారా ఆయన ప్రతి రకమైన ఆహారం శుద్ధమైనదని ప్రకటించినట్టే).
20 ఆయన ఇంకా అన్నాడు “మనిషిలోనుంచి వస్తున్నవే అతణ్ణి అశుద్ధం చేస్తాయి. 21 ఎందుకంటే లోపలనుంచి, అంటే మనిషి హృదయంలోనుంచి చెడ్డ తలంపులు, వ్యభిచారాలు, లైంగిక అవినీతి పనులు, హత్యలు, 22 దొంగతనాలు, పేరాశ, దుర్మార్గత, మోసం, కామవికారం, అసూయ, దూషణ, గర్వం, మూర్ఖత్వం వస్తాయి. 23 ఈ చెడ్డవన్నీ లోపలనుంచి వచ్చి మనిషిని అశుద్ధం చేస్తాయి.”
24 ✝ఆయన అక్కడనుంచి బయలుదేరి తూరు, సీదోను ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక ఇంట్లో ప్రవేశించాడు. ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని ఆయన కోరిక గాని ఆయన మరుగై ఉండలేకపోయాడు. 25 ఒకామె ఆయనను గురించి విని వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిలపడింది. ఆమె చిన్న కూతురుకు మలిన పిశాచం పట్టింది. 26 ఈ స్త్రీ సిరియాకు చెందిన ఫెనికయ ప్రాంతంలో పుట్టిన గ్రీస్ దేశస్థురాలు. తన కూతురిలోనుంచి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని ఆమె యేసును బ్రతిమిలాడింది.
27 అయితే యేసు ఆమెతో “మొదట పిల్లలను తృప్తిగా తిననియ్యి. పిల్లల భోజనం తీసి కుక్క పిల్లలకు వేయడం తగదు” అన్నాడు.
28 అందుకామె ఆయనతో “స్వామీ, నిజమే గానీ బల్ల కింద ఉన్న కుక్క పిల్లలు సహా పిల్లలు పడేసే ముక్కలు తింటాయి గదా!” అని జవాబిచ్చింది.
29 ✽అప్పుడాయన ఆమెతో “ఆ మాట చెప్పినందుచేత నీవు వెళ్ళవచ్చు. నీ కూతురిలోనుంచి దయ్యం వెళ్ళిపోయింది” అన్నాడు.
30 ఆమె ఇంటికి వెళ్ళి చూస్తే దయ్యం వెళ్ళిపోయి ఆమె కూతురు పడకమీద పడుకొని ఉండడం కనిపించింది.
31 ✽యేసు తూరు, సీదోను ప్రాంతంనుంచి మళ్ళీ బయలుదేరి దెకపొలి✽ ప్రదేశం గుండా గలలీ సరస్సు దగ్గరికి వచ్చాడు. 32 అక్కడ చెవుడు, నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరకు తీసుకువచ్చి అతడిమీద చేయి ఉంచమని ఆయనను వేడుకొన్నారు. 33 ✝ఆయన అతణ్ణి జనసమూహం నుంచి వేరుగా తీసుకువెళ్ళి అతని చెవులలో వ్రేళ్ళు పెట్టి ఉమ్మివేసి అతడి నాలుకను తాకాడు. 34 ✽అప్పుడు ఆకాశంవైపు తలెత్తి చూస్తూ నిట్టూర్చి అతడితో “ఎప్ఫతా!” అన్నాడు. ఆ మాటకు “తెరచుకో!” అని అర్థం.
35 వెంటనే అతడి చెవులు తెరచుకొన్నాయి. నాలుక సడలి అతడు తేటగా మాట్లాడాడు. 36 ✝ఆ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారిని ఆదేశించాడు గానీ వారినెంత ఎక్కువగా ఆదేశించాడో అంత ఎక్కువగా వారు దానిని చాటించారు. 37 వారు అమితంగా ఆశ్చర్యపడిపోయారు, “ఈయన అన్నిటినీ బాగు చేశాడు! చెవిటివాళ్ళు వినేలా చేస్తున్నాడు. మూగవాళ్ళను మాట్లాడిస్తున్నాడు!” అని చెప్పుకొన్నారు.