3
1 మరో సారి ఆయన సమాజ కేంద్రంలోకి వెళ్ళాడు. అక్కడ చేయి ఎండిపోయినవాడొకడు ఉన్నాడు. 2 ఆయన విశ్రాంతి దినాన అతణ్ణి బాగు చేస్తాడేమో అని వారాయనను చూస్తూ ఉన్నారు. ఆయనమీద నేరం మోపాలని వారి ఉద్దేశం.
3 ఆయన చేయి ఎండిపోయినవాడితో “ఇటు దగ్గరకు రా!” అన్నాడు. 4 అప్పుడాయన వారితో అన్నాడు, “విశ్రాంతి దినాన మేలు చేయడం, కీడు చేయడం, ప్రాణాన్ని దక్కించడం, చంపడం ఏది ధర్మం?” అందుకు వారు ఊరుకొన్నారు.
5 ఆయన వారి హృదయ కాఠిన్యానికి నొచ్చుకొని వారివైపు కోపంతో కలయజూశాడు. అప్పుడా మనిషితో “నీ చేయి చాపు!” అన్నాడు. అతడు దానిని చాపగానే అది మరో చేయి ఎంత బాగుగా ఉందో అంత పూర్తిగా నయమయింది. 6 అప్పుడు పరిసయ్యులు బయటికి వెళ్ళి, వెంటనే హేరోదురాజు పక్షంవారితో కలిసి యేసును ఎలా రూపుమాపుదామా అని ఆయనమీద కుట్ర పన్నారు.
7 యేసు తన శిష్యులతోపాటు సరస్సు ఒడ్డుకు వెళ్ళిపోయాడు. గలలీనుంచి ఒక పెద్ద జన సమూహం ఆయన వెంట వెళ్ళారు. 8 అంతే కాదు. ఆయన చేస్తున్న వాటి గురించి విని యూదయ నుంచీ జెరుసలం, ఇదుమియా, యొర్దాను నది అవతల ప్రాంతంనుంచీ తూరు, సీదోను నుంచీ జనం చాలా పెద్ద గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చారు. 9 జన సమూహం తనమీద పడకుండా ఉండేందుకు తన కోసం ఒక పడవను సిద్ధం చేయండని ఆయన తన శిష్యులతో చెప్పాడు. 10 ఆయన అనేకులను బాగు చేసినందుచేత రోగాలతో ఉన్నవారంతా ఆయనను తాకాలని ఆయన దగ్గరకు తోసుకు వస్తూ ఉన్నారు. 11 మలిన పిశాచాలు పట్టినవారు ఆయనను చూడగానే “నీవు దేవుని కుమారుడివి” అని అరుస్తూ ఆయన ముందు సాష్టాంగపడ్డారు. 12 ఆయన తన విషయం తెలియజేయకూడదని ఆ పిశాచాలను ఆజ్ఞాపించాడు.
13 తరువాత ఆయన కొండమీదికి ఎక్కిపోయి తనదగ్గరకు ఎవరిని పిలవాలని ఇష్టపడ్డాడో వారిని పిలిచాడు. వారు ఆయనదగ్గరకు వచ్చారు. 14 వారు తనతో ఉండాలనీ ప్రకటించడానికి వారిని పంపాలనీ 15 వారికి రోగాలను పూర్తిగా నయం చేసేందుకూ దయ్యాలను వెళ్ళగొట్టేందుకూ అధికారం ఉండాలనీ ఆయన పన్నెండుమందిని నియమించాడు. 16 వారెవరంటే, సీమోను (అతనికి పేతురు అనే పేరు పెట్టాడు), 17 జెబెదయి కొడుకు యాకోబు, యాకోబు తోబుట్టువు యోహాను (వీరికి బోయనేర్గెస్ అనే పేరు పెట్టాడు. ఆ మాటకు “ఉరిమేవారు” అని అర్థం), 18 అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, 19 యేసును శత్రువులకు పట్టి ఇచ్చిన ఇస్కరియోతు యూదా. తరువాత వారు ఒక ఇంటిలో ప్రవేశించారు. 20 జనసమూహం మళ్ళీ గుమికూడడం చేత వారు భోజనం చేయడానికి కూడా వీలు లేకపోయింది. 21 దీన్ని గురించి విని ఆయన సొంతవారు “అతనికి మతి పోయింది” అని చెప్పి ఆయనను పట్టుకోవడానికి వచ్చారు. 22 జెరుసలం నుంచి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు “ఇతడు బయల్‌జెబూల్ పట్టినవాడు. ఆ దయ్యాల నాయకుడి సహాయంతోనే దయ్యాల్ని వెళ్ళగొట్టేస్తున్నాడు” అన్నారు.
23 అందుచేత యేసు వారిని తనదగ్గరకు పిలిచి వారితో ఉదాహరణలలో ఇలా అన్నాడు: “సైతాను సైతానును వెళ్ళగొట్టడమెలాగు? 24 ఏదైనా ఒక రాజ్యం తనను తానే వ్యతిరేకించి చీలిపోతే ఆ రాజ్యం నిలవడం అసాధ్యం. 25 ఏదైనా ఒక ఇల్లు తనను తానే వ్యతిరేకించి చీలిపోతే ఆ ఇల్లు నిలవడం అసాధ్యం. 26 అలాగే సైతాను తనమీద తానే విరోధంగా లేచి చీలిపోయాడూ అంటే వాడు నిలవలేక అంతమవుతాడు. 27 మొదట బలవంతుణ్ణి కట్టివేయకపోతే ఎవరూ ఆ బలవంతుడి ఇంట్లో చొచ్చి వాడి సామాను దోచుకోలేరు. కట్టివేస్తేనే వాడి ఇంటిని దోచుకోగలరు. 28 మీతో ఖచ్చితంగా అంటున్నాను, మనుషుల పాపాలన్నిటికీ వారు చెప్పే దూషణలన్నిటికీ క్షమాపణ దొరుకుతుంది. 29 కానీ దేవుని పవిత్రాత్మకు వ్యతిరేకంగా దూషణ చేసే వ్యక్తికి క్షమాపణ అంటూ ఎన్నడూ దొరకదు. అలా చేసే వ్యక్తి శాశ్వత శిక్షావిధికి లోనయ్యేవాడు.” 30 వారు తనకు మలిన పిశాచం పట్టిందని అన్నందుచేత ఆయన ఈ విధంగా చెప్పాడు.
31 అప్పుడు ఆయన తల్లి, ఆయన తమ్ముళ్ళు వచ్చి బయట నిలుచుండి ఆయనను రమ్మని కబురంపారు. 32 జనం ఆయన చుట్టూ గుంపుగా కూర్చుని ఉన్నారు. వారు ఆయనతో “మీ తల్లి, మీ తమ్ముళ్ళు బయట ఉండి మీకోసం వెతుకుతూ ఉన్నారు” అన్నారు.
33 ఆయన వారితో “ఎవరు నా తల్లి? ఎవరు నా తమ్ముళ్ళు?” అని జవాబిచ్చాడు. 34 తన చుట్టూ కూర్చుని ఉన్నవారిని కలయ చూస్తూ ఆయన ఇంకా అన్నాడు “ఇరుగో నా తల్లి! నా తమ్ముళ్ళు! 35 ఎందుకంటే, దేవుని ఇష్టప్రకారం ప్రవర్తించేవారే నా తమ్ముడు, నా చెల్లెలు, నా తల్లి.”