6
1  ఆయన అక్కడనుంచి వెళ్ళి తన సొంత ప్రాంతానికి చేరాడు. ఆయన శిష్యులు ఆయన వెంట వచ్చారు. 2 విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజకేంద్రంలో ఉపదేశించడం మొదలు పెట్టాడు. ఆయన ఉపదేశం విన్న చాలామంది ఎంతో ఆశ్చర్యపడుతూ “ఈ మనిషికి ఇలాంటివి ఎక్కడనుంచి వచ్చాయి! ఇతనికి కలిగిన ఈ జ్ఞానమెక్కడిది? ఇతని చేతుల మీదుగా ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయేమిటి? 3 అతడు వడ్రంగి కదూ! మరియ కొడుకు కదూ! యాకోబు, యోసే, యూదా సిమియోనులకు ఇతడు అన్నే గదా! ఇతడి చెల్లెళ్ళు ఉన్నది ఇక్కడే మన దగ్గరేగా!” అని చెప్పుకొన్నారు. ఇలా వారికి ఆయనలో అభ్యంతర కారణం కలిగింది.
4 అయితే యేసు వారితో అన్నాడు “ప్రవక్త తన సొంత ప్రాంతంలో, సొంత వారిమధ్య, సొంత ఇంట్లో తప్ప మరెక్కడా గౌరవహీనుడు కాడు.”
5 అక్కడ ఆయన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని బాగు చేయడం తప్ప మరే అద్భుతం చేయలేక పోయాడు. 6  వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు.
అప్పుడాయన చుట్టుపట్ల గ్రామాలు తిరుగుతూ ఉపదేశిస్తూ ఉన్నాడు. 7 తన పన్నెండుమంది శిష్యులను దగ్గరకు పిలుచుకొని వారికి మలిన పిశాచాలమీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిని పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు: 8 “ప్రయాణానికి చేతికర్ర తప్ప మరేదీ తీసుకోకండి. ఆహారం గానీ చేతిసంచి గానీ నడికట్టులో డబ్బు గానీ తీసుకువెళ్ళకండి. 9 చెప్పులు వేసుకోండి గానీ రెండు చొక్కాలు తొడుక్కోకండి.”
10 ఆయన వారితో ఇంకా అన్నాడు “ఎక్కడైనా మీరొక ఇంటిలో ప్రవేశించినప్పుడు అక్కడనుంచి వెళ్ళేవరకు ఆ ఇంట్లోనే బస చేయండి. 11 ఎవరైతే మిమ్మల్ని స్వీకరించకపోతారో మీ మాటలు వినకపోతారో అక్కడనుంచి బయలుదేరేటప్పుడు వారికి వ్యతిరేకమైన సాక్ష్యంగా మీ పాద ధూళి దులిపివేయండి. నేను ఖచ్చితంగా మీతో చెపుతున్నాను, తీర్పు జరిగే రోజున ఆ గ్రామానికి పట్టే గతి కంటే సొదొమ, గొమొర్రా పట్టణాలకు పట్టే గతే ఓర్చుకోతగినది అవుతుంది.”
12 అందుచేత వారు తరలివెళ్ళి పశ్చాత్తాపపడండి అంటూ ప్రకటించారు. 13 అనేక దయ్యాలను వెళ్ళగొట్టారు, అనేక రోగులను నూనెతో అభిషేకించి బాగు చేశారు.
14 యేసు పేరు ప్రసిద్ధం కావడం వల్ల ఆ సంగతి రాజైన హేరోదుకు వినవచ్చింది. అతడన్నాడు “బాప్తిసమిచ్చే యోహాను చనిపోయిన వారిలోనుంచి సజీవంగా లేచాడు గనక అతడిలో అద్భుతాలు చేసే ఈ బలప్రభావాలు పని చేస్తున్నాయి.”
15 ఇతరులేమో “ఈయన ఏలీయా” అన్నారు. మరి కొందరు “ఈయన రావలసిన ప్రవక్త. లేదా, ప్రవక్తలలో ఒకరిలాంటివాడు” అన్నారు. 16 హేరోదైతే అది విని “యోహాను – నేను తల నరికించిన ఆ మనిషి – సజీవంగా లేపబడ్డాడు” అన్నాడు.
