మార్కు శుభవార్త
1
1 దేవుని కుమారుడైన✽ యేసు క్రీస్తు శుభవార్త✽ఆరంభం. 2 ✝ప్రవక్తల రచనల్లో ఇలా ఉంది: ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ఎదుట నీ దారి సిద్ధం చేస్తాడు. 3 “ఎడారిలో ఒకతని స్వరం ఇలా ఘోషిస్తూ ఉంది: ప్రభువుకోసం దారి సిద్ధం చేయండి! ఆయనకోసం త్రోవలు తిన్ననివి చేయండి!”4 ✝బాప్తిసమిచ్చే యోహాను అరణ్యంలో కనిపించి పాపక్షమాపణ గురించిన పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసం ప్రకటిస్తూ ఉన్నాడు. 5 ✝యూదయ ప్రదేశంవారూ జెరుసలం నగరవాసులూ అందరూ అతని దగ్గరకు వెళ్ళారు, తమ పాపాలను ఒప్పుకొంటూ అతనిచేత యొర్దాను నదిలో బాప్తిసం పొందుతూ ఉన్నారు. 6 యోహాను ఒంటె రోమాల బట్టలు తొడుక్కొని నడుముకు తోలు దట్టీ కట్టుకొనేవాడు, మిడతలు, అడవి తేనె తినేవాడు.
7 అతడు ప్రకటిస్తూ “నాకంటే బలప్రభావాలు ఉన్నవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను. 8 నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చాను. కానీ ఆయన దేవుని పవిత్రాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు” అన్నాడు.
9 ఆ రోజులలో యేసు గలలీలోని నజరేతు నుంచి వచ్చి యోహానుచేత యొర్దానులో బాప్తిసం పొందాడు. 10 నీళ్ళ నుంచి ఆయన రాగానే ఆకాశం చీలిపోవడం, దేవుని ఆత్మ పావురంలాగా తన మీదికి దిగిరావడం చూశాడు. 11 అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “నీవు నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం.”
12 ✽ వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్యంలోకి త్రోసుకువెళ్ళాడు. 13 యేసు అరణ్యంలో నలభై రోజులు సైతానుచేత విషమ పరీక్షలకు గురి అయ్యాడు. అడవి మృగాల మధ్య ఉన్నాడు. దేవదూతలు ఆయనకు సేవ చేశారు.
14 ✝యోహాను ఖైదుపాలయిన తరువాత యేసు గలలీకి వచ్చి దేవుని రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఇలా అన్నాడు: 15 ✝“కాలం పూర్తి అయింది. దేవుని రాజ్యం దగ్గరగా ఉన్నది. పశ్చాత్తాపపడి శుభవార్త నమ్మండి.”
16 ✝ఆయన గలలీ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉన్నప్పుడు సీమోను, అతడి తోబుట్టువు అంద్రెయ సరస్సులో వల వేయడం చూశాడు. వారు చేపలు పట్టేవారు. 17 వారితో యేసు అన్నాడు “నా వెంట రండి! మనుషులను పట్టే జాలరులుగా మిమ్ములను చేస్తాను.” 18 వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను అనుసరించారు. 19 ఆయన ఇంకా కొద్ది దూరం వెళ్ళి జెబెదయి కొడుకు యాకోబునూ అతడి తోబుట్టువు యోహానునూ చూశాడు. వారు ఒక పడవలో ఉండి వలలు సిద్ధం చేసుకొంటూ ఉన్నారు. 20 వెంటనే ఆయన వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని కూలివారితోపాటు పడవలోనే విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.
21 వారు కపెర్‌నహూం✽ వెళ్ళారు. వెంటనే, విశ్రాంతి దినాన, ఆయన యూద సమాజ కేంద్రంలోకి వెళ్ళి ఉపదేశించాడు. 22 ✝అక్కడివారు ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే, ధర్మశాస్త్ర పండితులలాగా కాక అధికారం గలవాడిలాగా ఆయన ఉపదేశించాడు. 23 అప్పుడు వారి సమాజ కేంద్రంలో మలిన పిశాచం✽ పట్టినవాడొకడు ఉన్నాడు. 24 ✽అతడు “నజరేతువాడైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పవిత్రుడివే!” అంటూ బిగ్గరగా అరిచాడు.
