21
1 ✽వారు జెరుసలం దరిదాపులకు వచ్చి, ఆలీవ్ కొండమీద ఉన్న బేత్‌ఫగే చేరుకొన్నారు. అప్పుడు యేసు ఇద్దరు శిష్యులను పంపుతూ ఇలా అన్నాడు: 2 ✽“మీకు ఎదురుగా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి. అక్కడికి చేరగానే కట్టి ఉన్న గాడిద మీకు కనబడుతుంది. దానితో గాడిదపిల్ల కూడా ఉంటుంది. వాటిని విప్పి నా దగ్గరకు తోలుకురండి. 3 మిమ్ములను ఎవరైనా ఏదైనా అంటే, ‘ఇవి ప్రభువుకు’ అనండి. అతడు వెంటనే వాటిని పంపిస్తాడు.”4 ✽ ప్రవక్తద్వారా దేవుడు చెప్పిన ఈ మాట నెరవేరేలా ఇదంతా జరిగింది: 5 సీయోనుకుమారితో ఇలా చెప్పండి: ఇడుగో, మీ రాజు మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు! ఆయన వినయవంతుడై గాడిదను – గాడిదపిల్లను – ఎక్కి వస్తూ ఉన్నాడు!
6 ✽శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆదేశం ఇచ్చినట్టే చేశారు. 7 ఆ గాడిదనూ గాడిద పిల్లనూ తోలుకువచ్చి, వాటిమీద తమ పైబట్టలు వేశారు. వాటిమీద ఆయనను కూర్చోబెట్టారు. 8 ✝చాలా గొప్ప సమూహం తమ పైబట్టలు దారిన పరిచారు. కొంతమంది చెట్లకొమ్మలు నరికి దారిన పరిచారు. 9 జన సమూహాలు ఆయన ముందూ వెనుకా నడుస్తూ, ఇలా కేకలు వేస్తూ ఉన్నారు: “దావీదు కుమారునికి జయం✽! ప్రభువు పేరట వచ్చేవాడు ధన్యజీవి! పరమ స్థలాల్లో జయం!”
10 ✽ఆయన జెరుసలంలో ప్రవేశించినప్పుడు నగరమంతా కలవరపడిపోతూ “ఎవరు ఇతడు” అని అడిగారు.
11 జన సమూహాలు ఇలా జవాబిచ్చారు: “ఈయన యేసు. గలలీలో ఉన్న నజరేతునుండి వచ్చిన ప్రవక్త.”
12 ✽ యేసు దేవాలయంలోనికి వెళ్ళి, ఆలయంలో అమ్మే వాళ్ళనూ కొనేవాళ్ళనూ అందరినీ వెళ్ళగొట్టివేశాడు. డబ్బులు మారకం వ్యాపారుల బల్లలూ, గువ్వల వర్తకుల పీటలూ పడద్రోశాడు. 13 వాళ్ళతో ఇలా అన్నాడు: “నా ఆలయం ప్రార్థన ఆలయమని అంటారు గాని మీరు దానిని దోపిడీ దొంగల✽ గుహగా చేశారు.”
14 దేవాలయంలో ఆయన దగ్గరికి గుడ్డివారూ కుంటివారూ వచ్చారు. ఆయన వారిని బాగు చేశాడు. 15 ✽ఆయన చేసిన అద్భుతాలు ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ చూశారు. దేవాలయంలో “దావీదు కుమారునికి జయం!” అని కేకలు వేస్తున్న పిల్లలను కూడా చూశారు. అప్పుడు వారు కోపంతో మండిపడ్డారు. 16 యేసుతో “వీళ్ళు అంటున్నది వింటున్నావా?” అన్నారు. వారితో యేసు ఇలా చెప్పాడు: “అవును. నీవు చిన్నపిల్లలనూ చంటి బిడ్డల నోట్లో స్తుతిని పరిపూర్ణం చేశావు అనే మాట మీరెన్నడూ చదవలేదా?✽”
17 ✽అప్పుడు ఆయన వారిని విడిచి, నగరం బయట బేతనీకి వెళ్ళి అక్కడ ఆ రాత్రి గడిపాడు. 18 ✽ ప్రొద్దున నగరానికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసింది. 19 ✽దారి ప్రక్కన అంజూరచెట్టు ఒకటి కనిపించింది. ఆయన దాని దగ్గరకు వెళ్ళి చూస్తే దానికి ఆకులు తప్ప ఇంకేమీ కనబడలేదు. ఆయన దానితో “ఇకనుంచి నీవు ఎన్నడూ కాపు కాయవు” అన్నాడు. వెంటనే ఆ అంజూరచెట్టు ఎండిపోయింది.
20 అది చూచి శిష్యులు స్తంభించి “ఆ అంజూరచెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో!” అన్నారు.
21 ✽యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, దేవుని మీద మీకు నమ్మకం గనుక ఉంటే, సందేహపడకుండా ఉంటే, అంజూరచెట్టుకు చేసినది మీరు కూడా చేయగలరు. ఇదిగాక, ఈ కొండను చూచి ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే అలాగే జరిగి తీరుతుంది. 22 దొరుకుతాయని నమ్ముతూ, ప్రార్థనలో వేటిని అడుగుతారో అవన్నీ మీకు దొరుకుతాయి.”
23 ✽ఆయన దేవాలయంలోకి వెళ్ళి ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజులూ ప్రజల పెద్దలూ ఆయనదగ్గరికి వచ్చి, “నీవు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?” అని అడిగారు.
