23
1 ✽అప్పుడు యేసు జన సమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు: 2 “ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ✽ మోషే స్థానంలో కూర్చుని ఉన్నారు, 3 ✽గనుక వారు మీకు పాటించండని చెప్పేదంతా పాటించి చేయండి గాని, వారు చేసిన పనులు చేయకండి. ఎందుకంటే, వారు తాము చెప్పినట్టు చేయరు. 4 ✽మోయడానికి కష్టతరమైన బరువులు వారు కట్టి మనుషుల భుజాలమీద ఉంచుతారు గాని, వాటిని తొలగించడానికి తమ చేతివ్రేళ్ళలో ఒక దాన్ని కూడా కదిలించరు.5 ✝“వారు చేసేదంతా మనుషులు చూడాలని చేస్తారు. దైవ వాక్కులు వ్రాసి పెట్టుకున్న తమ చిట్టి సంచులు✽ వెడల్పు చేసుకొంటారు. వారి వస్త్రాల అంచులు✽ పెద్దగా చేయించు కొంటారు. 6 ✽విందులలో గౌరవనీయమైన స్థలాలూ, సమాజ కేంద్రాలలో అగ్రస్థానాలూ వారికి చాలా ఇష్టం. 7 సంతవీధులలో అభివందనాలు అందుకోవడమూ, మనుషులచేత “రబ్బీ, రబ్బీ” అనిపించుకోవడమూ వారికి చాలా ఇష్టం.
8 “మీరైతే ‘రబ్బీ✽’ అని పిలిపించుకోకండి. మీకు ఉపదేశకుడు క్రీస్తు ఒక్కడే! మీరంతా సోదరులు. 9 ✽ఇదిగాక, భూమిమీద ఎవరినీ మీ ‘తండ్రి’ అనకండి. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకంలో ఉన్నాడు.
10 “ఇంతేకాకుండా, మీరు ‘గురువు’ అని పిలిపించుకోకండి. క్రీస్తు ఒక్కడే మీకు గురువు. 11 ✝మీలో అందరికంటే ముఖ్యుడు మీకు సేవకుడై ఉండాలి. 12 ✝తనను గొప్ప చేసుకొనేవాణ్ణి తగ్గించడం, తనను తగ్గించుకొనేవాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.
13 ✽“అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా! మీరు కపటభక్తులు! మీకు శిక్ష తప్పదు! ఎందుకంటే మీరు మనుషులకు పరలోక రాజ్యాన్ని మూసివేస్తున్నారు. దానిలో మీరు ప్రవేశించరు, ప్రవేశించబోయేవారిని ప్రవేశించనియ్యరు. 14 అయ్యో, ధర్మశాస్త్రపండితులారా, పరిసయ్యులారా! మీరు కపట భక్తులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మీరు వితంతువుల ఇళ్ళను మ్రింగివేస్తారు, నటనగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. కాబట్టి మీకు ఎక్కువ శిక్ష విధించబడుతుంది. 15 ✽అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపటభక్తులు! మీకు శిక్ష తప్పదు! ఎందుకంటే మీ మతతెగలో ఒకణ్ణి చేర్చడానికి మీరు సముద్రంమీద, భూమిమీద ప్రయాణాలు చేస్తారు గానీ అతడు అందులో చేరినతరువాత అతణ్ణి మీకంటే రెండంతలుగా నరకపాత్రుణ్ణి చేస్తారు.
16 “అయ్యో, గుడ్డి మార్గదర్శులారా!✽ మీకు శిక్ష తప్పదు. మీరు అంటారు గదా ‘ఎవరైనా దేవాలయం తోడని ఒట్టుపెట్టుకొంటే పర్వాలేదు గాని, దేవాలయంలో ఉన్న బంగారం తోడని ఒట్టు పెట్టుకొంటే దానికి కట్టుబడి ఉండాలి.’ 17 తెలివి తక్కువవారలారా, గుడ్డివారలారా! ఏది గొప్ప? బంగారమా? బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా? 18 ఇంకా మీరు ఇలా అంటారు: ‘ఎవరైనా బలిపీఠంతోడని ఒట్టు పెట్టుకొంటే పర్వాలేదు గాని బలిపీఠం మీద ఉన్న అర్పణ తోడని ఎవరైనా ఒట్టు పెట్టుకుంటే దానికి కట్టుబడి ఉండాలి.’ 19 తెలివితక్కువ వారలారా! గుడ్డివారలారా! ఏది గొప్ప? అర్పణా? అర్పణను పవిత్రం చేసే బలిపీఠమా? 20 బలిపీఠంతోడని ఒట్టు పెట్టుకొనేవారు దానితోడనీ, దానిమీద ఉన్న అన్నిటి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నారు. 21 దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవారు దానితోడని, దాని నివాసి తోడని ఒట్టు పెట్టుకొంటున్నారు. 22 పరలోకం తోడని ఒట్టు పెట్టుకొనేవారు దేవుని సింహాసనంతోడనీ, దానిమీద కూర్చుని ఉన్నవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నారు.
