15
1 అప్పుడు పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ కొందరు జెరుసలంనుంచి యేసు దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: 2 ✽“మీ శిష్యులు భోజనం చేయకముందు చేతులు కడుక్కోకుండా పెద్దల సాంప్రదాయాన్ని మీరుతారెందుకు?”3 ✽అందుకాయన వారికిలా బదులు చెప్పాడు: “మీరు మీ సాంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను మీరుతున్నారెందుకు? 4 ✝దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు గదా: మీ తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిని గానీ తండ్రిని గానీ దూషించేవారికి మరణశిక్ష విధించి తీరాలి. 5 ✽మీరైతే ఇలా అంటారు: ఎవడైనా తండ్రిని గానీ తల్లిని గానీ చూచి ‘నా వల్ల మీరు పొందగలిగి ఉన్న సహాయం కాస్తా దేవునికి అర్పించబడింది’ అని చెపితే 6 అలాంటివాడు ఆ విషయంలో తండ్రిని గానీ తల్లిని గానీ గౌరవించనక్కరలేదన్న మాట. ఈ విధంగా మీ సాంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తున్నారు. 7 మీరు కపట భక్తులు✽! మీ విషయం యెషయాప్రవక్త ముందుగా పలికినది సరిగానే ఉంది – 8 ✽ ఈ ప్రజలు తమ నోటితో నా దగ్గరికి చేరుతున్నారు, తమ పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు గానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. 9 వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మానవ కల్పితమైన ఆదేశాలను దేవుని ఉపదేశాలుగా బోధిస్తున్నారు.”
10 అప్పుడాయన జన సమూహాన్ని దగ్గరికి పిలిచి వారికిలా చెప్పాడు: “వినండి! గ్రహించండి! 11 ✽నోట్లోకి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయదు గాని నోట్లోనుంచి వచ్చేదే మనిషిని అపవిత్రం చేస్తుంది.”
12 అప్పుడు ఆయన శిష్యులు ఆయనదగ్గరికి వచ్చి “ఈ మాట విన్నప్పుడు అది పరిసయ్యులకు అభ్యంతర కారణం అయింది తెలుసా” అన్నారు.
13 ✽అందుకాయన ఈ సమాధానం చెప్పాడు: “నా పరమ తండ్రి నాటని ప్రతి మొక్కనూ వేళ్ళతో పెరికివేయడం జరుగుతుంది. 14 వారిని విడిచిపెట్టండి. వారు గుడ్డివారికి దారి చూపే గుడ్డివారు✽. గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపితే ఇద్దరూ గుంటలో పడిపోతారు.”
15 అప్పుడు పేతురు “ఆ ఉదాహరణ మాకు వివరించండి” అని ఆయనకు జవాబిచ్చాడు.
16 ✝యేసు అన్నాడు, “ఇంకా మీరు కూడా మందబుద్ధులేనా? 17 నోటిలో వేసుకొనేదంతా కడుపులోకి పోయి విసర్జించ బడుతుంది. 18 కానీ నోటనుంచి వచ్చేవి హృదయంలోనుంచి వస్తాయి. ఇవి మనిషిని అపవిత్రం చేస్తాయి. మీరింకా ఇది గ్రహించడం లేదా? 19 ✽హృదయంలో నుంచి చెడ్డ తలంపులు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక అవినీతి, దొంగతనాలు, దొంగ సాక్ష్యాలు, దూషణలు వస్తాయి. 20 ఇలాంటివే మనిషిని అపవిత్రం చేస్తాయి, గాని చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం మనిషిని అపవిత్రం చేయదు.”
21 ✝యేసు అక్కడనుంచి బయలుదేరి తూరు, సీదోను ప్రాంతానికి వెళ్ళాడు. 22 ✽అప్పుడు, ఆ ప్రాంతంలో నివసించే కనాను స్త్రీ ఒకతె వచ్చి ఆయనకు ఇలా బిగ్గరగా చెప్పింది: “స్వామీ! దావీదు కుమారుడా! నామీద దయ చూపండి. నా కూతురును దయ్యం ఘోరంగా పట్టింది.”
