4
1  మరోసారి ఆయన సరస్సు ఒడ్డున ఉపదేశించడం మొదలుపెట్టాడు. ఆయన దగ్గర చాలా పెద్ద జన సమూహం సమకూడడంవల్ల ఆయన సరస్సులో పడవ ఎక్కి కూర్చున్నాడు. జన సమూహమంతా సరస్సుదగ్గర నేలమీద ఉన్నారు. 2 ఆయన ఉదాహరణలలో వారికి అనేక సంగతులు నేర్పుతూ తన ఉపదేశంలో వారితో ఇలా అన్నాడు:
3 “ఇదిగో వినండి! విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. 4 విత్తనాలు చల్లుతూ ఉంటే, కొన్ని దారిప్రక్కన పడ్డాయి. గాలిలో ఎగిరే పక్షులు వచ్చి వాటిని మ్రింగివేశాయి. 5 మరి కొన్ని విత్తనాలు మన్ను ఎక్కువగా లేని రాతి నేల మీద పడ్డాయి. మన్ను లోతు లేకపోవడం వల్ల అవి త్వరలోనే మొలకెత్తాయి. 6 గానీ ప్రొద్దు పొడిచినప్పుడు ఆ మొలకలు మాడిపోయాయి. వాటికి వేరులు లేవు గనుక వాడిపోయాయి. 7 మరి కొన్ని విత్తనాలు ముండ్ల తుప్పల్లో పడ్డాయి. ముండ్ల తుప్పలు పెరిగి మొక్కలను అణచివేయడం వల్ల అవి పంటకు రాలేదు. 8 మరి కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి పెరిగి వృద్ధి అవుతూ పంటకు వచ్చాయి. ముప్ఫయి రెట్లు, అరవై రెట్లు, నూరు రెట్లు పండాయి.” 9 ఆయన ఇంకా అన్నాడు, “వినడానికి చెవులున్న వాడు వింటాడు గాక!”
10 ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులూ ఆయన చుట్టూ ఉన్నవారూ ఆ ఉదాహరణ గురించి ఆయనను అడిగారు. 11 ఆయన వారితో ఇలా అన్నాడు: “దేవుని రాజ్యానికి చెందిన రహస్య సత్యం మీకివ్వబడింది. కానీ బయటివారికి ప్రతిదీ ఉదాహరణలలో చెప్పడం జరుగుతున్నది. 12 కారణమేమంటే, వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి; వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. లేదా, ఒకవేళ వారు మళ్ళుకొని పాపక్షమాపణ పొందుతారేమో.”
13 ఆయన వారితో ఇంకా అన్నాడు “ఈ ఉదాహరణ అర్థం మీకు తెలియదా? అలాగైతే ఉదాహరణలన్నీ మీరెలా అర్థం చేసుకొంటారు? 14 విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు. 15 దారిప్రక్కన ఉన్నవారి సంగతి ఇలా ఉంది: అక్కడ వాక్కు చల్లబడుతూ ఉంటే వారు విన్నప్పుడు, వెంటనే సైతాను వచ్చి వారి హృదయాలలో చల్లిన వాక్కును తీసివేస్తాడు. 16 అదే విధంగా రాతి నేల మీద చల్లిన విత్తనాలు ఎవరంటే వారు వాక్కు వినీ వినడంతోనే సంతోషంతో దానిని అంగీకరిస్తారు. 17 కానీ వారిలో వేరులు లేకపోవడం వల్ల కొద్ది కాలమే నిలిచి ఉంటారు. అప్పుడు వాక్కు కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే వారు తొట్రుపడిపోతారు. 18 ముండ్ల తుప్పలలో చల్లిన విత్తనాలలాగా ఉన్నవారు వాక్కు వింటారు, 19 గానీ ఇహలోక చింతలు, ధనం మూలమైన మోసం, ఇతరమైనవాటిని గురించిన కోరికలు లోపలికి ప్రవేశించి వాక్కును అణచి ఫలించకుండా చేస్తాయి. 20 మంచి నేలమీద చల్లిన విత్తనాలలాగా ఉన్నవారు వాక్కు విని దానిని అంగీకరించి ఫలిస్తారు. కొందరు ముప్ఫయి రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు నూరు రెట్లు ఫలిస్తారు.”
