16
1 పరిసయ్యులూ సద్దూకయ్యులూ యేసు దగ్గరికి వచ్చి ఆయనను పరీక్షించాలనే ఉద్దేశంతో పరలోకంనుంచి తమకు సూచనకోసం అద్భుతం ఒకటి చూపమని అడిగారు.
2 ఆయన వారికిలా బదులు చెప్పాడు: “సాయంకాలాన ‘ఆకాశం ఎర్రగా ఉంది గనుక వాతావరణం బాగుంటుంద’ని మీరు అంటారు గదా. 3 ప్రొద్దున ‘ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉంది గనుక గాలివాన వస్తుంది’ అంటారు. కపట భక్తులారా! ఆకాశ పరిస్థితిని గుర్తించగలరు గాని ఈ కాల సూచనలను గుర్తించలేరేమిటి? 4 సూచనకోసమైన అద్భుతం కావాలని చూచే తరం చెడ్డది, వ్యభిచారసంబంధమైనది. యోనాప్రవక్తను గురించినది తప్ప ఇంకా ఏ సూచనా ఈ తరంవారికి చూపడం జరగదు.” అప్పుడాయన వారిని విడిచి వెళ్ళిపోయాడు.
5 ఆయన శిష్యులు అవతలి ఒడ్డుకు వచ్చినప్పుడు రొట్టెలు తెచ్చుకోవడం మరచిపోయారు. 6 వారితో యేసు ఇలా అన్నాడు: “మీరు శ్రద్ధ కలిగి ఉండండి – పరిసయ్యులకు, సద్దూకయ్యులకు సంబంధించిన ‘పొంగజేసే పదార్థం’ గురించి జాగ్రత్తగా ఉండండి!”
7 “మనం రొట్టెలు తేలేదు గనుక ఇలా అన్నాడు” అనుకొంటూ వారు చర్చలో పడ్డారు.
8  అది తెలుసుకొని యేసు “అల్ప విశ్వాసం గలవారలారా, మీరు ఏమీ రొట్టెలు తీసుకురాని సంగతి ఎందుకు చర్చించుకొంటున్నారు? 9 మీరు ఇంకా గ్రహించలేదా? ఐదు రొట్టెలు ఐదు వేలమందికి వడ్డించిన తరువాత మీరు ఎన్ని నిండు గంపలు ఎత్తారో అది జ్ఞాపకం లేదా? 10 ఏడు రొట్టెలు నాలుగు వేలమంది విషయం మీరు ఎన్ని నిండు పెద్ద గంపలు ఎత్తారో అది కూడా గుర్తు లేదా? 11 నేను మీతో మాట్లాడినది రొట్టెల గురించి కాదని మీకెందుకు అర్థం కాలేదు? పరిసయ్యుల, సద్దూకయ్యుల ‘పొంగజేసే పదార్థం’ గురించి జాగ్రత్త అన్నాను” అన్నాడు.
12 పరిసయ్యుల, సద్దూకయ్యుల ఉపదేశం విషయం జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పాడని, రొట్టెలను పొంగజేసే పదార్థం విషయం కాదని అప్పుడు వారు గ్రహించారు.
13 సీజరియ ఫిలిప్పీ పరిసరాలకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇలా ప్రశ్నించాడు: “మానవ పుత్రుడైన నేను ఎవరినని ప్రజలు చెప్పుకొంటున్నారు?”
14 వారు “బాప్తిసమిచ్చే యోహానువు అంటారు కొందరు. మరికొందరు ఏలీయావు, మరికొందరు యిర్మీయావు లేదా, ప్రవక్తలలో ఇంకొకడవు అంటారు” అన్నారు.
15 “అయితే నేనెవరినని మీరు చెప్పుకొంటూ ఉన్నారు?” అని ఆయన వారినడిగాడు.
16 “నీవు అభిషిక్తుడవే! సజీవుడైన దేవుని కుమారుడవే!” అని సీమోను పేతురు సమాధానం చెప్పాడు.
17 యేసు అతనికిలా జవాబిచ్చాడు: “యోనా కుమారుడైన సీమోను, నీవు ధన్యుడవు. ఎందుకంటే, ఈ సత్యం నీకు వెల్లడి చేసినది పరలోకంలో ఉన్న నా తండ్రి గాని రక్తం, మాంసం కాదు. 18 ఇంకొకటి నీతో చెపుతాను. నీవు పేతురువు. ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మించుకొంటాను. పాతాళ ద్వారాలు దానిని ఎదిరించి నిలవలేవు. 19 పరలోక రాజ్యానికి తాళం చెవులు నీకిస్తాను. నీవు భూమిమీద దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధితమే. భూమిమీద దేనిని విడుదల చేస్తే దానికి పరలోకంలో విడుదలే!”
20 అప్పుడు తాను – యేసు – అభిషిక్తుణ్ణని ఎవరికీ చెప్పకూడదని శిష్యులను ఆదేశించాడు.
21 అప్పటినుంచి యేసు తన శిష్యులకు ఈ సంగతులు తెలియజేయడం ఆరంభించాడు: తాను జెరుసలం వెళ్ళి, పెద్దలచేత, ప్రధాన యాజులచేత, ధర్మశాస్త్ర పండితులచేత అనేక బాధలపాలై చంపబడి మూడో రోజున సజీవంగా లేపబడడం తప్పనిసరి అని.
22 అప్పుడు పేతురు ఆయనను ఒక్కణ్ణే తీసుకువెళ్ళి మందలించసాగాడు: “ప్రభూ! దేవుడు దీనిని తప్పించాలి! నీకిలా ఎప్పటికీ జరగకూడదు” అన్నాడు.
23  యేసు పేతురువైపు తిరిగి, అతనితో “సైతానూ! నా వెనుకకు పో! నీవు నా త్రోవలో ఆటంకంగా ఉన్నావు. మనుషుల సంగతుల మీదే గాని దేవుని సంగతుల మీద నీ మనసుండడం లేదు” అన్నాడు.
24 అప్పుడు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఎవరైనా సరే నా వెంట రావాలనుకొంటే, తనను తిరస్కరించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను అనుసరించాలి. 25  తన కోసం ప్రాణాన్ని దక్కించుకోవాలనుకొనేవాడు దానిని పోగొట్టుకొంటాడు. కానీ నాకోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవాడు దానిని కనుక్కొంటాడు. 26 ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకొంటే అతనికి లాభమేమి? మనిషి తన ప్రాణానికి బదులు ఏమిస్తాడు? 27 మానవ పుత్రుడు తన తండ్రి ప్రతాపంతోనూ దేవదూతలతోనూ వస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ వారి పనులప్రకారం ప్రతిఫలం ఇస్తాడు. 28 మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, ఇక్కడ నిలుచున్నవారిలో కొంతమంది, మానవ పుత్రుడు తన రాజ్యంతో రావడం చూచేవరకు చనిపోరు.”