25 ✽యేసు ఆ పిశాచాన్ని మందలిస్తూ “ఊరుకో. అతనిలోనుంచి బయటికి రా!” అన్నాడు.
26 ఆ మలిన పిశాచం అతణ్ణి గిజగిజలాడించి పెడ బొబ్బ పెట్టి అతనిలోనుంచి బయటికి వచ్చింది. 27 ✽అందరికీ ఎంతో ఆశ్చర్యం వేసింది. “ఏమిటిది! ఈ కొత్త ఉపదేశం ఏమిటి? ఆయన మలిన పిశాచాలకు సహా అధికారంతో ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అవేమో ఆయనకు లోబడుతున్నాయి!” అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకొంటూ చెప్పుకొన్నారు. 28 త్వరలోనే ఆయనను గురించి కబుర్లు గలలీ ప్రాంతం చుట్టుప్రక్కలా అంతటా వ్యాపించాయి.
29 ✝సమాజ కేంద్రంనుంచి బయటికి వచ్చిన వెంటనే వారు సీమోను అంద్రెయల ఇంటికి వెళ్ళారు. వారితోపాటు యాకోబు, యోహాను వచ్చారు. 30 సీమోను అత్త జ్వరంతో పడి ఉంది. వెంటనే ఆమెను గురించి వారాయనతో చెప్పారు. 31 ఆయన ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకొని ఆమెను లేవనెత్తగానే జ్వరం పోయింది. ఆమె వారికి పరిచర్య చేయసాగింది.
32 సాయంకాల సమయాన ప్రొద్దు క్రుంకిన తరువాత ప్రజలు రోగులందరినీ దయ్యాలు పట్టినవారందరినీ ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. 33 పట్టణమంతా ఆ తలుపు దగ్గర గుమికూడారు. 34 ✽ఆయా జబ్బులతో ఉన్నవారిని అనేకులను ఆయన బాగు చేశాడు, అనేక దయ్యాలను బయటికి వెళ్ళగొట్టాడు. తాను ఎవరో దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
35 ✽వేకువ జామున, పగలుకు చాలా సేపటికి ముందు, ఆయన లేచి నిర్జన స్థలానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 36 సీమోను, అతనితో ఉన్నవారు ఆయనను వెదకుతూ వెళ్ళారు. 37 ఆయన కనబడ్డప్పుడు “అందరూ నీకోసం వెదకుతున్నారు” అని ఆయనతో అన్నారు.
38 ✽ వారితో ఆయన “దగ్గరగా ఉన్న గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను వచ్చినది ఇందుకు” అన్నాడు.
39 ✝ఆయన గలలీలో నలుదిక్కులకూ పర్యటిస్తూ యూదుల సమాజ కేంద్రాలలో ప్రకటిస్తూ దయ్యాలను వెళ్ళగొట్టివేస్తూ ఉన్నాడు.
40 ✝కుష్ఠురోగి ఒకడు ఆయనదగ్గరకు వచ్చి ఆయనముందు మోకరిల్లి “మీకిష్టం ఉంటే నన్ను శుద్ధంగా చేయగలరు” అంటూ బ్రతిమిలాడాడు.
41 యేసుకు జాలి వేసింది. చేయి చాచి అతణ్ణి తాకి అతడితో “నాకిష్టమే. శుద్ధంగా ఉండు!” అన్నాడు.
42 ఆయన మాట్లాడిన వెంటనే అతడి కుష్ఠు పోయింది, అతడు శుద్ధమయ్యాడు. 43 అతణ్ణి వెంటనే పంపివేస్తూ ఆయన ఇలా గట్టిగా హెచ్చరిస్తూ అతడితో అన్నాడు, “చూడు, ఈ విషయం ఎవరితో ఏమీ చెప్పకు! 44 అయితే వెళ్ళి యాజికి కనబడు. వారికి సాక్ష్యంగా నీ శుద్ధికోసం మోషే ధర్మశాస్త్రంలో విధించినవాటిని అర్పించు.”
45 ✽కానీ అతడు వెళ్ళి ఈ సంగతి అధికంగా చాటిస్తూ విస్తరింపజేయసాగాడు. అందుచేత యేసు ఏ పట్టణంలోకీ బహిరంగంగా వెళ్ళలేక నిర్జన ప్రదేశాలలో ఉండిపోవలసి వచ్చింది. అయినా నలుదిక్కుల నుంచీ జనులు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు.