27
1 ఉదయం అయినప్పుడు ప్రధాన యాజులంతా ప్రజల పెద్దలంతా యేసును చంపించేందుకు ఆయనను గురించి సమాలోచన జరిపారు. 2 ఆయనను బంధించి తీసుకువెళ్ళి అధిపతి పొంతి పిలాతుకు అప్పగించారు.
3  ఆయనను పట్టి ఇచ్చిన యూదా ఆయనకు శిక్ష విధించడం చూచి విచారపడ్డాడు, ఆ ముప్ఫయి వెండి నాణేలు ప్రధాన యాజులకూ పెద్దలకూ తెచ్చి ఇచ్చి, 4 “నిర్దోషిని పట్టి ఇచ్చి ఆయన రక్తం విషయం అపరాధం చేశాను” అన్నాడు.
వారు “అది మాకేం పట్టింది? ఆ సంగతి నీవే చూచుకో” అన్నారు.
5 అతడు ఆ వెండి నాణేలు దేవాలయంలో పారవేసి వెళ్ళిపోయి ఉరి పెట్టుకొన్నాడు. 6 ఆ వెండి నాణేలు తీసుకొని ప్రధాన యాజులు ఇలా అన్నారు: “ఇవి రక్తాన్ని కొన్న డబ్బు, గనుక ఇవి దేవాలయ ధనాగారంలో ఉంచడం ధర్మశాస్త్ర విరుద్ధం.”
7 వారు సమాలోచన జరిపి, విదేశీయులను పాతిపెట్టడానికి ఆ డబ్బుతో కుమ్మరి పొలం కొన్నారు. 8 ఆ కారణంచేత ఈ రోజువరకు ఆ పొలాన్ని “నెత్తురు పొలం” అంటారు. 9 యిర్మీయాప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్కు అప్పుడు నెరవేరింది: ఆయన గురించి వెలకట్టిన ధర ఇస్రాయేల్‌ప్రజలు ఆయనకు కట్టిన ధర – ఆ ముప్ఫయి వెండి నాణేలు – వారు తీసుకొన్నారు, 10 ప్రభువు నాకు ఆజ్ఞాపించినట్టే కుమ్మరి పొలం కోసం ఇచ్చారు.
11 యేసు అధిపతి ముందర నిలిచాడు. “నీవు యూదుల రాజువా?” అని అధిపతి ఆయనను అడిగాడు.
“నీవే అంటున్నావు గదా” అని యేసు అతనితో అన్నాడు.
12  ప్రధాన యాజులూ పెద్దలూ తనమీద నేరాలు మోపుతూ ఉన్నప్పుడు ఆయన జవాబేమీ చెప్పలేదు.
13 కాబట్టి పిలాతు “నీకు వ్యతిరేకంగా వీళ్ళు ఎన్ని విషయాలగురించి సాక్ష్యమిస్తున్నారో నీవు వినడం లేదా?” అని ఆయనను అడిగాడు. 14 అయితే అతనికి ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు గనుక అధిపతికి అత్యంత ఆశ్చర్యం కలిగింది.
15 ఆ పండుగలో ప్రజలు కోరుకొన్న ఖైదీ ఒకణ్ణి వారికి విడుదల చేయడం అధిపతికి వాడుక. 16 ఆ కాలంలో పేరు మోసిన ఖైదీ ఒకడు చెరసాలలో ఉన్నాడు. అతడి పేరు బరబ్బ. 17 గనుక ప్రజలు పోగై వచ్చినప్పుడు పిలాతు వారినిలా అడిగాడు:
“నేనెవణ్ణి మీకు విడుదల చేయాలని కోరుతున్నారు? బరబ్బనా? క్రీస్తు అనే యేసునా?”
18 ఎందుకంటే, వారు అసూయ కారణంగా ఆయనను అప్పగించారని అతనికి తెలుసు.
19 అతడు న్యాయపీఠంమీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య ఇలా చెప్పి పంపింది: “ఆ న్యాయవంతుని జోలికి పోకండి. ఈవేళ ఆయన కారణంగా కలలో నేననేకమైన వాటితో బాధపడ్డాను.”
20 కానీ బరబ్బను విడుదల చేయండనీ, యేసును చంపించండనీ అడగడానికి ప్రధాన యాజులూ పెద్దలూ జనసమూహాలను పురికొలిపారు.
21 అధిపతి “ఈ ఇద్దరిలో నేనెవణ్ణి విడుదల చేయాలని కోరుతున్నారు?” అని అడిగినప్పుడు వారు “బరబ్బనే” అన్నారు.
22 అందుకు పిలాతు “అలాగైతే క్రీస్తు అనే యేసును నేనేం చేయాలి?” అని వారినడిగాడు.
అందరూ “అతణ్ణి సిలువ వేయాలి!” అన్నారు.
23 “ఎందుకు? ఇతడు ఏం కీడు చేశాడు?” అని అధిపతి అడిగాడు.
వాళ్ళు “అతణ్ణి సిలువ వేయాలి!” అంటూ మరి ఎక్కువగా కేకలు పెట్టారు.
24 తన ప్రయత్నంవల్ల ప్రయోజనమేమీ లేదనీ, అల్లరి మాత్రం చెలరేగుతూ ఉందనీ పిలాతు గ్రహించాడు. గనుక నీళ్ళు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఇలా అన్నాడు: “ఈ న్యాయవంతుని రక్తం విషయంలో నేను నిరపరాధిని. మీరే చూచుకోండి.”
25 అందుకు ప్రజలంతా ఇలా జవాబిచ్చారు: “అతడి రక్తం మామీద, మా సంతానం మీద ఉంటుంది గాక!”
26 అప్పుడతడు బరబ్బను వారికోసం విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. 27 అప్పుడు అధిపతి సైనికులు యేసును అధిపతి భవనంలోకి తీసుకువెళ్ళి, తక్కిన సైనికుల గుంపునంతా ఆయన చుట్టూ పోగుచేశారు. 28 వాళ్ళు ఆయన బట్టలు ఒలిచివేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు. 29 ముండ్ల కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో రెల్లుకర్ర ఒకటి ఉంచారు. అప్పుడు వాళ్ళు ఆయన ముందర మోకరించి “యూదుల రాజా, శుభం” అంటూ ఆయనను వెక్కిరించారు. 30 వాళ్ళు ఆయనమీద ఉమ్మివేశారు. ఆ రెల్లుకర్ర పట్టుకొని ఆయన తలమీద కొట్టారు. 31 ఆయనను వెక్కిరించిన తరువాత ఆ అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి, ఆయనను సిలువ వేయడానికి తీసుకువెళ్ళారు. 32 వారు బయటికి వస్తూ ఉండగానే సీమోను అనే కురేనే ప్రాంతీయుడు కనబడ్డాడు. వారు బలవంతాన యేసు సిలువను అతనిచేత మోయించారు.
33 వారు గొల్గొతా అనే స్థలానికి వచ్చారు. గొల్గొతా అంటే ‘కపాల స్థలం’ అని అర్థం. 34  అక్కడ వారు చేదు కలిపిన పుల్లని ద్రాక్షరసం ఆయనకు త్రాగడానికి ఇచ్చారు గాని, దానిని రుచి చూచినప్పుడు నిరాకరించాడు. 35  వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలకోసం చీట్లు వేసి పంచుకొన్నారు. ప్రవక్త ఇలా చెప్పినది నెరవేరేలా ఇది జరిగింది: “నా వస్త్రాలను తమలో తాము పంచుకొని నా అంగీ కోసం చీట్లు వేశారు.” 36 అక్కడే కూర్చుని ఆయనకు కావలి కాస్తూ ఉన్నారు. 37 ఆయనమీద మోపిన నేరం ఇలా వ్రాసి ఆయన తలకు పైగా ఉంచారు:
ఇతడు యూదుల రాజైన యేసు.
38 ఆయనతో కూడా ఇద్దరు దోపిడీ దొంగలను, ఒకణ్ణి ఆయన కుడివైపున, మరొకణ్ణి ఎడమవైపున సిలువ వేయడం జరిగింది.
39 ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ, ఆయనను దూషిస్తూ ఇలా అన్నారు: 40 “దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టేవాడా! నిన్ను నీవే రక్షించుకో! నీవు దేవుడి కుమారుడివైతే సిలువనుంచి దిగిరా!”
41 అలాగే ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ ఆయనను వెక్కిరిస్తూ ఇలా అన్నారు: 42 “ఇతడు ఇతరుల్ని రక్షించాడు, తనను రక్షించుకోలేడు! ఇతడు ఇస్రాయేల్ రాజయితే ఇప్పుడు అతణ్ణి సిలువ దిగిరానియ్యి. అప్పుడు అతణ్ణి నమ్ముతాం. 43 ఇతడు దేవునిమీద నమ్మకం ఉంచాడు గదా! ‘నేను దేవుని కుమారుణ్ణి’ అన్నాడుగా. ఇతడంటే దేవునికి ఇష్టం ఉంటే ఇప్పుడు ఆయన ఇతణ్ణి తప్పిస్తాడు గాక!”
