18
1 ఆ సమయంలో శిష్యులు యేసు దగ్గరకు వచ్చి ఈ ప్రశ్న అడిగారు: “పరలోక రాజ్యంలో అందరికంటే ఎవరు గొప్ప?”
2 యేసు ఒక చిన్నబిడ్డను తన దగ్గరకు పిలిచి, వారిమధ్య నిలబెట్టి ఇలా అన్నాడు: 3 “నేను మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు మార్పు చెంది, చిన్నవారిలాగా గనుక కాకపోతే పరలోక రాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించరు. 4  అందుచేత ఎవరైతే ఈ చిన్న బిడ్డలాగా తమను తగ్గించుకొంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు. 5 అంతేగాక, ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరిస్తున్నారన్నమాట. 6 కానీ నన్ను నమ్ముకొన్న ఈ చిన్నవారిలో ఒకరికి ఎవరైనా ఆటంకంగా ఉన్నారా, అలా ఉండడం కంటే మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టి సముద్రంలో ముంచివేయబడడమే ఆ వ్యక్తికి మేలు. 7 అయ్యో, ఆటంకాల వల్ల లోకానికి శిక్ష తప్పదు. ఆటంకాలు తప్పక కలుగుతాయి గాని ఆటంకం ఎవరివల్ల కలుగుతుందో అయ్యో, ఆ మనిషికి శిక్ష తప్పదు.
8  “ఒకవేళ మీ చెయ్యి గానీ పాదం గానీ మీకు ఆటంక కారణమైతే దానిని నరికివేసి అవతల పారవేయండి! రెండు చేతులూ రెండు పాదాలూ ఉండి నిత్యాగ్నిలో పడవేయబడడం కంటే, కుంటివాడుగా లేక వికలాంగుడుగా జీవంలో ప్రవేశించడం మీకు మేలు! 9 అలాగే మీ కన్ను మీకు ఆటంక కారణమైతే దానిని పీకి అవతల పారవేయండి. రెండు కండ్లు ఉండి నరకాగ్నిలో పడవేయబడడం కంటే ఒకే కన్నుతో జీవంలో ప్రవేశించడం మీకు మేలు.
10 “ఈ చిన్నవారిలో ఎవరినీ చిన్నచూపు చూడకండి సుమా! మీతో నేను చెప్పేదేమిటంటే, పరలోకంలో వీరి దేవదూతలు పరలోకంలో ఉన్న నా తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు. 11 ఎందుకంటే మానవ పుత్రుడు నశించినదానిని రక్షించడానికి వచ్చాడు.
12 “ఒక మనిషికి నూరు గొర్రెలు ఉంటే వాటిలో ఒకటి తప్పిపోతే, తొంభై తొమ్మిది గొర్రెలను విడిచి, తప్పిపోయిన ఆ ఒక్కదానిని వెదకడానికి కొండలకు వెళ్ళడా? మీరేమి అనుకొంటారు? 13 అది కనబడితే దారి తప్పని ఆ తొంభై తొమ్మిది గొర్రెల విషయంకంటే ఆ ఒక్కదాని విషయం అతడు ఎక్కువగా సంతోషిస్తాడని మీతో ఖచ్చితంగా చెపుతున్నాను. 14 అలాగే ఈ చిన్నవారిలో ఒకరైనా నాశనం కావడం అంటే పరలోకంలో ఉన్న మీ తండ్రికి ఇష్టం లేదు.
15 “మరొకటి – మీ సోదరుడు మీకు విరోధంగా అపరాధం చేస్తే అతని దగ్గరకు వెళ్ళి మీరు అతడు ఒంటరిగానే అతనికి అతని తప్పిదం తెలియజేయండి. అతడు మీ మాట వింటే మీ సోదరుణ్ణి దక్కించుకొన్నారన్న మాట. 16  ఒకవేళ అతడు మీ మాట వినకపోతే ఇంకా ఒకరిద్దరిని తీసుకొని అతని దగ్గరకు వెళ్ళండి. ‘ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదే ప్రతి సంగతీ రూఢి కావాలి’ గనుక అలా చేయండి. 17 ఒకవేళ అతడు వారి మాట కూడా వినకపోతే, అది సంఘానికి తెలియజేయండి. సంఘం మాట కూడా అతడు వినకపోతే, ఇతర ప్రజలలో ఒకడుగా, సుంకంవాడుగా అతణ్ణి ఎంచండి.
