25
1 “అప్పుడు✽ పరలోక రాజ్యం ఇలా ఉంటుంది: పదిమంది కన్యలు తమ దీపాలు చేతపట్టుకొని పెళ్ళి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి బయలుదేరారు. 2 ✽వారిలో అయిదుగురు తెలివి తక్కువవారు, అయిదుగురు తెలివైనవారు. 3 ✽తెలివి తక్కువవారు తమ దీపాలు మట్టుకు తీసుకుపోయారు గాని ఏ నూనె తీసుకుపోలేదు. 4 తెలివైనవారు తమ దీపాలతో కూడా సీసాలలో నూనె తీసుకువెళ్ళారు. 5 పెళ్ళి కుమారుడు ఆలస్యం చేస్తూ ఉంటే✽, వారంతా కునికి, నిద్రపోయారు.6 ✽“మధ్యరాత్రివేళ కేక ఇలా వినిపించింది: ‘ఇడుగో పెళ్ళి కుమారుడు వస్తున్నాడు! ఆయనకు ఎదురు వెళ్ళండి!’ 7 అప్పుడు కన్యలందరూ నిద్ర లేచి తమ దీపాలు సరిచేసుకొన్నారు. 8 ✽అయితే తెలివి తక్కువవారు తెలివైనవారితో ‘మా దీపాలు ఆరిపోతూ ఉన్నాయి! మీ నూనె కొంచెం మాకివ్వండి’ అన్నారు. 9 ✽అందుకు తెలివైనవారు ఇలా జవాబు చెప్పారు: ‘మాకూ మీకూ ఇది చాలదేమో. నూనె అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి.’
10 ✽“నూనె కొనడానికి వారు వెళ్ళిపోతూ ఉండగానే పెళ్ళి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్నవారు ఆయనతోకూడా పెళ్ళి విందుకు లోపలికి వెళ్ళారు. తలుపు మూయబడింది. 11 ✝తరువాత తక్కిన కన్యలు వచ్చారు. ‘ప్రభూ! ప్రభూ! మాకు తలుపు తెరవండి!’ అని అడిగారు. 12 గాని ఆయన ‘మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, మిమ్ములను ఎరగను✽’ అని జవాబిచ్చాడు.
13 ✽ “మానవ పుత్రుడు వచ్చే ఆ రోజు గానీ గడియ గానీ మీకు తెలియదు, గనుక మెళుకువగా ఉండండి.
14 ✽“పరలోక రాజ్యం ఈ విధంగా ఉంటుంది: ఒక మనిషి దూర దేశానికి ప్రయాణం కట్టి, తన దాసులను పిలిచి, తన ఆస్తిని వారికి అప్పచెప్పాడు. 15 ఒకనికి అయిదు తలాంతులు✽, ఇంకొకనికి రెండు, ఇంకొకనికి ఒకటి ఇచ్చాడు. ఎవరి సామర్థ్యం ప్రకారం వారికిచ్చాడు. అప్పుడతడు ప్రయాణమై పోయాడు. 16 ✽అయిదు తలాంతులు తీసుకొన్నవాడు వెళ్ళి వ్యాపారం చేసి మరో అయిదు తలాంతులు సంపాదించాడు. 17 అలాగే రెండు తలాంతులు తీసుకొన్నవాడు మరో రెండు సంపాదించాడు. 18 గానీ ఒక్క తలాంతు తీసుకొన్నవాడు వెళ్ళి నేలలో గుంట త్రవ్వి, అందులో తన యజమాని డబ్బు దాచిపెట్టాడు.
19 “చాలా కాలం✽ తరువాత ఆ దాసుల యజమాని వచ్చి వారి లెక్కలు✽ చూశాడు. 20 ✽అయిదు తలాంతులు తీసుకొన్నవాడు మరో అయిదు తలాంతులు తెచ్చి, ‘నా యజమానీ, మీరు అయిదు తలాంతులు నాకప్పచెప్పారు గదా. చూడండి, నేను మరో అయిదు తలాంతులు సంపాదించాను’ అన్నాడు. 21 ✽అతనితో అతని యజమాని ఇలా అన్నాడు: ‘భళా మంచి దాసుడా! నమ్మకమైనవాడివి! ఈ కొద్దిపాటి విషయాల్లో నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటిమీద నిన్ను నియమిస్తాను. నీ యజమాని ఆనందంలో ప్రవేశించు.’
22 “అప్పుడు రెండు తలాంతులు తీసుకొన్నవాడు కూడా వచ్చి, ‘నా యజమానీ, మీరు రెండు తలాంతులు నాకప్పచెప్పారు గదా. చూడండి, మరో రెండు తలాంతులు సంపాదించాను’ అన్నాడు. 23 ✽అతనితో అతని యజమాని ఇలా అన్నాడు: ‘భళా, మంచి దాసుడా! నమ్మకమైనవాడివి! ఈ కొద్దిపాటి విషయాల్లో నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటిమీద నిన్ను నియమిస్తాను. నీ యజమాని ఆనందంలో ప్రవేశించు’.
24 ✽“అప్పుడు ఒక్క తలాంతు తీసుకొన్నవాడు కూడా వచ్చాడు. ‘నా యజమానీ, మీరు కఠినులనీ విత్తనాలు వేయనిచోట కోస్తారు, వెదజల్లని చోట పంట పోగు చేస్తారు అనీ నాకు తెలుసు. 25 అంచేత నాకు భయం✽ వేసింది. నేను వెళ్ళి మీ తలాంతు భూమిలో దాచిపెట్టాను. ఇదిగో మీది మీరు తీసుకోండి’ అన్నాడు. 26 ✽అతని యజమాని అతనికి ఇలా జవాబిచ్చాడు: ‘నీవు చెడ్డ దాసుడివి! సోమరివాడివి! విత్తనాలు వేయని చోట కోస్తాననీ వెదజల్లని చోట పంట పోగుచేస్తాననీ నీకు తెలిసిందా? 27 ✽అలాంటప్పుడు నా డబ్బు సాహుకార్ల దగ్గర పెట్టవలసింది గదా. నేను వచ్చి నా డబ్బు వడ్డీతో కూడా తీసుకొనేవాణ్ణే. 28 ✽కాబట్టి ఆ తలాంతు అతడి దగ్గరనుంచి తీసివేసి పది తలాంతులున్నవానికి ఇవ్వండి. 29 ✝కలిగిన ప్రతివానికి ఇంకా ఇవ్వడం జరుగుతుంది. అతనికి సమృద్ధిగా ఉంటుంది. లేనివానినుంచి అతనికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది. 30 ✽పనికిమాలిన ఆ దాసుణ్ణి బయటి చీకటిలోకి త్రోసివేయండి. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం జరుగుతుంది.
31 “మానవ పుత్రుడు తన మహిమతోనూ✽ పవిత్ర దేవ దూతలందరితోనూ వచ్చేటప్పుడు తన మహిమా సింహాసనం✽ మీద కూర్చుంటాడు. 32 అప్పుడు జనాలన్నిటినీ✽ ఆయన సన్నిధానంలో సమకూర్చడం జరుగుతుంది. గొల్లవాడు మేకలలోనుంచి గొర్రెలను వేరు చేసినట్టే ఆయన వారిని ఒకరి దగ్గరనుంచి ఒకరిని వేరు చేస్తాడు. 33 ‘గొర్రెలను’ తన కుడి ప్రక్కన, ‘మేకలను’ ఎడమ ప్రక్కన ఉంచుతాడు.
34 “అప్పుడు రాజు తన కుడిప్రక్కన ఉన్నవారితో ఇలా అంటాడు: ‘నా తండ్రిచేత ఆశీస్సులు✽ పొందిన వారలారా, రండి! ప్రపంచం ఉనికిలోకి వచ్చినప్పటినుంచి మీకోసం దేవుడు సిద్ధం చేసిన రాజ్యానికి వారసులు✽ కండి. 35 ✽ఎందుకంటే, నాకు ఆకలి వేసింది, మీరు నాకు తినడానికి ఇచ్చారు. దాహం వేసింది, త్రాగడానికి ఇచ్చారు. పరాయివాడుగా ఉన్నాను, మీరు నన్ను లోపల చేర్చుకొన్నారు. 36 బట్టలు లేనప్పుడు నాకు బట్టలిచ్చారు. నాకు జబ్బు చేసింది, నన్ను పరామర్శించడానికి వచ్చారు. ఖైదులో ఉన్నాను, మీరు నన్ను చూడడానికి వచ్చారు.’
37 “అప్పుడు ఆ న్యాయవంతులు✽ ఆయనకిలా జవాబిస్తారు: ‘ప్రభూ! ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూచి భోజనం పెట్టాం? ఎప్పుడు దాహం వేయడం చూచి నీకు త్రాగడానికి ఇచ్చాం? 38 ఎప్పుడు నీవు పరాయివాడుగా ఉండడం చూచి లోపల చేర్చుకొన్నాం? ఎప్పుడు బట్టలు లేకపోవడం చూచి నీకు బట్టలిచ్చాం? 39 ఎప్పుడు నీకు జబ్బు చేయడం చూచి, నీవు ఖైదులో ఉండడం చూచి నీ దగ్గరికి వచ్చాం?’
40 ✽“అందుకు రాజు ‘మీతో ఖచ్చితంగా చెపుతున్నాను. ఈ నా సోదరులలో ఒక అత్యల్పునికి కూడా మీరు చేసినది ఏదైనా నాకూ చేసినట్టే’ అని వారితో జవాబిచ్చి చెపుతాడు.
41 “అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో ఇలా అంటాడు: ‘శాపానికి గురి అయిన వారలారా! నా దగ్గరనుంచి పోండి✽! అపనింద పిశాచానికీ వాడి దూతలకూ సిద్ధం చేసిన నిత్యాగ్ని✽లోకి పోండి! 42 ✽ఎందుకంటే, నాకు ఆకలి వేసింది గానీ మీరు నాకు తినడానికి ఏమీ ఇవ్వలేదు. నాకు దాహం వేసింది గానీ, త్రాగడానికి మీరేమీ నాకివ్వలేదు. 43 పరాయివాడుగా ఉన్నాను. మీరు నన్ను లోపల చేర్చుకోలేదు. బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. నాకు జబ్బు చేసినది, నేను ఖైదులో ఉన్నాను. నన్ను చూడడానికి మీరు రాలేదు.
44 ✽“వారు కూడా ఆయనకు ఇలా జవాబిస్తారు: ‘ప్రభూ! ఎప్పుడు నీవు ఆకలితో ఉండడం గానీ దాహంతో గానీ పరాయివాడుగా గానీ బట్టలు లేకుండా గానీ జబ్బుగా గానీ ఖైదులో గానీ ఉండడం చూచి నీకు సహాయం చేయలేదు?’ 45 ఆయన వారికిలా జవాబిస్తాడు: ‘మీతో ఖచ్చితంగా చెపుతున్నాను. వీరిలో అత్యల్పునికి చేయనిది ఏదైనా నాకూ చేయనట్టే.’
46 ✽“వీరు శాశ్వతమైన శిక్షలోకి వెళ్ళిపోతారు. న్యాయవంతులు శాశ్వత జీవంలో ప్రవేశిస్తారు.”