2
1 ✽కొన్ని రోజులయిన తరువాత ఆయన కపెర్‌నహూంకు తిరిగి వచ్చాడు. ఆయన ఇంట్లో ఉన్నాడని వినవచ్చి నప్పుడు 2 తక్షణమే చాలామంది అక్కడ గుమికూడారు. వారికి ఇంట్లో చేరడానికి తలుపుదగ్గర కూడా స్థలం లేకపోయింది. ఆయన వారికి దేవుని వాక్కు ప్రకటించాడు. 3 అప్పుడు ఒక పక్షవాత రోగిని నలుగురు మనుషులు ఆయన ఉన్న ఇంటికి మోసుకువచ్చారు. 4 జన సమూహం ఒత్తిడిని బట్టి యేసుదగ్గరకు అతణ్ణి తీసుకురాలేక, ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికప్పు ఊడదీసి సందు చేసి దాని గుండా పక్షవాత రోగి పడుకొని ఉన్న పరుపును దింపారు.5 యేసు వారి విశ్వాసం చూచి పక్షవాత రోగితో “కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
6 ధర్మశాస్త్ర పండితులు కొందరు అక్కడ కూర్చుని ఉన్నారు. వారి హృదయాలలో ఇలా ఆలోచించుకొన్నారు: 7 “ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నాడేమిటి! దేవదూషణ చేస్తున్నాడు. దేవుడు తప్ప పాపాలు క్షమించగలవారెవరు?”
8 వారు లోలోపల అలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వెంటనే వారితో అన్నాడు, “మీ హృదయాలలో ఈ విషయాలు ఆలోచించడం ఎందుకు? 9 ఏది సులభం? పక్షవాత రోగితో ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? లేక ‘లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు’ అనడమా? 10 అయితే మానవ పుత్రునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి.” అలా చెప్పి ఆయన పక్షవాత రోగితో 11 “నీతో నేనంటున్నాను, లేచి నీ పరుపు ఎత్తుకొని ఇంటికి వెళ్ళు.”
12 అతడు వెంటనే లేచి పరుపెత్తుకొని వారందరి సమక్షంలో బయటికి నడుస్తూ వెళ్ళాడు. గనుక వారంతా విస్మయం చెంది, “మనం ఇలాంటిదేదీ ఎన్నడూ చూడలేదు” అంటూ దేవుణ్ణి స్తుతించారు.
13 ✽ఆయన సరస్సు ఒడ్డుకు తిరిగి వెళ్ళాడు. జనమంతా ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన వారికి ఉపదేశించాడు. 14 ఆయన ముందుకు నడిచి వెళ్తూ ఉంటే సుంకం వసూలు చేసే స్థానంలో అల్ఫయి కొడుకు లేవీ కూర్చుని ఉండడం చూశాడు. అతడితో “నా వెంట రా!” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు.
15 ✝ఆ తరువాత యేసు అతడి ఇంట్లో భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు సుంకంవారూ పాపులూ అనేకులు ఆయనతోను ఆయన శిష్యులతోను కూర్చున్నారు. అలాంటివారు చాలా మంది ఆయన వెంట వెళ్ళేవారు. 16 ఆయన పాపులతో, సుంకంవారితో కలిసి భోజనం చేయడం ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు చూచినప్పుడు ఆయన శిష్యులతో వారు అన్నారు “ఇతడు సుంకంవారితో, పాపులతో కలిసి భోజన పానాలు చేస్తున్నాడేమిటి?”
17 అది విని యేసు వారితో అన్నాడు “జబ్బు చేసినవారికే వైద్యుడు అవసరం గానీ బాగున్న వారికి కాదు. నేను పాపులనే పశ్చాత్తాపపడాలని పిలవడానికి వచ్చాను గానీ న్యాయవంతులను కాదు.”
18 ✝యోహాను శిష్యులూ పరిసయ్యులూ ఉపవాసం ఉన్నప్పుడు వారు వచ్చి “యోహాను శిష్యులూ పరిసయ్యుల శిష్యులూ ఉపవాసముంటారు గదా. మరి, మీ శిష్యులు ఉపవాసముండరేమిటి?” అని ఆయనను అడిగారు.
19 యేసు వారికిలా జవాబిచ్చాడు: “పెళ్ళి కుమారుడు తమతో ఉన్నప్పుడు ఆయన ఇంటివారు ఉపవాసం ఉండగలరా? పెళ్ళి కుమారుడు తమతో ఉన్నంత కాలం వారు ఉపవాసముండలేరు. 20 అయితే పెళ్ళికుమారుణ్ణి వారి దగ్గరనుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి. ఆ రోజుల్లో వారు ఉపవాసముంటారు. 21 పాత వస్త్రానికి క్రొత్త బట్ట ఎవరూ మాసిక వేయరు. వేస్తే ఆ క్రొత్త మాసిక పాత వస్త్రంనుంచి చించుకొంటుంది. చినుగు పెద్దదవుతుంది. 22 ఎవరూ కూడా కొత్త ద్రాక్షరసం పాత తిత్తులలో పోయరు. పోస్తే, క్రొత్త రసంవల్ల ఆ తిత్తులు చినిగిపోతాయి. రసం కారిపోతుంది. తిత్తులూ పాడవుతుంది. క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలో పోయాలి.”
23 ✝విశ్రాంతి దినాన ఆయన పంట చేలలో పడి వెళ్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు వెళ్తూ కంకులు తెంపుకోసాగారు. 24 అప్పుడు పరిసయ్యులు ఆయనతో “చూడు, విశ్రాంతి దినాన చేయకూడని పని వారు చేస్తున్నారేమిటి?” అన్నారు.
25 ఆయన వారితో అన్నాడు “దావీదు, అతనితో ఉన్నవారు అక్కరలో ఉండి ఆకలిగొన్నప్పుడు అతడు ఏమి చేశాడో మీరెన్నడూ చదవలేదా? 26 అబ్యాతార్ ప్రముఖ యాజిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించాడు, సన్నిధి రొట్టెలు తిన్నాడు, తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు. ఆ రొట్టెలు యాజులు తప్ప మరెవ్వరూ తినకూడదు.” 27 అప్పుడాయన వారితో “విశ్రాంతి దినం✽ మనుషుల కోసమే గానీ మనుషులు విశ్రాంతిదినం కోసం చేయబడలేదు. 28 అందుచేత మానవ పుత్రుడు✽ విశ్రాంతి దినానికి కూడా ప్రభువే✽!” అన్నాడు.