20
1 “ఎందుకంటే, పరలోక రాజ్యం ఇలా ఉంది: భూస్వామి ఒకడు తన ద్రాక్షతోటలో పనివారిని కూలికి పెట్టుకుందామని ప్రొద్దు పొడవగానే బయటికి వెళ్ళాడు. 2 రోజుకొక దేనారం ప్రకారం పనివారితో సమ్మతించి వారిని తన ద్రాక్షతోటలోకి పంపాడు. 3 సుమారు తొమ్మిది గంటలకు అతడు బయటికి వెళ్ళి సంతవీధిలో మరి కొందరు ఊరికే నిల్చుని ఉండడం చూశాడు. 4 అతడు వారితో ‘మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళండి. ఏ జీతం న్యాయమో అది మీకిస్తాను’ అన్నాడు. అలాగే వారు వెళ్ళారు. 5 సుమారు పన్నెండు గంటలకూ, తరువాత మూడు గంటలకూ అతడు మళ్ళీ బయటికి వెళ్ళి ఆ విధంగా చేశాడు. 6 సుమారు అయిదు గంటలకు కూడా అతడు బయటికి వెళ్ళి ఇంకా కొంతమంది ఊరికే నిలబడి ఉండడం చూచి, ‘రోజంతా మీరెందుకు ఇక్కడ ఊరికే నిలుచున్నారు?’ అని వారినడిగాడు. 7 వారు అతనితో ‘మమ్మల్ని ఎవరూ కూలికి పెట్టుకోలేదు గనుక’ అని జవాబిచ్చారు. అతడు ‘మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళండి, ఏది న్యాయమో అది మీకు చేకూరుతుంది’ అని వారితో చెప్పాడు.
8 “సాయంకాలమైనప్పుడు ద్రాక్షతోట యజమాని సేవాధికారిని చూచి ఇలా అన్నాడు: ‘పనివాళ్ళను పిలిచి వారికి కూలి ఇచ్చెయ్యి. చివరగా వచ్చినవాళ్ళకు మొదట ఇయ్యి. మొదట వచ్చినవాళ్ళకు చివరగా ఇయ్యి.’ 9 సుమారు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చారు. వారిలో ప్రతివానికీ దేనారం దొరికింది. 10 మొదటివారు వచ్చినప్పుడు తమకు ఎక్కువ దొరుకుతుంది అనుకొన్నారు గానీ వారిలో కూడా ప్రతివానికీ ఒక్క దేనారం దొరికింది. 11 అదే దొరికితే వారు భూస్వామిమీద ఇలా సణిగారు: 12 ‘చివరగా వచ్చిన వాళ్ళు ఒక్క గంట సేపు మాత్రమే పని చేశారు. మేమైతే పగలంతటి బరువునూ ఎండనూ సహించాం. మాతో వాళ్ళను సమానంగా చేశారేం!’
13 “అతడు వారిలో ఒకనితో ఇలా సమాధానం చెప్పాడు: ‘స్నేహితుడా, నేను నీకు అన్యాయమేమీ చేయడం లేదు. నీవు దేనారానికి ఒప్పుకోలేదా నా దగ్గర? 14 నీ జీతం తీసుకువెళ్ళు. నీకిచ్చినట్టే చివరగా వచ్చినవాళ్ళకు ఇవ్వాలనేదే నా ఇష్టం. 15 నాకున్నదానితో ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి నాకు హక్కు లేదా? నేను మంచివాడుగా ఉన్నందుచేత నీకు కడుపుమంటగా ఉందా?’
16 “ఈ విధంగానే చివరివారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు. ఎందుకంటే పిలిచేది అనేకమందిని, ఎన్నుకొనేది కొద్దిమందిని.”