44 ఆయనతో సిలువ వేయబడ్డ దోపిడీదొంగలు కూడా అలాగే ఆయనను నిందించారు.
45 మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. 46 సుమారు మూడు గంటలప్పుడు యేసు ఇలా బిగ్గరగా కేక వేశాడు: “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ?” ఆ మాటలకు “నా దేవా! నా దేవా! నా చేయి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం.
47 అక్కడ నిలుచున్నవారిలో కొంతమంది అది విని “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.
48 వెంటనే వారిలో ఒకడు పరుగెత్తుకొంటూ వెళ్ళి స్పంజీ తెచ్చి, పులిసిపోయిన ద్రాక్షరసంలో ముంచి రెల్లుకు తగిలించి ఆయనకు త్రాగడానికి అందించాడు.
49 తక్కినవారు “ఉండండి. ఏలీయా ఇతణ్ణి రక్షించడానికి వస్తాడో రాడో చూద్దాం” అన్నారు.
50 యేసు మళ్ళీ బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు.
51 ఆ క్షణమే దేవాలయం తెర పైనుంచి క్రిందికి రెండుగా చినగడం జరిగింది, భూమి కంపించింది, బండలు బ్రద్ధలయ్యాయి, 52 సమాధులు తెరచుకొన్నాయి. కన్నుమూసిన అనేకులైన పవిత్రుల శరీరాలు సజీవంగా లేచాయి. 53 యేసు సజీవంగా లేచిన తరువాత వారు సమాధుల స్థలంలోనుంచి బయటికి వచ్చారు. పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు.
54 రోమన్‌ శతాధిపతి, అతడితో కూడా యేసుకు కావలి కాస్తూ ఉన్నవారు ఆ భూకంపం, జరిగినవి చూచినప్పుడు చాలా భయపడ్డారు, “నిజంగా ఈయన దేవుని కుమారుడు!” అన్నారు.
55 స్త్రీలు అనేకులు కూడా అక్కడ దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు. వారు యేసుకు పరిచర్య చేస్తూ, గలలీనుంచి ఆయనవెంట వచ్చినవారు. 56 వారిలో మగ్దలేనే మరియ, యాకోబు, యోసే అనేవారి తల్లి మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.
57 సాయంకాలం అయినప్పుడు అరిమతయినుంచి యోసేపు అనే ధనవంతుడు వచ్చాడు. అంతకు ముందు అతడు కూడా యేసు శిష్యుడయ్యాడు. 58 ఈ మనిషి పిలాతుదగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తనకిప్పించమని అడిగాడు. పిలాతు ఆ దేహాన్ని అతనికివ్వాలని ఆజ్ఞ జారీ చేశాడు. 59 యోసేపు ఆ దేహాన్ని తీసుకొని శుభ్రమైన సన్నని నారబట్టతో చుట్టాడు. 60 తాను రాతి స్థలంలో తొలిపించుకొన్న తన కొత్త సమాధిలో దానిని పెట్టాడు. సమాధి ద్వారానికి పెద్ద రాయి దొర్లించి వెళ్ళిపోయాడు. 61 మగ్దలేనే మరియ, ఆ మరో మరియ అక్కడ ఉండి ఆ సమాధికి ఎదురుగా కూర్చుని ఉన్నారు.
62 మరుసటి రోజున అంటే సిద్ధపడే రోజుకు తరువాతి రోజున – ప్రధాన యాజులూ పరిసయ్యులూ పోగై పిలాతు దగ్గరికి వెళ్ళి, 63 ఇలా అన్నారు: “అయ్యా, ఆ మోసగాడు బతికి ఉన్నప్పుడు ‘మూడు రోజుల తరువాత నేను సజీవంగా లేస్తాను’ అని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. 64 అందుచేత మూడో రోజువరకు సమాధిని భద్రం చేయాలని ఆజ్ఞ జారీ చేయండి. లేకపోతే రాత్రి వేళ అతడి శిష్యులు వెళ్ళి అతణ్ణి ఎత్తుకుపోయి, ‘ఆయన చనిపోయినవాళ్ళలో నుంచి సజీవంగా లేచాడు’ అని ప్రజలతో అంటారేమో. అలాంటప్పుడు మొదటి వంచనకంటే చివరి వంచన చెడ్డదవుతుంది.”
65 పిలాతు వారితో, “కావలివారున్నారు గదా. మీరు వెళ్ళి మీ శాయశక్తులా సమాధిని భద్రం చేయండి” అన్నాడు.
66 వారు వెళ్ళి కావలివారిని ఉంచి రాతికి ముద్ర వేసి సమాధికి కావలివారిని ఉంచారు.