17 మునుపు హేరోదు తానే తన తోబుట్టువైన ఫిలిప్పు భార్య హేరోదియను పెళ్ళాడాడు. ఆమెకోసం అతడు మనుషులను పంపి యోహానును పట్టుకొని బంధించి ఖైదులో వేయించాడు. 18 ఎందుకంటే, యోహాను హేరోదుతో “మీ సోదరుడి భార్యను పెట్టుకోవడం మీకు న్యాయం కాదు” అన్నాడు. 19 అందుచేత హేరోదియ అతనిమీద పగపట్టి అతణ్ణి చంపాలని ఆశించింది గానీ ఆమెచేత కాలేదు. 20 ఎందుకంటే, యోహాను న్యాయవంతుడూ పవిత్రుడూ అని తెలిసి హేరోదు అతనికి భయపడుతూ అతణ్ణి కాపాడాడు. అతడు యోహాను మాటలు విన్నప్పుడెల్లా అనేకమైన వాటిని చేశాడు. సంతోషంతో విన్నాడు.
21 అయినప్పటికీ ఒక రోజున హేరోదియకు అవకాశం చిక్కింది. హేరోదు తన జన్మ దినాన తన ఘనులకూ సహస్రాధిపతులకూ గలలీలోని ప్రముఖులకూ విందు చేయించాడు. 22 అప్పుడు హేరోదియ కూతురు లోపలికి వచ్చి నాట్యం చేసి హేరోదునూ అతడితోపాటు భోజనానికి కూర్చుని ఉన్నవారినీ మెప్పించింది. ఆమెతో రాజు “నీకేది ఇష్టమో దానికోసం నన్నడుగు. నీకిస్తాను” అన్నాడు. 23 అతడు ఒట్టు పెట్టుకొని “నన్నేమడిగినా సరే – నా రాజ్యంలో సగం మట్టుకు – నీకిస్తాను” అన్నాడు.
24 ఆమె బయటికి వెళ్ళి తన తల్లిని “నేనేం అడగాలి?” అని అడిగింది. “బాప్తిసమిచ్చే యోహాను తలను అడుగు!” అని తల్లి చెప్పింది.
25 వెంటనే ఆమె తొందరగా రాజు దగ్గరకు వచ్చి “బాప్తిసమిచ్చే యోహాను తలను పళ్ళెంలో ఇప్పుడే నాకిప్పించండి. నాకు కావలసినది అదే” అని అడిగింది.
26 రాజుకు చాలా విచారం కలిగింది. అయినా తాను చేసిన శపథాల కారణంగా, తనతో కూర్చుని ఉన్న వారిని బట్టి ఆమె మనవి త్రోసిపుచ్చడం అతడికి ఇష్టం లేకపోయింది. 27 అందుచేత యోహాను తలను తెమ్మని వెంటనే ఆజ్ఞ జారీ చేసి తలారిని పంపించాడు. అతడు వెళ్ళి ఖైదులో యోహాను తలను నరికివేశాడు. 28 పళ్ళెంలో అతని తలను తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆమె దానిని ఆమె తల్లికిచ్చింది. 29 ఆ సంగతి విని యోహాను శిష్యులు వచ్చి అతని మృతదేహాన్ని తీసుకువెళ్ళి సమాధిలో ఉంచారు.
30  యేసు రాయబారులు ఆయనదగ్గరకు తిరిగి సమకూడి తాము చేసినదంతా ఉపదేశించినదంతా ఆయనకు చెప్పారు. 31 ఆయన వారితో “పదండి, ఒక నిర్జన స్థలానికి వెళ్దాం. అక్కడ కొద్ది కాలం సేద తీర్చుకోండి” అన్నాడు. ఎందుకంటే చాలామంది వస్తూ పోతూ ఉండడంవల్ల వారికి భోజనం చేసే తీరిక కూడా లేకపోయింది. 32 కనుక వారు పడవలో ఏకాంతంగా నిర్జన స్థలానికి వెళ్ళిపోయారు. 33 అయితే వారు వెళ్ళిపోతూ ఉంటే జన సమూహాలు చూచి చాలామంది ఆయనను గుర్తుపట్టి అన్ని ఊళ్ళనుంచి పరిగెత్తుతూ వెళ్ళి వారికంటే ముందుగా కాలి నడకను ఆ స్థలానికి చేరారు. తరువాత వారు ఆయన దగ్గర గుమికూడారు. 34 యేసు అక్కడ చేరినప్పుడు పెద్ద జన సమూహం ఆయనకు కనిపించింది. వారు కాపరి లేని గొర్రెల లాంటివారని ఆయన వారిమీద జాలిపడి వారికి అనేక సంగతులు ఉపదేశించ సాగాడు.
