26
1 ఈ మాటలన్నీ చెప్పడం ముగించిన తరువాత యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: 2 “రెండు రోజుల తరువాత పస్కాపండుగ ఉంటుందని మీకు తెలుసు. అప్పుడు మానవపుత్రుణ్ణి సిలువ వేయడానికి అప్పగించడం జరుగుతుంది.”
3 ఆ సమయంలో ప్రధాన యాజులు, ధర్మశాస్త్ర పండితులు, ప్రజల పెద్దలు, కయప అనే పేరుగల ప్రముఖయాజి భవనంలో పోగయ్యారు. 4 యేసును కపటంతో పట్టుకొని చంపాలని కుట్ర పన్నారు. 5 గాని, “ప్రజలలో అల్లరి జరుగుతుందేమో, గనుక పండుగలో పట్టుకోవద్దు” అని వారు చెప్పుకొన్నారు.
6 యేసు బేతనీలో కుష్ఠురోగి సీమోను ఇంటిలో ఉన్నప్పుడు, 7 ఒక స్త్రీ చలువరాతి బుడ్డిలో చాలా విలువైన అత్తరు తెస్తూ ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన భోజనానికి కూర్చుని ఉన్నాడు. ఆమె ఆ అత్తరు ఆయన తలమీద పోసింది. 8 అది చూచినప్పుడు ఆయన శిష్యులకు కోపం వచ్చింది. “ఎందుకీ నష్టం? 9 ఈ అత్తరు పెద్ద ధరకు అమ్మేసి బీదలకు ఇచ్చి ఉండవచ్చు గదా!” అన్నారు.
10 ఆ సంగతి తెలుసుకొని యేసు వారితో ఇలా అన్నాడు: “ఈ స్త్రీని ఎందుకు తొందర చేస్తున్నారు? ఈమె నా పట్ల ఒక మంచి పని చేసింది. 11 మీ దగ్గర బీదలు ఎప్పుడూ ఉంటారు. నేనైతే మీ దగ్గర ఎల్లప్పుడు ఉండను. 12 ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసినప్పుడు నన్ను పాతిపెట్టడం గురించి అలా చేసింది. 13 మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, సర్వలోకంలో ఈ శుభవార్త ప్రకటన జరిగే స్థలాలన్నిటిలో, ఈమెను జ్ఞాపకం చేసుకొని ఈ స్త్రీ చేసినదానిని గురించి చెప్పుకొంటారు.”
14 అప్పుడు పన్నెండుమంది శిష్యులలో ఒకడు ప్రధాన యాజుల దగ్గరికి వెళ్ళాడు. అతడి పేరు ఇస్కరియోతు యూదా. 15 “నేనాయనను మీకు పట్టిస్తే నాకేం ఇస్తారు?” అని అతడు అడిగాడు. అందుకు వారు ముప్ఫయి వెండి నాణేలు నిర్ణయించి అతడికిచ్చారు. 16 అప్పటినుంచి అతడు ఆయనను వారికి పట్టి ఇవ్వడానికి అవకాశంకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
17  పొంగని రొట్టెల పండుగ మొదటి రోజున శిష్యులు యేసుదగ్గరకు వచ్చి, “పస్కాను తినడానికి నీకోసం మేము ఏ స్థలం సిద్ధం చేయాలని ఉన్నావు?” అని అడిగారు.
18 ఆయన “నగరంలో ఫలాని మనిషి దగ్గరకు వెళ్ళి అతనితో ఇలా చెప్పండి: ‘నా కాలం దగ్గరపడింది. నా శిష్యులతో కూడా నీ ఇంట్లో పస్కాపండుగ ఆచరిస్తానని గురువు అంటున్నాడు’” అని. 19 యేసు తమకు ఆజ్ఞాపించినట్టు శిష్యులు చేసి పస్కాను సిద్ధం చేశారు.
20 సాయంకాలమైనప్పుడు ఆయన పన్నెండుమంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు. 21 వారు తింటూ ఉన్నప్పుడు ఆయన “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీలో ఒకడు నన్ను శత్రువులకు పట్టి ఇస్తాడు” అన్నాడు.
22 వారికి అత్యంత దుఃఖం కలిగింది. “నేను కాదు గదా, ప్రభూ!” అని ఒక్కొక్కరు ఆయనతో అన్నారు.
