5
1 ✽వారు సరస్సు ఒడ్డున ఉన్న గదరెనివారి ప్రాంతానికి వచ్చారు. 2 ✽ఆయన పడవ దిగినవెంటనే మలిన పిశాచం పట్టిన ఒక మనిషి సమాధులలో నుంచి ఆయనకు ఎదురుగా వచ్చాడు. 3 ✽సమాధులలోనే అతడి నివాసం. అతణ్ణి ఎవరూ సంకెళ్ళతో సహా కట్టలేకపోయారు. 4 అంతకుముందు తరచుగా అతణ్ణి కట్లతో, సంకెళ్ళతో కట్టారు గానీ అతడు సంకెళ్ళను తెంపివేశాడు, కట్లను ముక్కలు చేశాడు. అతణ్ణి లొంగదీసేది ఎవరిచేతా కాలేదు. 5 రాత్రింబగళ్ళు అతడు సమాధులలో, కొండలలో ఉండి ఎప్పుడూ కేకలు వేస్తూ రాళ్ళతో తనను గాయపరచుకొంటూ ఉన్నాడు.6 అతడు దూరంనుంచి యేసును చూచినప్పుడు పరుగెత్తుకు వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు, 7 ✽“యేసూ! సర్వాతీతుడైన దేవుని కుమారా! నాతో నీకేం పని? నన్ను వేధించనని దేవుని పేర నిన్ను ఒట్టు పెట్టిస్తున్నాను!” అంటూ గొంతెత్తి అరిచాడు. 8 ఎందుకంటే ఆయన అతణ్ణి చూచి “మలిన పిశాచమా! ఆ మనిషిని విడిచి బయటికి రా!” అన్నాడు.
9 ఆయన “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన✽, మేము చాలామందిమి” అని అతడు జవాబిచ్చాడు. 10 ✝అతడు ఆ దేశంనుంచి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలుకొన్నాడు.
11 అక్కడ కొండలదగ్గర ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. 12 “మేము పందులలో దూరేలా మమ్మల్ని వాటిలోకి పంపెయ్యి” అని ఆ దయ్యాలంతా ఆయనను వేడుకొన్నాయి. 13 వెంటనే యేసు వాటికి సెలవిచ్చాడు. ఆ మలిన పిశాచాలు ఆ మనిషిలోనుంచి బయటికి వచ్చి పందులలో చొరబడ్డాయి. అప్పుడా పందుల మంద ఆ నిట్రమైన స్థలం మీద నుంచి వేగంగా పరుగెత్తుతూ సరస్సులో పడి మునిగి చచ్చాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి.
14 పందులు మేపేవారు పారిపోయి ఆ సంగతి ఊరిలో, పల్లెసీమలో చెప్పారు. జరిగినదేమిటో చూద్దామని అక్కడివారు వచ్చారు. 15 ✽యేసు దగ్గరకు వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన ఆ మనిషి బట్టలు తొడుక్కొని మనఃస్థిమితంతో కూర్చుని ఉండడం చూశారు. వారికి భయం వేసింది. 16 జరిగినది చూచినవారు దయ్యాలు పట్టిన ఆ మనిషి విషయంలో సంభవించినది, పందుల సంగతి కూడా వారికి తెలియజేశారు. 17 అప్పుడు వారు యేసును చూచి తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకోసాగారు.
18 ఆయన పడవ ఎక్కుతూ ఉంటే అంతకుముందు దయ్యాలు పట్టినవాడు ఆయనదగ్గర తనను ఉండనిమ్మని బ్రతిమిలాడాడు. 19 కానీ యేసు అతణ్ణి రానివ్వలేదు. దానికి బదులు అతడితో “నీవు ఇంటికి వెళ్ళి ప్రభువు నీమీద జాలి చూపి నీకెంత గొప్ప క్రియలు చేశాడో నీవారికి చెప్పు✽” అన్నాడు. 20 ✽అతడు వెళ్ళి యేసు తనకెంత గొప్ప క్రియలు చేశాడో అదంతా దెకపొలిలో చాటించసాగాడు. అందరికి ఎంతో ఆశ్చర్యం వేసింది.
21 ✽యేసు పడవలో అవతలి ఒడ్డుకు మళ్ళీ చేరినప్పుడు పెద్ద జన సమూహం ఆయన దగ్గర సమకూడింది. ఆయన సరస్సు ఒడ్డున ఉన్నాడు. 22 అప్పుడు యూద సమాజ కేంద్రం అధికారి ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. ఆ అధికారి పేరు యాయీరు. 23 “నా చిన్న కూతురు చావుబతుకుల్లో ఉంది. ఆమె బాగుపడి బతికేలా మీరు వచ్చి ఆమెమీద చేతులు ఉంచండి” అంటూ యేసును హృదయ పూర్వకంగా బతిమాలుకొన్నాడు.