23 ✽అందుకాయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి “ఆమెను పంపివేయండి. మా వెంటబడి కేకలు వేస్తూ ఉంది” అని ఆయనను ప్రాధేయ పడ్డారు.
24 ఆయన జవాబిచ్చాడు, “ఇస్రాయేల్ వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకు మాత్రమే నేను పంపబడ్డాను.”
25 అయితే ఆమె వచ్చి ఆయనను ఆరాధించి “స్వామీ! నాకు సహాయం చెయ్యండి!” అంది.
26 ✽అందుకాయన “పిల్లల భోజనం తీసి కుక్కపిల్లలకు వేయడం తగిన పని కాదు” అని జవాబిచ్చాడు.
27 ✽ఆమె “నిజమే స్వామీ గాని కుక్కపిల్లలు సహా తమ యజమాని బల్లమీదనుంచి పడే ముక్కలు తింటాయి గదా!” అంది.
28 ✽అప్పుడు యేసు ఆమెకు ఇలా జవాబిచ్చాడు: “అమ్మా, నీ నమ్మకం గొప్పది. నీవు కోరినట్టే నీకు జరుగుతుంది.” ఆ ఘడియలోనే ఆమె కూతురికి పూర్తిగా నయం అయింది.
29 యేసు అక్కడనుంచి బయలుదేరి గలలీ సరస్సుకు దగ్గరగా చేరి, ఒక కొండెక్కి కూర్చున్నాడు. 30 ✝గొప్ప జనసమూహాలు వచ్చి కుంటివారినీ గుడ్డివారినీ మూగవారినీ వికలాంగులనూ ఇంకా అనేకులను ఆయన దగ్గరకు తెచ్చి ఆయన పాదాల ముందు ఉంచారు. ఆయన వారిని బాగు చేశాడు. 31 ✽ మూగవారు మాట్లాడ్డం, వికలాంగులకు పూర్తిగా నయం కావడం, కుంటివారు నడవడం, గుడ్డివారు చూడడం చూచి జన సమూహానికి చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు వారు ఇస్రాయేల్ ప్రజల దేవుణ్ణి కీర్తించారు.
32 ✽ తన శిష్యులను తన దగ్గరకు పిలుచుకొని యేసు ఇలా అన్నాడు: “ఈ జన సమూహం మీద నాకు జాలి వేస్తూ ఉంది. ఎందుకంటే తినడానికి వీరిదగ్గర ఏమీ లేదు. మూడు రోజులు నా దగ్గరే ఉన్నారు గదా. వారిని ఆకలితోనే పంపివేయడం నాకిష్టం లేదు. దారిలో వారు శోష పోవచ్చు.”
33 ✽ఆయన శిష్యులు ఆయనతో అన్నారు, “ఎవరూ కాపురం లేని ఈ స్థలంలో ఇంత పెద్ద గుంపు తృప్తిగా తినడానికి చాలినన్ని రొట్టెలు మనకు ఎక్కడ దొరుకుతాయి!”
34 యేసు “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారినడిగాడు. వారు “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి” అన్నారు.
35 జన సమూహం నేలమీద కూర్చోవాలని ఆయన ఆదేశించాడు. 36 ✝అప్పుడు ఆ ఏడు రొట్టెలూ ఆ చేపలూ చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పించాడు. వాటిని విరిచి తన శిష్యులకు అందించాడు. శిష్యులు జన సమూహానికి వడ్డించారు. 37 ✽అందరూ తిని సంతృప్తి చెందారు. తరువాత మిగిలిన ముక్కలను ఎత్తితే మొత్తం ఏడు పెద్ద గంపలు నిండాయి. 38 తిన్న పురుషులు నాలుగు వేలమంది. వారితో పాటు స్త్రీలు, పిల్లలు తిన్నారు. 39 ✽తరువాత ఆయన జనసమూహాన్ని పంపివేసి పడవ ఎక్కి మగ్దాల ప్రాంతానికి వెళ్ళాడు.