21 ఆయన వారితో ఇంకా అన్నాడు, “దీపం తెచ్చి బుట్టక్రింద, లేక మంచంక్రింద ఉంచుతారా? దాన్ని దీపస్తంభం మీద ఉంచుతారు గదా. 22 దాచి ఉంచిన ఏదీ తేటతెల్లం కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచిన ప్రతిదీ బట్టబయలు అయ్యేందుకే ఉంది. 23 ఎవరికైనా వినడానికి చెవులుంటే వింటారు గాక!”
24 ఆయన వారితో ఇంకా అన్నాడు “మీరేమి వింటారో శ్రద్ధ వహించండి. మీరు ఏ కొలతతో ఇస్తారో ఆ కొలతతోనే మీకు ఇవ్వబడుతుంది. చెవిని పెట్టే మీకు అంతకంటే ఎక్కువ ఇవ్వబడుతుంది. 25 కలిగిన వ్యక్తికి ఇంకా ఇవ్వడం, లేని వ్యక్తి నుంచి అతనికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది.”
26 ఆయన ఇలా అన్నాడు: “దేవుని రాజ్యం ఒకతను భూమిమీద విత్తనాలు చల్లినట్టుంది. 27 రాత్రింబగళ్ళు అతడు నిద్రపోతూ మేల్కొంటూ ఉంటే, అతనికి తెలియని విధంగానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతాయి. 28 ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొక్కను, తరువాత వెన్నును, ఆ తరువాత వెన్నులో ముదిరిన గింజలను పుట్టిస్తుంది. 29 పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని అతడు వెంటనే కొడవలి పెట్టి కోస్తాడు.”
30 ఆయన ఇంకా అన్నాడు “దేవుని రాజ్యం దేనితో సరిపోల్చాలి? ఏ ఉదాహరణతో దానిని వివరించాలి? 31 అది ఆవగింజ లాంటిది. భూమిలో చల్లే విత్తనాలన్నిటిలో ఆవగింజ చిన్నది. 32 అయినా దానిని చల్లిన తరువాత అది మొలిచి పెరిగి కూర మొక్కలన్నిటి కంటే పెద్దదవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూళ్ళు కట్టుకోగలిగేటంత పెద్ద కొమ్మలు అది వేస్తుంది.”
33 వారు గ్రహించగలిగిన కొద్ది యేసు ఇలాంటి అనేక ఉదాహరణలతో వాక్కు వారికి ఉపదేశించాడు. 34 ఉదాహరణ లేకుండా ఆయన వారికి ఉపదేశించలేదు. అయితే ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు అన్నీ వివరించి చెప్పాడు.
35 ఆ రోజే సాయంకాలమైనప్పుడు ఆయన వారితో “అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు. 36 ఉన్నపాటున ఆయనతో కూడా వారు జనసమూహాన్ని విడిచిపెట్టి పడవలో బయలుదేరారు. ఆయన వెంట మరి కొన్ని పడవలు వచ్చాయి. 37 అప్పుడు పెద్ద తుఫాను రేగింది. అలలు పడవలోకి కొట్టినందుచేత అది నీళ్ళతో నిండిపోతూ ఉంది. 38 ఆయనైతే పడవ వెనుక భాగంలో దిండుమీద నిద్రపోతూ ఉన్నాడు. వారాయనను మేల్కొలిపి “బోధకుడా, నశించిపోతున్నాం! నీకేమీ పట్టదా?” అన్నారు.
39 ఆయన లేచి గాలిని మందలించి సరస్సుతో “ఊరుకో! నిశ్శబ్దంగా ఉండు!” అన్నాడు. గాలి ఆగిపోయింది. అంతా పూర్తిగా ప్రశాంతమైపోయింది.
40 అప్పుడాయన వారితో “మీకు ఇంత భయమెందుకని? మీకు నమ్మకం లేకపోవడమెందుకు?” అన్నాడు.
41 వారు అధికంగా భయపడుతూ ఒకరితో ఒకరు “ఈయన ఎవరో! గాలి, సరస్సు సహా ఈయనకు లోబడుతున్నాయి!” అని చెప్పుకొన్నారు.