24 ఆయన అతడితోకూడా వెళ్ళాడు. పెద్ద జన సమూహం ఆయన వెంట వెళ్ళింది. జనం ఆయనమీద విరగబడుతూ ఉన్నారు. 25 ✽✽ పన్నెండేళ్ళనుంచి రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది. 26 ✽ఈమె అనేకమంది వైద్యులచేత అనేక బాధలు అనుభవిస్తూ తనకు కలిగినదంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఎక్కువైంది. 27 ఆమె యేసును గురించి విని, 28 “ఆయన బట్టలను తాకితే చాలు, నాకు పూర్తిగా నయమవుతుంది” అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం తాకింది. 29 వెంటనే ఆమెకు రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమయిన అనుభవం శరీరంలో కలిగింది.
30 వెంటనే యేసు తనలోనుంచి ప్రభావం వెలువడిందని గ్రహించి జన సమూహం వైపుకు తిరిగి “నా బట్టలను తాకినదెవరు?” అన్నాడు.
31 ఆయన శిష్యులు ఆయనతో “ఈ గుంపు నీమీద విరగబడుతూ ఉండడం చూస్తున్నావు గదా. మరి, ‘నన్ను తాకినదెవరు?’ అంటున్నావా?” అన్నారు. 32 ఆయనైతే అలా చేసిన ఆమెను చూడడానికి చుట్టూ కలియజూశాడు. 33 ఆ స్త్రీ తనకు జరిగినది గ్రహించి భయంతో వణకుతూ వచ్చి ఆయన ముందు పడి నిజమంతా చెప్పుకొంది.
34 ✽ ఆయన ఆమెతో అన్నాడు “కుమారీ, నీ నమ్మకం నిన్ను బాగు చేసింది. బాధ నివారణ పొంది శాంతితో వెళ్ళు.”
35 ✽ఆయన ఇంకా మాట్లాడుతూ ఉంటే ఆ సమాజ కేంద్రం అధికారి ఇంటినుంచి కొందరు వచ్చి “మీ కూతురు చనిపోయింది. ఇక బోధకుణ్ణి తొందర పెట్టడమెందుకు?” అన్నారు.
36 ✽వారు చెప్పిన మాట యేసు విన్న వెంటనే సమాజకేంద్రం అధికారితో “భయపడకు! నమ్మకం మాత్రం ఉంచు” అన్నాడు.
37 ఆయన పేతురునూ యాకోబునూ యాకోబు తోబుట్టువైన యోహానునూ తప్ప ఇంకెవరినీ తనవెంట రానివ్వలేదు. 38 ఆయన సమాజకేంద్రం అధికారి ఇంటిదగ్గర చేరినప్పుడు సందడిగా ఉండడం ఆయన చూశాడు. అక్కడివారు బిగ్గరగా ఏడుస్తూ రోదనం చేస్తూ ఉన్నారు. 39 ✝ఆయన ఇంట్లో ప్రవేశించి “ఎందుకు సందడి చేస్తూ ఏడుస్తూ ఉన్నారు? పిల్ల చనిపోలేదు. నిద్రపోతూ ఉంది, అంతే” అన్నాడు. 40 వారు నవ్వి ఆయనను వేళాకోళం చేశారు.
ఆయన వారందరినీ బయటికి పంపిన తరువాత, ఆ పిల్ల తల్లిదండ్రులనూ తనతో ఉన్నవారినీ వెంటబెట్టుకొని పిల్ల పడుకొని ఉన్న గదిలోకి వెళ్ళాడు. 41 ✽ఆ పిల్ల చేయి తన చేతిలోకి తీసుకొని “తలితా కుమీ!” అని ఆమెతో చెప్పాడు. ఆ మాటకు “చిన్న పిల్లా, నీతో నేనంటున్నాను, లే!” అని అర్థం.
42 వెంటనే ఆ పిల్ల లేచి నడిచింది (ఆమె వయస్సు పన్నెండేళ్ళు). దీనితో వారు ఎంతో విస్మయం చెందారు. 43 ✝ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకూడదని ఆయన వారిని గట్టిగా ఆదేశించి ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా పెట్టాలని చెప్పాడు.