23 ఆయన ఇలా బదులు చెప్పాడు: “నాతోకూడా పాత్రలో చేయి ముంచేవాడే నన్ను పట్టివ్వబోయేవాడు. 24 మానవ పుత్రుణ్ణి గురించి వ్రాసి ఉన్న ప్రకారమే ఆయన చనిపోతాడు గాని ఎవడైతే మానవపుత్రుణ్ణి పట్టి ఇస్తాడో అయ్యో ఆ మనిషికి శిక్ష తప్పదు! ఆ మనిషి పుట్టకపోతేనే అతనికి బాగుండేది.”
25 ఆయనను పట్టి ఇవ్వబోయే యూదా “స్వామీ! నేను కాదు గదా” అన్నాడు. ఆయన అతనితో “నీవే అంటున్నావు గదా” అన్నాడు.
26 వారు తింటూ ఉన్నప్పుడు యేసు రొట్టె తీసుకొని, దీవించి, దానిని విరిచి శిష్యులకు ఇచ్చాడు. దీనిని తీసుకొని తినండి. ఇది నా శరీరం అన్నాడు.
27 అప్పుడు ఆయన పాత్ర తీసుకొని కృతజ్ఞత అర్పించి వారికిచ్చి ఇలా అన్నాడు: “మీరందరూ దీనిలోది త్రాగండి. 28 ఇది నా రక్తం – పాపక్షమాపణ కలిగేలా అనేకులకోసం చిందే క్రొత్త ఒడంబడిక రక్తం. 29 నేను మీతోకూడా నా తండ్రి రాజ్యంలో ఇలాంటి ద్రాక్షరసం మళ్ళీ త్రాగే రోజువరకు ఇక దానిని త్రాగనని మీతో చెపుతున్నాను.”
30 వారు కీర్తన పాడిన తరువాత ఆలీవ్‌కొండకు వెళ్ళారు.
31 అప్పుడు యేసు వారితో ఇలా అన్నాడు: “ఈ రాత్రి నా కారణంగా మీరందరూ తొట్రుపడతారు. ఎందుకంటే, ఇలా వ్రాసి ఉంది: కాపరిని హతం చేస్తాను, మందలోని గొర్రెలు చెదరి పోతాయి. 32  అయితే నేను సజీవంగా లేపబడిన తరువాత మీకంటే ముందుగా గలలీకి వెళ్ళిపోతాను.”
33 పేతురు “నీ కారణంగా అందరూ తొట్రుపడినా నేనెన్నడూ తొట్రుపడను” అని ఆయనతో బదులు చెప్పాడు.
34 యేసు “నీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, ఈ రాత్రే, కోడి కూసేముందే నన్నెరగనని మూడు సార్లు అంటావు” అని అతనితో అన్నాడు.
35 ఆయనతో పేతురు “నేను నీతో చావవలసి వచ్చినా నిన్ను ఎరగననను” అన్నాడు. తక్కిన శిష్యులంతా అలాగే అన్నారు.
36 అప్పుడు యేసు వారితోకూడా గెత్‌సేమనే అనే స్థలానికి వెళ్ళాడు. “నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఈలోపుగా మీరిక్కడ కూర్చుని ఉండండి” అని శిష్యులతో అన్నాడు.
37 ఆయన పేతురునూ జెబెదయి ఇద్దరు కొడుకులనూ తీసుకువెళ్ళి, దుఃఖం, కలత పొందసాగాడు. 38 అప్పుడాయన వారితో “నాకు ప్రాణం పోయేటంతగా దుఃఖం ముంచుకు వస్తూ ఉంది. మీరిక్కడ ఆగి నాతో మెళకువగా ఉండండి” అన్నాడు.
39 ఆయన కొద్ది దూరం వెళ్ళి, సాగిలపడి, ఇలా ప్రార్థన చేశాడు: “నా తండ్రీ! సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గరనుంచి తొలగిపోనియ్యి! అయినా నెరవేరవలసింది నా ఇష్టం కాదు, నీ ఇష్టమే!”
