14
1 ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదుకు యేసు విషయం వినవచ్చింది. 2 అతడు తన పరివారంతో ఇలా అన్నాడు: “ఇతడు బాప్తిసమిచ్చే యోహాను. చచ్చినవారిలో నుంచి సజీవంగా లేచాడు. అందుచేత అతడిలో అద్భుతాలు చేసే ఈ బలప్రభావాలు పని చేస్తున్నాయి.”
3 మునుపు హేరోదు తన తోబుట్టువైన ఫిలిప్పు భార్య హేరోదియ కారణంగా యోహానును పట్టుకొని, బంధించి, ఖైదులో వేయించాడు. 4 ఎందుకంటే, యోహాను అతడితో “మీరు ఆమెను అలా పెట్టుకోవడం న్యాయం కాదు” అంటూ వచ్చాడు.
5 అతడు యోహానును చంపించాలని ఆశించినా ప్రజానీకానికి భయపడ్డాడు. ఎందుకంటే వారు యోహానును ప్రవక్తగా భావించారు. 6 అయితే హేరోదు జన్మ దినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కూతురు వాళ్ళ ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది. 7 అందుచేత ఆమె ఏమడిగినా ఇస్తానని అతడు శపథం చేసి మాట ఇచ్చాడు. 8 తన తల్లి తనను ప్రేరేపించినందుచేత ఆమె ఇలా అంది: “బాప్తిసం ఇచ్చే యోహాను తల పళ్ళెంలో ఉంచి ఇక్కడే నాకిప్పించండి.” 9 రాజుకు విచారం కలిగినా, తాను చేసిన శపథాల కారణంగా తనతో భోజనానికి కూర్చుని ఉన్నవారి కారణంగా దానిని ఇవ్వాలని ఆజ్ఞ జారీ చేశాడు. 10 భటులను పంపి ఖైదులో యోహాను తల నరికించాడు. 11 వారు తలను పళ్ళెంలో తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె దాన్ని తన తల్లి దగ్గరికి తెచ్చింది. 12 యోహాను శిష్యులు వచ్చి అతని శరీరాన్ని తీసుకువెళ్ళి పాతిపెట్టారు. అప్పుడు వెళ్లి యేసుకు ఆ సంగతి చెప్పారు.
13 అది విని యేసు పడవ ఎక్కి, అక్కడనుంచి నిర్జన ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆ సంగతి విని జన సమూహాలు పట్టణాలనుంచి కాలినడకన ఆయన వెంట వెళ్ళారు. 14 యేసు బయటికి వెళ్ళినప్పుడు పెద్ద జన సమూహం ఆయనకు కనిపించింది. ఆయన వారిమీద జాలిపడి వారి రోగాలను బాగు చేశాడు. 15 సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, “ఇది అరణ్యం. ఇప్పటికే ప్రొద్దు పోయింది. ఈ జన సమూహాలు గ్రామాలకు వెళ్ళి తినుబండారాలు కొనుక్కోవడానికి వారిని పంపించండి.”
16 యేసు వారితో “వారు వెళ్ళనక్కరలేదు. మీరే వారికి ఆహారం పెట్టండి” అన్నాడు.
17 వారు “ఇక్కడ మనదగ్గర ఉన్నది అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే” అని ఆయనతో అన్నారు.
18 ఆయన “వాటిని నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. 19 జన సమూహం పచ్చికమీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ అయిదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకొని ఆకాశంవైపు తలెత్తి చూస్తూ దేవునికి కృతజ్ఞత అర్పించాడు. అప్పుడు రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు. 20 అందరూ తిని సంతృప్తి చెందారు. తరువాత వారు మిగిలిన ముక్కలను ఎత్తితే మొత్తం పన్నెండు గంపలు నిండాయి. 21 స్త్రీలు, పిల్లలు గాక పురుషులే సుమారు అయిదు వేలమంది తిన్నారు.
22 వెంటనే యేసు జన సమూహాలను పంపివేస్తూ, శిష్యులను తనకంటే ముందుగా అవతల ఒడ్డుకు వెళ్ళండని పడవ ఎక్కించాడు. 23 ఆ గుంపులను పంపివేసిన తరువాత ప్రార్థన చేయడానికి తానొక్కడే కొండెక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన అక్కడే ఒంటరిగా ఉన్నాడు.
24 అప్పటికి ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది. గాలి ఎదురుగా వీస్తూ ఉండడంవల్ల అది అలలకు కొట్టుకుపోతూ ఉంది. 25 రాత్రి నాలుగో జామున యేసు సరస్సుమీద నడుస్తూ వారికి దగ్గరగా వచ్చాడు. 26 ఆయన సరస్సు మీద నడుస్తూ ఉండడం చూచి శిష్యులు హడలిపోయి “అది భూతం!” అని భయంతో కేకలు పెట్టారు.
27 వెంటనే యేసు వారిని పలకరించి “ధైర్యం తెచ్చుకోండి! నేనే! భయపడకండి!” అన్నాడు.
28 పేతురు ఆయనతో “ప్రభూ, నీవే అయితే, నన్ను నీ దగ్గరికి నీళ్ళమీద నడచి రమ్మనండి!” అన్నాడు.
29 ఆయన రమ్మన్నాడు. పేతురు పడవ దిగి, నీళ్ళమీద నడుస్తూ యేసువైపు వెళ్ళాడు. 30 కానీ గాలి ప్రబలంగా ఉండడం చూచి భయపడి, మునిగిపోబోయాడు. “ప్రభూ! నన్ను రక్షించు!” అని కేకపెట్టాడు.
31 వెంటనే యేసు చేయి చాచి అతణ్ణి పట్టుకొన్నాడు. “అల్ప విశ్వాసం గలవాడా సందేహపడ్డావేమిటి!” అని అతనితో అన్నాడు.
32 వారు పడవ ఎక్కినప్పుడు గాలి ఆగింది. 33  పడవలో ఉన్నవారు వచ్చి “నిజంగా నీవు దేవుని కుమారుడవు” అని చెప్పి ఆయనను ఆరాధించారు.
34 వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరుకొన్నారు. 35 అక్కడి మనుషులు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపట్ల ఉన్న ప్రాంతం అంతటికీ కబురంపి, రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు. 36 వారిని, నీ వస్త్రం అంచును మాత్రమే ముట్టనివ్వండని ఆయనను ప్రాధేయ పడ్డారు. అలా ముట్టిన వారందరికీ పూర్తిగా నయం అయింది.