23 “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా! మీరు కపటభక్తులు! మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే, మీరు పుదీనా, సోపు, జీలకర్రలలో పదో భాగం✽ చెల్లిస్తారు గానీ ధర్మశాస్త్రంలో ఉన్న ముఖ్యమైనవాటిని – న్యాయాన్ని, కరుణను, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. మీరు వాటిని చెల్లించడం మానక వీటిని కూడా జరిగిస్తూ ఉండాలి. 24 ✽గుడ్డి మార్గదర్శులారా! మీరు దోమను వడకట్టి ఒంటెను మ్రింగివేస్తారు!
25 ✽“అయ్యో! ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా! మీరు కపటభక్తులు! మీకు శిక్ష తప్పదు! మీరు గిన్నె, పళ్ళెం బయటవైపు శుభ్రం చేస్తారు గానీ లోపల వాటినిండా దోపిడీ, అత్యాశ ఉన్నాయి. 26 గుడ్డి పరిసయ్యుడా! మొట్టమొదట గిన్నె, పళ్ళెం లోపల శుభ్రం చెయ్యి! అప్పుడు బయటవైపు కూడా శుభ్రం అవుతుంది.
27 ✽“అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా! పరిసయ్యులారా! మీరు కపట భక్తులు! మీకు శిక్ష తప్పదు! మీరు సున్నం కొట్టిన సమాధులలాంటివారు! బయట అవి అందంగా కనిపిస్తాయి గాని లోపల వాటినిండా చనిపోయినవారి ఎముకలూ, అన్ని రకాల కల్మషమూ ఉంటాయి. 28 అలాగే బయట చూస్తే మీరు మనుషులకు న్యాయవంతులుగా కనిపిస్తారు గానీ లోపల కపటంతో, చెడుతనంతో నిండి ఉన్నారు.
29 ✽“అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా! మీరు కపటభక్తులు! మీకు శిక్ష తప్పదు! ప్రవక్తలకు సమాధులు నిర్మిస్తారు, న్యాయవంతుల గోరీలను అలంకరిస్తారు. 30 ‘ఒకవేళ మనం మన పూర్వీకుల రోజుల్లో బతికి ఉంటే, వారితో ప్రవక్తల రక్తపాతం విషయంలో వంతు తీసుకునేవాళ్ళం కాదు’ అంటారు. 31 ఆ విధంగా మీరు ప్రవక్తలను హత్య చేసినవారి సంతానమని మీమీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు. 32 సరే, మీ పూర్వీకుల అపరాధ పరిమాణం పూర్తి చేయండి.
33 ✝“పాముల్లారా! విషసర్ప వంశమా! మీరు నరక శిక్ష ఎలా తప్పించుకోగలరు? 34 ✽ఇదిగో వినండి! నేను మీ దగ్గరకు ప్రవక్తలను, జ్ఞానులను, ధర్మశాస్త్ర పండితులను పంపుతున్నాను. వారిలో కొంతమందిని మీరు చంపుతారు, సిలువ వేస్తారు. మరి కొంతమందిని మీ సమాజ కేంద్రాలలో కొరడా దెబ్బలు కొడతారు, ఊరినుంచి ఊరికి తరుముతూ హింసిస్తారు. 35 ✽ఈ విధంగా, భూమిమీద మనుషులచేత ఒలికిన న్యాయవంతుల రక్తమంతటి విషయం మీరు జవాబుదారులవుతారు. అంటే, న్యాయవంతుడైన హేబెల్ రక్తం మొదలుకొని, దేవాలయానికి బలిపీఠానికీ మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తంవరకు ఆ రక్తమంతటికీ మీరు బాధ్యులవుతారు. 36 మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, ఇదంతా ఈ తరంవారి మీదికి వస్తుంది.
37 “ఓ జెరుసలం! జెరుసలం! ప్రవక్తలను చంపుతూ, నీ దగ్గరకు దేవుడు పంపినవారిని రాళ్ళు రువ్వి హతమారుస్తూ ఉండేదానా! కోడి తన పిల్లలను రెక్కలక్రింద చేర్చుకొనే విధంగా నీ పిల్లలను నేను చేర్చుకోవాలని ఎన్నోసార్లు✽ ఇష్టపడ్డాను. నీవైతే ఇష్టపడలేదు. 38 ✽ఇదిగో విను, నీ ఇల్లు నీకే పాడుగా విడిచిపెట్టడం జరుగుతూ ఉంది. 39 ✽ ✽నీతో నేను ఇలా చెపుతున్నాను: ఇకనుంచి, నీవు ‘ప్రభువు పేరట వచ్చేవాడు ధన్యజీవి’ అని చెప్పేవరకూ నన్ను మళ్ళీ చూడవు.”