22
1 యేసు ఇంకా వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా చెప్పసాగాడు: 2 “పరలోక రాజ్యం ఇలా ఉంది: ఒక రాజు తన కుమారుని పెళ్ళి విందు ఏర్పాటు చేశాడు. 3 పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారిని రమ్మనడానికి అతడు తన దాసులను పంపాడు గాని వారికి రావడం ఇష్టం లేదు.
4 “మళ్ళీ అతడు వేరే దాసులను పంపుతూ, ‘ఆహ్వానం అందినవారితో ఇలా చెప్పండి: నా విందు సిద్ధం చేశాను. నా ఎద్దులనూ క్రొవ్విన పశువులనూ వధించడం జరిగింది. అంతా సిద్ధంగా ఉంది. పెళ్ళి విందుకు రండి’ అన్నాడు.
5 “అయినా ఆహ్వానమందిన వారు దాన్ని లెక్క చేయక వెళ్ళిపోయారు. ఒకడు తన పొలానికి వెళ్ళాడు. మరొకడు వ్యాపారానికి వెళ్ళాడు. 6 మిగిలినవారు అతని దాసులను పట్టుకొని అవమానించి చంపారు. 7 రాజు దాని గురించి విని కోపంతో మండిపడ్డాడు, తన సైన్యాలను పంపి ఆ హంతకులను సంహరించి, వారి నగరాన్ని తగల బెట్టించాడు.
8 “అప్పుడతడు తన దాసులతో ‘పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గాని ఆహ్వానం అందినవాళ్ళు యోగ్యులు కారు. 9 గనుక రహదారులలోకి వెళ్ళి మీకు కనిపించినవారందరినీ పెళ్ళి విందుకు పిలవండి’ అన్నాడు.
10 “అలాగే ఆ దాసులు రహదారులలోకి వెళ్ళి, తమకు కనిపించిన వారందరినీ – మంచివారినీ చెడ్డవారినీ – పోగు చేశారు. ఆ విధంగా పెళ్ళి ఇల్లు విందుకు వచ్చిన వారితో నిండిపోయింది. 11 ఆ అతిథులను చూద్దామని రాజు లోపలికి వచ్చాడు. పెళ్ళి వస్త్రం తొడుక్కోకుండా ఉన్న వాడొకడు అక్కడ అతనికి కనబడ్డాడు.
12 రాజు అతణ్ణి చూచి, ‘స్నేహితుడా! పెళ్ళి వస్త్రం లేకుండా నీవు లోపలికి ఎలా చేరుకున్నావు?’ అని అడిగాడు. అతనికి నోట మాట లేదు. 13 అప్పుడు రాజు, ‘ఇతణ్ణి కాళ్ళు చేతులు కట్టి, అవతలికి తీసుకువెళ్ళి బయటి చీకటిలోకి త్రోసివేయండి. అక్కడ ఏడుపూ, పండ్లు కొరుకుకోవడమూ ఉంటాయి’ అని ఆ పరిచారకులతో చెప్పాడు.
14 “అలాగే ఆహ్వానం అందుకొన్నవారు చాలామంది, ఎన్నుకోబడ్డవారు కొద్దిమందే.”
15 అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను మాటలో చిక్కించుకోవడం ఎలాగా అని సమాలోచన చేశారు. 16 తరువాత తమ శిష్యులను హేరోదు పక్షంవాళ్ళతోపాటు ఆయనదగ్గరికి పంపారు. వారు ఇలా అన్నారు: “ఉపదేశకా, మీరు యథార్థవంతులనీ, ఎవరినీ లెక్కచేయక దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు ఉపదేశిస్తారనీ, మనుషులను పక్షపాతంతో చూడరనీ మాకు తెలుసు. 17 గనుక ఒక సంగతిని గురించి మీ ఆలోచన ఏమిటో మాకు చెప్పండి – సీజర్‌కు సుంకం చెల్లించడం న్యాయమా కాదా?”
18 యేసు వాళ్ళ దుర్మార్గత పసికట్టి “కపట భక్తులారా! నన్నెందుకు పరీక్షిస్తున్నారు? 19 సుంకం నాణెం ఒకటి నాకు చూపెట్టండి” అన్నాడు. వారు ఒక దేనారం ఆయనకు తెచ్చి ఇచ్చారు.
