19
1 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత, గలలీ విడిచివెళ్ళి యొర్దాను అవతల ఉన్న యూదయ ప్రాంతానికి చేరాడు. 2 ✝ప్రజలు పెద్ద సమూహాలుగా ఆయనను అనుసరించారు, అక్కడ ఆయన వారిని బాగు చేశాడు.3 ✽పరిసయ్యులు కొందరు కూడా ఆయనదగ్గరికి వచ్చి ఆయనను పరీక్షించాలని ఇలా అడిగారు: “ఏ కారణం చేతనైనా పురుషుడు తన భార్యతో తెగతెంపులు చేసుకోవడం ధర్మమా?”
4 ✝అందుకాయన జవాబిస్తూ “మొదట్లో సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా చేశాడు, 5 ✝‘అందుకే పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకొంటాడు. వారిద్దరూ ఒకే శరీరం అవుతారు అన్నాడు’ ఇది మీరు చదవలేదా? 6 ✝కాబట్టి అప్పటినుంచి వారు ఇద్దరు కాదు గాని ఒక్కటే శరీరంగా ఉన్నారు. కనుక దేవుడు ఏకంగా చేసినవారిని మనిషి వేరు చేయకూడదు” అని వారితో అన్నాడు.
7 ✽ వారు “అయితే విడాకులిచ్చి ఆమెతో తెగతెంపులు చేసుకొమ్మని మోషే ఎందుకు ఆదేశించాడు?” అని ఆయనను అడిగారు.
8 ✽యేసు వారితో అన్నాడు, “మోషే మీ హృదయాలు బండబారిపోవడం కారణంగా మీ భార్యలతో తెగతెంపులు చేసుకోవడానికి అనుమతించాడు. కానీ ఆరంభంనుంచి అలా లేదు. 9 ✽మీతో నేను అంటాను, ఎవడైనా భార్య వ్యభిచారం చేసినందుకు తప్ప ఆమెతో తెగతెంపులు చేసుకొని మరో ఆమెను పెండ్లాడితే వ్యభిచరిస్తున్నాడు. తెగతెంపులకు గురి అయిన ఆమెను పెండ్లి చేసుకొనేవాడు వ్యభిచరిస్తున్నాడు.”
10 ✽శిష్యులు ఆయనతో “భార్యాభర్తల సంబంధం ఇలాంటిదైతే పెండ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది!” అన్నారు.
11 ✽అందుకాయన వారితో అన్నాడు, “అందరూ ఈ మాట అంగీకరించలేరు, అది ఎవరికి ఇవ్వబడిందో వారే అంగీకరించగలరు. 12 ఎందుకంటే తల్లి గర్భంనుంచీ నపుంసకులుగా పుట్టినవారు కొందరు ఉన్నారు. మనుషులు చేసిన నపుంసకులు కొందరు ఉన్నారు. పరలోక రాజ్యం కోసం✽ తమను నపుంసకులుగా చేసుకొనేవారు కూడా ఉన్నారు. ఈ మాట అంగీకరించగలవాడే అంగీకరిస్తాడు గాక!”
13 ✽యేసు తమ చిన్న పిల్లలమీద చేతులుంచి ప్రార్థన చేయాలని కొందరు వారిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. కానీ శిష్యులు వారిని మందలించారు. 14 ✽ అయితే యేసు “చిన్న పిల్లలను నా దగ్గరకు రానియ్యండి. వారిని ఆటంకపరచవద్దు. ఇలాంటివారిదే పరలోక రాజ్యం” అన్నాడు.
15 ఆ చిన్న పిల్లలమీద చేతులుంచిన తరువాత ఆయన అక్కడనుంచి వెళ్ళాడు.
16 ✽అప్పుడే ఒకతను ఆయనదగ్గరికి వచ్చి, “మంచి ఉపదేశకా! శాశ్వత జీవం పొందడానికి నేను ఏ మంచి పని చేయాలి?” అని అడిగాడు.
17 ✽ఆయన అతనితో “నన్ను ‘మంచి’ అంటూ సంబోధిస్తున్నావెందుకు? దేవుడొక్కడే మంచివాడు, మరెవరూ కాదు. అయితే జీవంలో ప్రవేశించడానికి ఆశించేవాడవైతే ఆజ్ఞలను ఆచరించు” అన్నాడు.
18 ✽ అతడు ఆయనను “ఏ ఆజ్ఞలు?” అని అడిగాడు. “హత్య చేయకూడదు. వ్యభిచారం చేయకూడదు. అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. 19 తల్లిదండ్రులను గౌరవించాలి. నిన్ను ప్రేమించుకొన్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి” అని యేసు అన్నాడు.
20 ✽ఆ యువకుడు ఆయనతో “నేను చిన్నప్పటినుంచీ వీటన్నిటినీ పాటిస్తూ ఉన్నాను. ఇంకా నాకు ఏం కొదువ ఉంది?” అన్నాడు.
21 ✽“నీలో ఏ లోపమూ లేకుండా ఉండాలని ఆశిస్తే, వెళ్ళి నీకున్నదంతా అమ్మి బీదల✽కివ్వు. అప్పుడు పరలోకంలో నీకు ధనం ఉంటుంది. ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు” అని యేసు అతనికి బదులు చెప్పాడు.
22 ✽ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు, గనుక ఆ మాట విన్నప్పుడు విచారపడుతూ వెళ్ళిపోయాడు.
23 ✽అప్పుడు తన శిష్యులతో యేసు ఇలా అన్నాడు: “మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టతరమే! 24 మళ్ళీ మీతో చెపుతున్నాను, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడంకంటే ఒంటె సూది బెజ్జంలోగుండా వెళ్ళడమే సులభం!”
25 ✽ఈ మాటలు విని శిష్యులు అధికంగా ఆశ్చర్యపడి “అలాగైతే ఎవరు మోక్షం పొందగలరు!” అన్నారు.
26 ✽యేసు వారివైపు చూస్తూ, “మనుష్యులకు ఇది అసాధ్యం గాని దేవునికి అన్నీ సాధ్యమే” అన్నాడు.
27 ✝✽దానికి పేతురు జవాబిస్తూ “ఇదుగో, మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం గదా. మాకేమి లభిస్తుంది?” అని ఆయనను అడిగాడు.
28 యేసు వారితో అన్నాడు, “మీతో ఖచ్చితంగా అంటున్నాను, నవ యుగం✽లో మానవ పుత్రుడు తన మహిమా సింహాసనం✽ మీద కూర్చుని ఉన్నప్పుడు, నన్ను అనుసరించిన మీరూ పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇస్రాయేల్ పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు. 29 ✽అంతేగాక, నాపేరుకోసం ఇండ్లను గానీ అన్నదమ్ములను గానీ అక్కచెల్లెళ్ళను గానీ తల్లిదండ్రులను గానీ భార్యాబిడ్డలను గానీ భూములను గానీ విడిచిపెట్టిన ప్రతి ఒక్కరూ అంతకు నూరంతలు పొందుతారు. ఇదిగాక శాశ్వత జీవానికి వారసులవుతారు. 30 ✽ అయితే మొదటివారు చాలామంది చివరివారవుతారు. చివరివారు చాలామంది మొదటివారు అవుతారు.”