18 “మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను. మీరు భూమిమీద దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధితమే. భూమిమీద దేనిని విడుదల చేస్తే దానికి పరలోకంలో విడుదలే. 19 ఇంకొకటి మీతో చెపుతాను, భూమిమీద మీలో ఏ ఇద్దరూ దేవుణ్ణి అడిగే దేని విషయంలోనైనా ఏకీభవిస్తే, పరలోకంలో ఉన్న నా తండ్రి వారికి అది చేస్తాడు. 20 ఎందుకంటే, నా పేర ఇద్దరు ముగ్గురు ఎక్కడ సమకూడుతారో అక్కడ నేనూ వారి మధ్య ఉంటాను.”
21  ఆ సమయాన పేతురు వచ్చి ఆయనను ఇలా అడిగాడు: “ప్రభూ, నా సోదరుడు నాకు విరోధంగా అపరాధం చేస్తూ ఉంటే నేను ఎన్ని సార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్ల వరకా?”
22 ఇది అతనికి యేసు ఇచ్చిన జవాబు: “ఏడు సార్ల మట్టుకే కాదు – ఏడు డెబ్భైల వరకు అని నీతో అంటున్నాను. 23 కాబట్టి, పరలోక రాజ్యం ఇలా ఉన్నది: ఒక రాజు తన దాసుల విషయం లెక్కలు చూడాలని కోరాడు. 24 లెక్కలు పరిష్కారం చేయడం ఆరంభించినప్పుడు అతనికి పది వేల తలాంతులు బాకీపడ్డ దాసుణ్ణి అతని దగ్గరకు తెచ్చారు. 25 బాకీ తీర్చుకోవడానికి ఆ దాసుని దగ్గర ఏమీ లేదు, గనుక అతణ్ణీ అతని భార్యాబిడ్డలనూ అతనికి కలిగినదంతా అమ్మి బాకీ తీర్చాలని అతని యజమాని ఆజ్ఞ జారీ చేశాడు. 26 గనుక ఆ దాసుడు యజమాని ముందు సాష్టాంగ నమస్కారం చేసి, ‘యజమానీ, నా విషయం ఓపిక పట్టండి. మీకు అంతా చెల్లిస్తాను’ అన్నాడు. 27 ఆ దాసుని యజమానికి జాలి వేసింది. బాకీ రద్దు చేసి అతణ్ణి విడిచిపెట్టాడు.
28 “అయితే ఆ దాసుడే బయటికి వెళ్ళి, సాటి దాసులలో తనకు నూరు దేనారాలు బాకీపడ్డ ఒకణ్ణి చూచి అతణ్ణి జప్తుచేసి ‘నాకు బాకీ తీర్చు’ అంటూ అతని గొంతు పట్టుకొన్నాడు. 29 ఆ సాటి దాసుడు అతని పాదాల దగ్గర సాగిలపడి, ‘నా విషయం ఓపిక పట్టు. నీకు అంతా చెల్లిస్తాను’ అని వేడుకొన్నాడు. 30 అతడు ఒప్పుకోలేదు. అతడు బాకీ తీర్చేవరకు అతణ్ణి ఖైదులో వేయించాడు. 31 అయితే అతని సాటి దాసులు జరిగినది చూచి, చాలా విచారపడుతూ తమ యజమాని దగ్గరకు వెళ్ళి అతనికి జరిగినదంతా తెలియజేశారు. 32 అప్పుడు అతని యజమాని అతణ్ణి పిలిపించి అతనితో ఇలా అన్నాడు: ‘చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొన్నందుచేత నీ అప్పు అంతా రద్దు చేశానే! 33 నేను నీమీద దయ చూపినట్టే నీ సాటి దాసుడిమీద జాలి చూపకూడదా ఏమిటి?” 34 అతని యజమాని కోపగించి తన బాకీ అంతా తీర్చేవరకు చిత్రహింస పెట్టేవారికి అతణ్ణి అప్పగించాడు.
35 “మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుణ్ణి అతని అతిక్రమాల విషయం హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరమ తండ్రి మీకు అలాగే చేస్తాడు.”