20 “ఈ బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని ఆయన వారినడిగాడు.
21 “సీజర్‌వి” అని వారు ఆయనతో అన్నారు. ఆయన వారితో “అలాగైతే సీజర్‌వి సీజర్‌కూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అన్నాడు.
22 ఇది విని వారు అధికంగా ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు.
23 ఆ రోజే సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చారు. చనిపోయినవారు లేవరని వారంటారు. వారు ఆయనను ఇలా ప్రశ్నించారు: 24 “ఉపదేశకా, మోషే చెప్పినది ఇది: ఒక మనిషి సంతానం లేకుండా చనిపోతే అతడి భార్యను అతడి సోదరుడు పెళ్ళి చేసుకొని అతడి వంశం నిలబెట్టాలి. 25 మా మధ్య ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండానే చచ్చి అతడి భార్యను అతడి తమ్ముడికి విడిచిపెట్టాడు. 26 ఈ రెండోవాడికి, తరువాత మూడోవాడికి, ఏడోవాడి వరకు అందరికీ అలాగే జరిగింది. 27 అందరి తరువాత ఆ స్త్రీ కూడా చచ్చిపోయింది. 28 కాబట్టి చనిపోయినవారు సజీవంగా లేచేటప్పుడు ఈ ఏడుగురిలో ఆమె ఎవరి భార్య? ఆమె వాళ్ళందరికీ భార్యగా ఉంది గదా?”
29 యేసు వాళ్ళకు ఇలా జవాబిచ్చాడు: “లేఖనాలూ, దేవుని బలప్రభావాలూ మీకు తెలియదు గనుక పొరబడుతున్నారు. 30 చనిపోయినవారు సజీవంగా లేచేటప్పుడు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికియ్యరు. వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లాగా ఉంటారు. 31 చనిపోయినవారు సజీవంగా లేచే విషయమైతే – దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? 32 అదేమిటంటే, ‘నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి.’ ఆయన చనిపోయినవారి దేవుడు కాడు గాని జీవిస్తూవున్న వారి దేవుడు.”
33 ఇది విని జన సమూహానికి ఆయన ఉపదేశంవల్ల చాలా ఆశ్చర్యం కలిగింది.
34 ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు సమకూడి వచ్చారు. 35 వాళ్ళలో ధర్మశాస్త్రంలో ఆరితేరినవాడు ఒకడు ఆయనను పరీక్షించడానికి ఈ ప్రశ్న అడిగాడు: 36 “ఉపదేశకా, ధర్మశాస్త్రంలో మహా ఆజ్ఞ ఏది?”
37 యేసు అతనితో అన్నాడు, “హృదయపూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, మనస్ఫూర్తిగా మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి. 38 ఇదే ముఖ్యమైన ఆజ్ఞ, మొదటిది కూడా. 39 రెండో ఆజ్ఞ అలాంటిదే – మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. 40 ఈ రెండు ఆజ్ఞలమీద ధర్మశాస్త్రమంతా ప్రవక్తల రచనలూ ఆధారపడి ఉన్నాయి.”
41 పరిసయ్యులు గుమిగూడి ఉన్నప్పుడు యేసు వారిని ఒక ప్రశ్న అడిగాడు – 42 “అభిషిక్తుని విషయం మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఎవరి కుమారుడు?” వారు “దావీదు కుమారుడు” అని ఆయనకు జవాబిచ్చారు.
43 ఆయన వాళ్ళతో “అలాగైతే దావీదు దేవుని ఆత్మమూలంగా ఎందుకు ఆయనను ప్రభువు అన్నాడు? 44  దావీదు అన్నాడు గదా, ‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు – నేను నీ శత్రువులను నీ పాదాలక్రింద ఉంచేవరకు నా కుడిప్రక్కన కూర్చుని ఉండు.’ 45 దావీదు ఆయనను ‘ప్రభువు’ అంటే ఆయన అతనికి కుమారుడుగా ఎలా ఉంటాడు?” అన్నాడు. 46 ఎవరూ ఒక్క మాట కూడా ఆయనకు జవాబు చెప్పలేకపోయారు. అంతేగాక, ఆ రోజునుంచి మరో ప్రశ్న అడగడానికి ఎవరూ తెగించలేదు.