24
1 యేసు దేవాలయం విడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు దేవాలయం కట్టడాలను ఆయనకు చూపెట్టడానికి వచ్చారు. 2  అందుకు యేసు “ఇవన్నీ చూస్తున్నారు గదా. మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, ఇక్కడ రాయిమీద రాయి ఒక్కటి కూడా నిలవకుండా అన్నిటినీ పడద్రోయడం జరుగుతుంది” అని వారితో చెప్పాడు.
3 తరువాత ఆయన ఆలీవ్ కొండమీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “అవి ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు, యుగ సమాప్తికి సూచన ఏది? మాతో చెప్పు” అన్నారు.
4 యేసు వారికిలా జవాబిచ్చాడు: “మిమ్ములను ఎవరైనా మోసగించి తప్పుదారి పట్టించకుండా చూచుకోండి. 5 అనేకులు నా పేర వచ్చి ‘నేనే క్రీస్తును’ అంటూ చాలామందిని మోసగించి తప్పుదారి పట్టిస్తారు.
6 “మీరు యుద్ధవార్తలూ యుద్ధ వదంతులూ వింటారు. అప్పుడు కంగారుపడకుండా చూచుకోండి. ఇవన్నీ తప్పక జరగాలి గానీ, అంతం అప్పుడే రాదు. 7 జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తాయి. అక్కడక్కడ కరువులూ ఈతిబాధలూ భూకంపాలూ వస్తాయి. 8 ఇవన్నీ తొలి ప్రసవ వేదనల్లాంటివి మాత్రమే.
9  “అప్పుడు వారు మిమ్ములను బాధలకు గురి చేస్తారు, మిమ్ములను చంపుతారు. నా పేరు కారణంగా అన్ని దేశాల ప్రజలు మిమ్ములను ద్వేషిస్తారు. 10 ఆ కాలంలో చాలామంది తొట్రు పడిపోతారు, ఒకరినొకరు శత్రువులకు పట్టి ఇస్తారు, ఒకరినొకరు ద్వేషిస్తారు.
11 చాలామంది కపట ప్రవక్తలు వచ్చి అనేకులను మోసగించి తప్పుదారి పట్టిస్తారు. 12 న్యాయరాహిత్యం వృద్ధి అవుతుంది గనుక చాలామందికి ప్రేమ చల్లారిపోతుంది. 13  అయితే అంతంవరకు సహించేవారికి విముక్తి లభిస్తుంది. 14 ఈ రాజ్య శుభవార్త లోకమంతటా అన్ని జనాలకు సాక్ష్యంగా ప్రకటించడం జరుగుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.
15 “అందుచేత, దానియేలుప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ‘అసహ్యమైన వినాశకారి’ అతి పవిత్ర స్థలంలో నిలుచుండడం మీరు చూచినప్పుడు (చదివేవారు గ్రహిస్తారు గాక!) 16 వెంటనే యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. 17 మిద్దెమీద ఉన్న వ్యక్తి తన ఇంట్లోనుంచి దేన్నయినా తీసుకువెళ్ళడానికి దిగిరాకూడదు. 18 పొలంలో ఉన్న వ్యక్తి పై వస్త్రం తీసుకు వెళ్ళడానికి వెనక్కు తిరగకూడదు. 19 అయ్యో! ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకూ బాలింతలకూ ఎంతో కష్టం కలుగుతుంది. 20 అప్పుడు మహా బాధకాలం వస్తుంది. గనుక మీరు పారిపోవడం చలికాలంలో గానీ విశ్రాంతి దినాన గానీ జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి. 21 అలాంటి బాధకాలం లోకారంభంనుంచి ఇప్పటివరకు రాలేదు. ఆ తరువాత మరెన్నటికీ రాదు. 22 ఆ రోజులను తక్కువ చేయడం జరిగి ఉండకపోతే శరీరం ఉన్న ఎవరూ తప్పించుకొనేవారు కాదు. గానీ దేవుడు ఎన్నుకొన్నవారి కోసం ఆ రోజులను తక్కువ చేయడం జరుగుతుంది.
23 “ఆ కాలంలో ఎవరైనా మీతో ‘ఇడుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు!’ లేదా ‘అక్కడ ఉన్నాడు!’ అంటే నమ్మకండి. 24 కపట క్రీస్తులూ కపట ప్రవక్తలూ వస్తారు. సాధ్యమైతే, దేవుడు ఎన్నుకొన్నవారిని కూడా మోసగించి తప్పుదారి పట్టించడానికి మహా సూచనలూ అద్భుతాలూ ప్రదర్శిస్తారు. 25 నేను మీతో ముందుగానే చెప్పాను సుమా! 26 గనుక వారు ‘అడుగో, ఆయన ఎడారిలో ఉన్నాడు’ అంటే అటు వెళ్ళకండి. ‘అడుగో, లోపలి గదుల్లో ఉన్నాడు’ అంటే నమ్మకండి. 27 ఎందుకంటే, మెరుపు తూర్పున పుట్టి పడమరవరకు ఎలా తళుక్కుమంటుందో అలాగే మానవ పుత్రుని రాక ఉంటుంది. 28 పీనుగు ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి.
29 “ఆ రోజుల బాధ అయిపోయిన వెంటనే సూర్య మండలాన్ని చీకటి కమ్ముతుంది. చంద్రబింబం కాంతి ఇవ్వదు. ఆకాశంనుంచి చుక్కలు రాలుతాయి. ఆకాశాలలోని శక్తులు కంపించిపోతాయి. 30 అప్పుడు మానవ పుత్రుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు భూమిమీద ఉన్న అన్ని జాతులవారు గుండెలు బాదుకొంటారు, మానవ పుత్రుడు ఆకాశ మేఘాలమీద బలప్రభావాలతో, మహా మహిమా ప్రకాశంతో రావడం చూస్తారు. 31 ఆయన తన దేవదూతలను గొప్ప బూరధ్వనితో పంపుతాడు. వారు ఆయన ఎన్నుకొన్న వారిని నలుదిక్కులనుంచీ ఆకాశం ఆ చివరనుంచి ఈ చివరవరకు సమకూరుస్తారు.
32 “అంజూరచెట్టు ఉదాహరణ నేర్చుకోండి. దాని కొమ్మలు లేతగా తయారై ఆకులు పెట్టినప్పుడు వసంతకాలం దగ్గరపడిందని మీకు తెలుస్తుంది. 33 అలాగే ఈ సంగతులన్నీ జరగడం మీరు చూచినప్పుడు ఆయన సమీపంలోనే, తలుపుల దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. 34 మీతో నేను ఖచ్చితంగా అంటున్నాను, ఇవన్నీ జరిగే వరకు ఈ జాతి ఎంత మాత్రమూ గతించదు. 35 ఆకాశం, భూమి గతిస్తాయి గానీ నా మాటలు ఎన్నటికీ గతించవు.
36 “అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడోమనిషికీ తెలియదు. పరలోక దేవదూతలకూ తెలియదు. నా తండ్రికి మాత్రమే తెలుసు. 37 మానవపుత్రుని రాకడ నోవహు రోజులలాగే ఉంటుంది. 38 ఎలా అంటే, జలప్రళయానికి ముందు రోజుల్లో నోవహు ఓడలోకి వెళ్ళే రోజు వరకూ ప్రజలు తింటూ, త్రాగుతూ, పెళ్ళిళ్ళకు ఇచ్చి పుచ్చుకొంటూ వచ్చారు. 39 జల ప్రళయం వచ్చి వారందరినీ తీసుకుపోయేవరకు వారు గ్రహించలేదు. మానవ పుత్రుని రాకడ అలాగే ఉంటుంది. 40 అప్పుడు ఇద్దరు పురుషులు పొలంలో ఉంటారు. ఒకణ్ణి తీసుకుపోవడం, మరొకణ్ణి విడిచిపెట్టడం జరుగుతుంది. 41 ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుతూ ఉంటారు. ఒకతెను తీసుకుపోవడం, ఒకతెను విడిచిపెట్టడం జరుగుతుంది.
42 “మీ ప్రభువు ఏ గడియ వస్తాడో మీకు తెలియదు గనుక, మెళుకువగా ఉండండి. 43 ఇది తెలుసుకోండి – దొంగ ఏ గడియ వస్తాడో ఇంటి యజమానికి ముందు తెలిసి ఉంటే అతడు మెళుకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనియ్యడు. 44  మీరు అనుకోని గడియలో మానవ పుత్రుడు వస్తాడు, గనుక మీరు కూడా సిద్ధంగా ఉండండి.
45  “యజమాని తన ఇంటి దాసులకు తగిన వేళ ఆహారం పెట్టడానికి వారిమీద నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుడెవడు? 46 యజమాని వచ్చి చూచినప్పుడు ఆ పని చేస్తూ ఉన్న దాసుడు ధన్యుడు. 47  మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, యజమాని అతణ్ణి తన ఆస్తి అంతటి మీదా నియమిస్తాడు. 48 గానీ, ఒకవేళ ఆ దాసుడు చెడ్డవాడై ఉండి ‘నా యజమాని ఇప్పుడే రాడు లే’ అనుకొని, 49 సాటి దాసులను కొట్టడం, త్రాగుబోతులతో తిని త్రాగడం ఆరంభిస్తే 50 ఆ దాసుడు ఎదురు చూడని రోజున, ఎరగని గడియలో అతని యజమాని వస్తాడు. 51 అతణ్ణి రెండు ముక్కలుగా నరికివేసి కపట భక్తులతోపాటు అతనికి వంతు నియమిస్తాడు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.