17  యేసు జెరుసలంకు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పన్నెండు మంది శిష్యులను దారిప్రక్కకు తీసుకువెళ్ళి వారితో ఇలా అన్నాడు:
18 “ఇదిగో వినండి, మనం జెరుసలం వెళ్ళిపోతున్నాం. అక్కడ మానవపుత్రుణ్ణి ప్రధాన యాజులకూ ధర్మశాస్త్ర పండితులకూ పట్టి ఇవ్వడం జరుగుతుంది. వారు ఆయనకు మరణశిక్ష విధిస్తారు. 19 ఆయనను వేళాకోళం చేయడానికీ కొరడాదెబ్బలు కొట్టడానికీ సిలువ వేయడానికీ యూదేతర ప్రజలకు అప్పగిస్తారు. మూడో రోజున ఆయన సజీవంగా లేస్తాడు.”
20 అప్పుడు జెబెదయి కొడుకుల తల్లి తన కొడుకులతో ఆయనదగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఆయనకు ఒక మనవి చేయబోయింది. 21 “నీకేమి కావాలి?” అని ఆయన ఆమెను అడిగాడు. “మీ రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారులు– ఒకడు మీ కుడివైపున, మరొకడు మీ ఎడమవైపున కూర్చుని ఉండేలా మాట ఇవ్వండి” అని ఆమె ఆయనతో అన్నది.
22  అందుకు యేసు “మీరు అడిగేదేమిటో మీకు తెలియదు. నేను త్రాగబోయే గిన్నెలోది త్రాగడానికీ నేను పొందే బాప్తిసం పొందడానికీ మీకు బలం ఉన్నదా?” అని బదులు చెప్పాడు. “మాకు చాలినంత బలం ఉంది!” అని వారన్నారు.
23 ఆయన “నా గిన్నెలోది మీరు త్రాగుతారు, నేను పొందే బాప్తిసం మీరు పొందుతారు నిజమే. గాని నాకు కుడి ఎడమల కూర్చోబెట్టుకోవడం నా వశంలో లేదు. ఆ స్థానాలు నా తండ్రి ఎవరికోసం సిద్ధం చేశాడో వారికే అవి దొరుకుతాయి అని వారితో అన్నాడు.
24 ఇది విని తక్కిన పదిమంది శిష్యులు ఆ ఇద్దరు అన్నదమ్ములమీద కోపంతో మండిపడ్డారు. 25 అయితే యేసు వారిని తన దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు: “ఇతర ప్రజల అధికారులు వారిమీద పెత్తనం చెలాయిస్తారు. ప్రముఖులు వారి మీద అధికారం ప్రయోగిస్తారు. 26 మీలో అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు కావాలని ఇష్టం ఉన్నవాడు మీకు సేవకుడై ఉండాలి. 27 మీలో ప్రధానుడు కావాలని ఇష్టపడేవాడు మీకు దాసుడై ఉండాలి. 28 అలాగే మానవపుత్రుడు తనకు సేవ చేయించుకోవడానికి రాలేదు గాని సేవ చేయడానికి వచ్చాడు. ఇదీగాక, అనేకుల విమోచనకు వెలగా తన ప్రాణం ధారపోయడానికి వచ్చాడు.”
29 వారు యెరికో నుంచి వెళ్ళిపోతూ ఉంటే పెద్ద జన సమూహం ఆయనను అనుసరించింది. 30 అప్పుడు దారిప్రక్కన ఇద్దరు గుడ్డివారు కూర్చుని ఉన్నారు. యేసు తమ దగ్గర నుండి దాటి పోతున్నాడని విని, “స్వామీ! దావీదు కుమారుడా! మామీద దయ చూపండి!” అని కేక పెట్టారు.
31 “ఊరుకోండి” అని ప్రజలు వారిని గద్దించినా వారు ఇంకా బిగ్గరగా కేక పెట్టారు – “స్వామీ! దావీదు కుమారుడా! మామీద దయ చూపండి.”
32 యేసు ఆగి వారిని పిలిచి “మీ కోసం నన్నేమి చెయ్యమంటారు?” అని అడిగాడు.
33 వారు “స్వామీ, మాకు చూపు ప్రసాదించండి” అన్నారు.
34 యేసు వారిమీద జాలిపడి వారి కండ్లు ముట్టాడు. వెంటనే వారు చూపు పొంది, ఆయనవెంట వెళ్ళారు.