24 ✽యేసు వారికిలా జవాబిచ్చాడు: “నేనూ మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు నాకు జవాబిస్తే నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది మీకు చెపుతాను. 25 యోహాను ఇచ్చిన బాప్తిసం ఉత్పత్తి ఎక్కడ నుంచి, పరలోకం నుంచా? మనుషుల నుంచా?”
వాళ్ళు చర్చలో పడి ఇలా చెప్పుకొన్నారు: “ఒకవేళ ‘పరలోకం నుంచి’ అని మనం చెపితే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతణ్ణి నమ్మలేదు?’ అంటాడు గదా! 26 ‘మనుషుల నుంచి’ అందామా – జన సమూహానికి భయపడుతున్నాం గదా! యోహానును ఒక ప్రవక్తగా అందరూ ఎంచుతున్నారు.” 27 అందుచేత వాళ్ళు యేసుకు “మాకు తెలియదు” అని జవాబిచ్చారు. ఆయన వాళ్ళతో “అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది నేనూ మీకు చెప్పను” అన్నాడు.
28 ✽“దీన్ని గురించి మీకేమి తోస్తుంది? – ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్దవాడి దగ్గరకు వచ్చి అతడితో ‘బాబూ, ఈ రోజు నీవు వెళ్ళి, నా ద్రాక్ష తోటలో పని చెయ్యి’ అన్నాడు. 29 అతడు ‘వెళ్ళను’ అన్నాడు గాని తరువాత మనసు మార్చుకొని వెళ్ళాడు. 30 తండ్రి రెండోవాని దగ్గరకు వెళ్ళి అదేమాట చెప్పాడు. అతడు ‘వెళ్తాను నాన్నగారు’ అన్నాడు గానీ వెళ్ళలేదు. 31 ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్టప్రకారం చేశాడు?”
వాళ్ళు ఆయనతో “మొదటివాడు” అన్నారు.
యేసు వాళ్ళతో ఇలా బదులు చెప్పాడు: “మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను. మీకంటే ముందుగా సుంకంవారు, వేశ్యలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. 32 ఎందుకంటే, యోహాను న్యాయమార్గంలో మీదగ్గరకు వచ్చాడు గాని మీరు అతణ్ణి నమ్మలేదు. అయితే సుంకంవారు, వేశ్యలు అతణ్ణి నమ్మారు. అది చూచినా మీరు తరువాత పశ్చాత్తాపపడలేదు, అతణ్ణి నమ్మలేదు.
33 ✽“మరో ఉదాహరణ వినండి. భూస్వామి ఒకడు ద్రాక్షతోట నాటించాడు. దానిచుట్టూ గోడ కట్టించి, అందులో ద్రాక్షగానుగ తొట్టి తొలిపించి, కావలి గోపురం కట్టించాడు. అప్పుడతడు తోటను రైతులకు కౌలుకిచ్చి దూర దేశానికి వెళ్ళిపోయాడు✽. 34 కోతకాలం దగ్గర పడ్డప్పుడు పంటలో తన పళ్ళు తెమ్మని తన దాసులను ఆ రైతుల దగ్గరకు పంపాడు. 35 రైతులు అతని దాసులను పట్టుకొని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు, మరొకనిమీద రాళ్ళు రువ్వారు. 36 అతడు మళ్ళీ వేరే దాసులను పంపాడు. మునుపటికంటే వీరు ఎక్కువమంది. అయినా రైతులు వారిని కూడా అలాగే చేశారు. 37 చివరికి అతడు ‘నా కుమారుణ్ణి వారు గౌరవిస్తారు’ అని చెప్పి తన కుమారుణ్ణి వారి దగ్గరకు పంపాడు. 38 కాని, కుమారుణ్ణి చూచి రైతులు తమలో ఇలా చెప్పుకొన్నారు: ‘వారసుడు వీడే! వీణ్ణి చంపి వీడి వారసత్వం తీసుకుందాం రండి!’ 39 వారు అతణ్ణి పట్టుకొని, ద్రాక్షతోట వెలుపలికి గెంటివేసి చంపారు. 40 అందుచేత ద్రాక్షతోట యజమాని వచ్చినప్పుడు ఆ రైతులను ఏమి చేస్తాడు?”
41 ✽వాళ్ళు ఆయనతో, “అతడు ఆ దుర్మార్గులను నిర్దయగా నాశనం చేస్తాడు, పంటకాలాల్లో తనకు పళ్ళు ఇచ్చే వేరే రైతులకు ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అన్నారు.
42 ✽యేసు వాళ్ళతో అన్నాడు: “మీరు లేఖనాలలో✽ ఈ మాట ఎన్నడూ చదవలేదా? – ‘కట్టేవారు తీసిపారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది. ఇది ప్రభువుమూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.’ 43 గనుక మీతో నేను చెప్పేదేమిటంటే, దేవుని రాజ్యాన్ని మీనుంచి తీసివేయడం, దాని ఫలాలు ఇచ్చే ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. 44 ఈ బండ మీద పడేవారెవరైనా ముక్కలు చెక్కలు అవుతారు. ఇది ఎవరిమీద పడుతుందో వారు చూర్ణమై పోయేలా చేస్తుంది.”
45 ఆయన చెప్పిన ఉదాహరణలు విని ప్రధాన యాజులూ, పరిసయ్యులూ తమ విషయమే చెప్పాడని గ్రహించారు. 46 ✽ఆయనను పట్టుకోవాలని చూశారు గాని జన సమూహాలకు భయపడ్డారు. ఎందుకంటే ప్రజలు ఆయనను ప్రవక్తగా ఎంచారు.