40  శిష్యుల దగ్గరికి వచ్చి వారు నిద్రపోతూ ఉండడం చూశాడు. “మీరు ఒక్క గంట సేపు కూడా నాతో మెళకువగా ఉండలేకపోయారా? 41 మీరు విషమ పరీక్షలో పడకుండా మెళకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే గాని, శరీరం దుర్బలం” అని పేతురుతో అన్నాడు.
42  రెండో సారి ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు, “నా తండ్రీ! నేను దీనిని త్రాగితేనే తప్ప ఈ గిన్నె తొలగిపోవడం సాధ్యం కాకపోతే నీ చిత్తమే నెరవేరుతుంది గాక!”
43 ఆయన తిరిగి వచ్చి, వారు నిద్రపోతూ ఉండడం చూశాడు. ఎందుకంటే, వారి కండ్లు మూతలు పడుతూ ఉన్నాయి. 44 ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్ళి, మూడో సారి ఆ మాటలే అంటూ ప్రార్థన చేశాడు.
45 అప్పుడు శిష్యులదగ్గరికి వచ్చి వారితో ఇలా అన్నాడు: “మీరింకా నిద్రపోతూ విశ్రాంతి తీసుకొంటున్నారా? ఇదిగో వినండి. మానవ పుత్రుణ్ణి పాపుల చేతులకు పట్టి ఇచ్చే ఘడియ దగ్గరపడింది. 46 లెండి, వెళ్దాం! ఇడుగో, నన్ను పట్టి ఇచ్చే వాడు దగ్గరలో ఉన్నాడు.”
47 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండుమంది శిష్యులలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజుల దగ్గరనుంచి, ప్రజల పెద్దల దగ్గరనుంచి వచ్చిన పెద్ద గుంపు అతడితో కూడా ఉన్నారు. వారు కత్తులూ కటార్లూ చేతపట్టుకొని ఉన్నారు. 48 ఆయనను పట్టి ఇచ్చేవాడు ముందుగానే వారితో ఒక గుర్తు చెపుతూ “నేనెవరిని ముద్దు పెట్టుకొంటానో ఆయనే యేసు. ఆయనను పట్టుకోండి” అన్నాడు.
49 అతడు వెంటనే యేసు దగ్గరకు వచ్చి “బోధకుడా! నీకు శుభం!” అంటూ ఆయనను ముద్దు పెట్టుకొన్నాడు.
50 అయితే యేసు అతడితో “మిత్రుడా, నీవెందుకు వచ్చావు?” అన్నాడు. అప్పుడు వారు వచ్చి యేసును చేతులతో పట్టుకొన్నారు. 51 వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు చేయి చాపి ఖడ్గాన్ని దూసి ప్రముఖ యాజి దాసుణ్ణి కొట్టి అతడి చెవి నరికివేశాడు.
52 యేసు అతడితో “నీ ఖడ్గం వరలో పెట్టు. ఖడ్గం పట్టుకొనేవారంతా ఖడ్గంతో నాశనం అవుతారు. 53 ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకొంటే, ఆయన వెంటనే పన్నెండు సేనావాహినుల కంటే ఎక్కువమంది దేవదూతలను నాకు అనుగ్రహించడనుకొంటున్నావా? 54 గాని అలా చేస్తే ఈ విధంగా జరగాలనే లేఖనం నెరవేరడం ఎలాగు?” అన్నాడు.
55 ఆ సమయంలో యేసు ఆ గుంపులతో “నేను దోపిడీ దొంగనయినట్టు మీరు కత్తులూ కటారులతో నన్ను పట్టుకోవడానికి వచ్చారేమిటి? ప్రతి రోజూ నేను మీ దగ్గర దేవాలయంలో కూర్చుని ఉపదేశం ఇచ్చేవాణ్ణే గదా. అప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. 56 గానీ ప్రవక్తల లేఖనాలు నెరవేరాలి గనుక ఇదంతా జరిగింది” అన్నాడు.
అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచి పారిపోయారు.
57 యేసును పట్టుకొన్నవాళ్ళు ఆయనను ప్రముఖయాజి అయిన కయప దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ పోగయి ఉన్నారు. 58 పేతురు యేసును ఎడం ఎడంగా అనుసరిస్తూ ప్రముఖయాజి ఇంటి ముంగిటి వరకు వచ్చాడు. చివరికి ఏమి జరుగుతుందో చూద్దామని ఆవరణంలోకి వెళ్ళి, భటులతో కూర్చున్నాడు.