35 చాలా పొద్దు పోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి “ఇది అరణ్యం. ఇప్పుడు చాలా పొద్దు పోయింది. 36 వారికి తినడానికి ఏమీ లేదు. గనుక వారు వెళ్ళి తినడానికి రొట్టె కొనేలా చుట్టుపట్ల ఉన్న పల్లెసీమకూ గ్రామాలకూ వారిని పంపివెయ్యి” అన్నారు.
37 అయితే ఆయన “మీరే వారికి ఆహారం పెట్టండి” అని వారికి జవాబిచ్చాడు.
అందుకు వారు ఆయనతో “మేము వెళ్ళి రెండు వందల దేనారాల రొట్టెలు కొని తినడానికి వీరికివ్వమంటావా?” అని అడిగారు.
38 ఆయన వారితో “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్ళి చూడండి” అన్నాడు.
వారు ఆ సంగతి తెలుసుకొని “అయిదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అన్నారు.
39 అప్పుడాయన అందరినీ గుంపులుగా పచ్చికమీద కూర్చోబెట్టాలని వారిని ఆదేశించాడు. 40 వారు నూరేసిమంది చొప్పున, యాభయ్యేసి మంది చొప్పున బారులు తీరి కూర్చున్నారు. 41 ఆయన ఆ అయిదు రొట్టెలూ రెండు చేపలూ చేతపట్టుకొని ఆకాశంవైపు తలెత్తి చూస్తూ దేవునికి కృతజ్ఞత అర్పించాడు. అప్పుడు రొట్టెలు విరిచి జనానికి వడ్డించాలని శిష్యులకందించాడు. చేపలను కూడా అందరికీ పంచి పెట్టాడు. 42 అందరూ తిని సంతృప్తి చెందారు. 43 మిగిలిన రొట్టె ముక్కలూ చేపలూ పన్నెండు గంపల నిండా ఎత్తారు. 44 రొట్టెలు తిన్న పురుషులే దాదాపు అయిదు వేలమంది.
45 వెంటనే ఆయన జన సమూహాన్ని పంపివేస్తూ తన శిష్యులను తనకంటే ముందుగా అవతల ఒడ్డుకు బేత్‌సయిదాకు వెళ్ళండని పడవ ఎక్కించాడు. 46 ప్రజలను పంపివేసిన తరువాత ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాడు. 47 సాయంకాలమైనప్పుడు ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది, ఆయన ఒక్కడే మెరకమీద ఉన్నాడు. 48 గాలి వారికెదురుగా వీస్తూ ఉండడం వల్ల పడవ తెడ్లతో నడపడం చాలా కష్టమైంది. అది చూచి సుమారు నాలుగో జామున ఆయన సరస్సుమీద నడుస్తూ వారికి దగ్గరగా వచ్చాడు. ఆయన వారిని దాటిపోబోయాడు. 49 కానీ ఆయన సరస్సుమీద నడుస్తూ ఉండడం వారు చూచినప్పుడు ఆయన ఒక భూతం అనుకొని కేకలుపెట్టారు. 50 ఎందుకంటే వారందరు ఆయనను చూచి హడలిపోయారు. వెంటనే ఆయన వారిని పలకరించి “ధైర్యం వహించండి! నేనే! భయపడకండి!” అన్నాడు.
51 ఆయన వారి దగ్గరకు వచ్చి పడవెక్కాడు. గాలి ఆగింది. వారు లోలోపల ఆశ్చర్యపడుతూ అమితంగా విస్మయం చెందారు. 52 ఎందుకంటే ఆ రొట్టెల సంగతి వారికి అర్థం కాలేదు, వారి గుండెలు బండబారిపోయి ఉన్నాయి.
53 అవతలి ఒడ్డుకు వెళ్ళి వారు గెన్నేసెరెతు ప్రాంతానికి చేరుకొన్నారు, అక్కడ లంగరు వేశారు. 54 వారు పడవ దిగిన వెంటనే ప్రజలు ఆయనను గుర్తుపట్టి, 55 చుట్టుపట్ల ఉన్న ప్రాంతమంతటా పరుగెత్తివెళ్ళి రోగులను వారి మంచాలమీద తీసుకురాసాగారు. ఆయన ఎక్కడున్నాడని వింటే అక్కడికి చేరారు. 56 ఆయన ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ పల్లెసీమలో ప్రవేశించినా వారు రోగులను సంత వీధులలో పడుకోబెట్టి వారిని కనీసం ఆయన వస్త్రం అంచును ముట్టనివ్వండని ఆయనను ప్రాధేయపడ్డారు. ఆయనను తాకినవారందరికీ పూర్తిగా నయం అయింది.