17
1 ✽ఆరు రోజుల తరువాత యేసు పేతురును, యాకోబును, యాకోబు తోబుట్టువు యోహానును తీసుకొని ఎత్తయిన పర్వతంమీదికి ఏకాంతంగా వెళ్ళాడు. 2 ✽వారి ఎదుట ఆయన రూపం మారిపోయింది. అంటే ఆయన ముఖం సూర్య మండలంలాగా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు వెలుగులాగా తెల్లగా అయిపోయాయి. 3 ✽ఉన్నట్టుండి ఆయనతో మోషే, ఏలీయా మాట్లాడుతూ శిష్యులకు కనబడ్డారు.4 ✽అప్పుడు పేతురు “ప్రభూ! మనం ఇక్కడ ఉండడం మంచిది. నీకిష్టమైతే మూడు పర్ణశాలలను వేయనియ్యి – ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు” అని యేసుతో అన్నాడు.
5 ✽అతడు మాట్లాడుతూ ఉండగానే ప్రకాశవంతమైన మేఘం వారిని కమ్ముకొంది. మేఘం నుంచి ఒక కంఠం ఇలా వినిపించింది: “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనంటే నాకెంతో ఆనందం. ఈయన మాట వినండి✽.”
6 ✝శిష్యులు ఇది విని బోర్లపడి అత్యంతగా భయపడ్డారు. 7 ✽ అయితే యేసు వచ్చి వారిని తాకి “లెండి, భయపడకండి” అన్నాడు. 8 ✽వారు తలెత్తి చూచినప్పుడు యేసు తప్ప ఇంకెవరూ కనిపించలేదు.
9 ✽వారు పర్వతం దిగివస్తూ ఉన్నప్పుడు యేసు వారికిలా ఆజ్ఞ జారీ చేశాడు: “మానవ పుత్రుడు చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేచేవరకు మీరు చూచినదానిని ఎవరితోనూ చెప్పకండి.”
10 అప్పుడు ఆయన శిష్యులు “ఇలా అయితే ఏలీయా మొదట✽ రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు చెప్తారు?” అని ఆయననడిగారు.
11 ✽ అందుకు ఆయన వారితో అన్నాడు, “ఏలీయా ముందుగా వస్తాడు, అన్నిటినీ చక్కపరుస్తాడు, నిజమే, 12 ✝గాని మీతో నేను చెప్పేదేమిటంటే, ఏలీయా అప్పుడే వచ్చాడు గాని వారు అతణ్ణి గుర్తుపట్టలేదు. అతణ్ణి తమకు ఇష్టం వచ్చినట్లు చేశారు. అలాగే వారిచేత మానవ పుత్రుడు బాధలు అనుభవించబోతున్నాడు.”
13 అప్పుడు శిష్యులు, తమతో ఆయన మాట్లాడినది బాప్తిస్మమిచ్చే యోహాను✽ విషయమని గ్రహించారు.
14 వారు జన సమూహం దగ్గరకు రాగానే ఒక మనిషి ఆయన దగ్గరకు వచ్చి ఆయనముందు మోకరిల్లి ఇలా అన్నాడు: 15 ✽“స్వామీ! నా కొడుకును దయ చూడండి. అతడు మూర్ఛ రోగంతో ఎంతో బాధపడుతూ ఉన్నాడు. నిప్పులో, నీళ్ళలో తరచుగా పడిపోతూ ఉంటాడు. 16 అతణ్ణి మీ శిష్యుల దగ్గరికి తెచ్చాను గాని వాళ్ళు అతణ్ణి బాగు చేయలేక పోయారు.”
17 ✽యేసు ఇలా బదులు చెప్పాడు: “విశ్వాసం లేని తరమా! వక్రమార్గం పట్టిన తరమా! నేనెంతకాలం మీతో ఉంటాను! ఎందాక✽ మిమ్ములను సహించాలి! ఆ అబ్బాయిని నా దగ్గరకు తీసుకురా.”
18 ✝యేసు ఆ దయ్యాన్ని గద్దించాడు. అది అతనిలో నుండి బయటికి వచ్చింది. వెంటనే అబ్బాయికి పూర్తిగా నయం అయింది.
19 ✽ తరువాత శిష్యులు ఒంటరిగా యేసుదగ్గరికి వచ్చి “మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోయాం?” అని అడిగారు.
20 వారితో ఆయన “దేవుని మీద మీకున్న అపనమ్మకం వల్లే నేను మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీకు ఆవగింజంత నమ్మకం ఉంటే చాలు – మీరు ఈ కొండతో ‘ఇక్కడనుండి అక్కడికి పో!’ అంటే అది పోతుంది. అంతేకాదు, మీకు అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. 21 అయినా, ఇలాంటిది ప్రార్థన, ఉపవాసం వల్ల తప్ప బయటికి పోదు” అన్నాడు.
22 ✽ వారు గలలీలో ఉన్నప్పుడు యేసు వారితో అన్నాడు, “మానవ పుత్రుణ్ణి మనుషుల చేతులకు పట్టి ఇవ్వడం జరుగబోతుంది. 23 వారు ఆయనను చంపుతారు. మూడో రోజున ఆయన సజీవంగా లేపబడుతాడు.” అది విని వారికి అధిక దుఃఖం ముంచుకువచ్చింది.
24 ✽ వారు కపెర్‌నహూంకు చేరుకొన్న తరువాత అర తులం పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి “మీ గురువు అర తులం పన్ను చెల్లించడా?”
25 ✽అతడు “అవును” అన్నాడు. అతడు ఇంట్లోకి వచ్చిన తరువాత యేసే మొదట మాట్లాడాడు, “సీమోనూ, భూరాజులు సుంకం, పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? తమ కొడుకుల దగ్గరా? పరాయివారి దగ్గరా? నీకేం తోస్తుంది?”
26 ✽అతడు “పరాయివాళ్ళ దగ్గరే” అని ఆయనతో అనడంతో యేసు “అయితే కొడుకులు స్వతంత్రులు. 27 ✽అయినా వారికి అభ్యంతరం కలిగించకుండేలా నీవు సరస్సుకు వెళ్ళి గాలం వెయ్యి. మొదట పట్టిన చేపను తీసుకొని దాని నోరు తెరిస్తే తులమంత విలువగల నాణెం నీకు కనిపిస్తుంది. దానిని తీసుకొని నాకోసం, నీకోసం వారికివ్వు” అన్నాడు.