59 ప్రధాన యాజులూ ప్రజల పెద్దలూ యూద సమాలోచన సభ అంతా యేసుకు మరణ శిక్ష విధించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యంకోసం చూస్తూ ఉన్నారు, 60 అయినా సాక్ష్యం ఏమీ దొరకలేదు. అబద్ధ సాక్షులు అనేకులు ముందుకు వచ్చారు గానీ ఏమీ దొరకలేదు. చివరికి ఇద్దరు అబద్ధ సాక్షులు ముందుకు వచ్చి 61 “ఇతడు దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేసి మూడు రోజులలో మళ్ళీ కట్టగలనన్నాడు” అన్నారు.
62 ప్రముఖయాజి నిలబడి, “నీవు జవాబేమీ చెప్పవా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా చెపుతున్న సాక్ష్యమేమిటి?” అని ఆయనను అడిగాడు. 63  యేసు ఊరుకొన్నాడు. అప్పుడు ప్రముఖయాజి ఆయనతో ఇలా అన్నాడు: “నీవు ప్రమాణ పూర్వకంగా మాకు చెప్పాలని జీవంగల దేవుని పేర నిన్ను ఆదేశిస్తున్నాం – నీవు అభిషిక్తుడివా? దేవుని కుమారుడివా?”
64 అందుకు యేసు “నీవే అంటున్నావు గదా. వాస్తవంగా మీతో నేను చెపుతున్నాను, ఇకముందు మానవ పుత్రుడు అమిత శక్తివంతుని కుడివైపు కూర్చుని ఉండడమూ, ఆకాశ మేఘాలమీద రావడమూ మీరు చూస్తారు” అన్నాడు.
65 అప్పుడు ప్రముఖయాజి తన వస్త్రాన్ని చింపుకొని “ఇతడు దేవదూషణ చేశాడు! మనకిక సాక్షులతో ఏం పని? చూడండి, ఇతడి దూషణ ఇప్పుడు విన్నారు గదా – 66 మీరేమంటారు?” అన్నాడు.
“ఇతడు చావుకు తగినవాడే!” అని వారు జవాబిచ్చారు.
67 అప్పుడు వారు ఆయన ముఖంమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దారు. కొందరు ఆయనను అరచేతులతో చరిచి 68 “అభిషిక్తుడా! నిన్ను కొట్టినది ఎవరు? ప్రవక్తగా పలుకు!” అన్నారు.
69 ఇంతలో పేతురు బయట ముంగిటిలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరకు వచ్చి, “గలలీవాడైన యేసుతో నువ్వు కూడా ఉన్నావు గదా!” అంది.
70 అయితే అతడు అందుకు ఒప్పుకోలేదు. “నువ్వు చెప్పేదేమిటో నాకు తెలియదు” అని అందరి ఎదుట అన్నాడు.
71 అతడు నడవలోకి వెళ్ళాడు. మరో పిల్ల అతణ్ణి చూచి, అక్కడ ఉన్నవారితో “ఇతడు నజరేతువాడైన యేసుతో కూడా ఉండేవాడు” అంది. 72 మళ్ళీ అతడు అందుకు ఒప్పుకోకుండా, ఒట్టు పెట్టుకొని “ఆ మనిషిని నేను ఎరగను” అన్నాడు.
73 కాసేపటికి ప్రక్కన నిలుచున్నవారు దగ్గరగా వచ్చి పేతురుతో అన్నారు, “నిజమే, నువ్వు కూడా వాళ్ళలో ఒకడివే! నీ మాట తీరు నీ సంగతి బయట పెడుతుంది.”
74 అందుకు అతడు ఒట్లూ శాపనార్థాలూ పెట్టుకొంటూ “నేనా మనిషిని ఎరగను” అన్నాడు.
తక్షణమే కోడి కూసింది. 75 “కోడి కూసేముందే నన్ను ఎరగనని మూడు సార్లు అంటావు” అని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం చేసుకొన్నాడు. అప్పుడు బయటికి వెళ్ళి, ఎంతో దుఃఖంతో భోరున ఏడ్చాడు.