13
1 ఆ రోజునే యేసు ఇంట్లోనుంచి బయటికి వెళ్ళి సరస్సు ఒడ్డున కూర్చున్నాడు. 2 ప్రజలు పెద్ద గుంపులుగా ఆయన చుట్టూ గుమిగూడడం చేత ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలంతా ఒడ్డున నిలుచున్నారు. 3 అప్పుడు ఆయన ఉదాహరణల రూపంలో వారికి అనేక సంగతులు చెప్పాడు:
“విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. 4 విత్తనాలు చల్లుతూ ఉంటే, కొన్ని దారిప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మ్రింగివేశాయి. 5 మరికొన్ని విత్తనాలు మన్ను ఎక్కువగా లేని రాతి స్థలాల్లో పడ్డాయి. మన్ను లోతు లేకపోవడంచేత అవి త్వరలోనే మొలకెత్తాయి. 6 కానీ ప్రొద్దు పొడిచినప్పుడు ఆ మొలకలు మాడిపోయాయి. వాటికి వేరులు లేకపోవడం వల్ల అవి ఎండిపోయాయి. 7 మరికొన్ని విత్తనాలు ముండ్ల తుప్పలలో పడ్డాయి. ముండ్ల తుప్పలు పెరిగి మొక్కలను అణచిపెట్టివేశాయి. 8 మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. అవి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని నూరు రెట్లు, కొన్ని అరవై రెట్లు, కొన్ని ముప్ఫయి రెట్లు పండాయి. 9  వినడానికి చెవులున్నవాడు వింటాడు గాక!”
10 శిష్యులు వచ్చి ఆయనను “వారికి ఉదాహరణల్లో ఎందుకు చెపుతున్నారు?” అని అడిగారు.
11 ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు: “ఎందుకంటే పరలోక రాజ్య రహస్య సత్యాలు తెలుసుకొనే అవకాశం మీకు ఇవ్వబడింది గాని వారికి ఇవ్వబడలేదు. 12 కలిగినవానికి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అతనికి సమృద్ధిగా ఉంటుంది. లేనివానినుంచి అతనికి ఉన్నదానిని కూడా తీసివేయడం జరుగుతుంది. 13 నేను వారితో ఉదాహరణల్లో చెప్పే ఉద్దేశం ఇదే: ‘వారు చూస్తూనే ఉన్నా నిజంగా చూడరు. వింటూనే ఉన్నా నిజంగా వినరు, గ్రహించరు.’ 14  యెషయా పలికిన భవిష్యద్వాక్కు వారి విషయంలో నెరవేరుతూ ఉంది. అదేమంటే, ‘మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు గాని అర్థం చేసుకోరు. ఎప్పుడూ చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు. 15 ఎందుకంటే ఈ ప్రజల హృదయం మొద్దుబారిపోయింది. వాళ్ళకు చెవికెక్కేది చాలా తక్కువ. వాళ్ళు తమ కండ్లు మూసుకొన్నారు. వాళ్ళు కండ్లతో చూచి, చెవులతో విని, హృదయాలతో అర్థం చేసుకొని నావైపు తిరిగి, నా వల్ల నివారణ పొందకుండేలా అలా చేశారు.
16 “కానీ మీ కండ్లు చూస్తూ ఉన్నాయి గనుక అవి ధన్యం అయ్యాయి. మీ చెవులు వింటూ ఉన్నాయి గనుక అవి ధన్యం అయ్యాయి. 17 మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు చూస్తున్నదానిని చూడాలనీ వింటున్నదానిని వినాలనీ అనేక మంది ప్రవక్తలూ న్యాయవంతులూ ఆశించారు గాని చూడలేకపోయారు, వినలేకపోయారు.
18 “విత్తనాలు చల్లేవాని ఉదాహరణ భావం వినండి. 19 పరలోక రాజ్యాన్ని గురించిన వాక్కు ఎవరైనా విని దాన్ని గ్రహించకపోతే దుర్మార్గుడు వచ్చి ఆ వ్యక్తి హృదయంలో విత్తినదానిని ఎత్తుకుపోతాడు. దారి ప్రక్కన విత్తనాలు పొందినది ఈ వ్యక్తి. 20 రాతి స్థలాలలో విత్తనాలు పొందినది ఎవరంటే వాక్కు వినీ వినడంతోనే దానిని సంతోషంతో అంగీకరించేవాడు. 21 కానీ అతనిలో వేరులు లేకపోవడం చేత కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్కు కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే అతడు తొట్రుపడిపోతాడు. 22 ముండ్ల తుప్పలలో విత్తనాలు పొందినది ఎవరంటే, వాక్కు వింటాడు గాని ఇహలోక చింత, ధనం మూలమైన మోసం వాక్కును అణచి వేస్తాయి. అతడు ఫలించని వాడైపోతాడు. 23 మంచి నేలను విత్తనాలు పొందినది ఎవరంటే – వాక్కు విని గ్రహించి ఫలవంతంగా ఉండేవాడు. కొందరు నూరు రెట్లు, కొందరు అరవై రెట్లు, మరికొందరు ముప్ఫయి రెట్లు ఫలిస్తారు.”
24 ఆయన వారికి మరో ఉదాహరణ చెప్పాడు – “పరలోక రాజ్యం ఈ విధంగా ఉంది: ఒకతను తన పొలంలో మంచి విత్తనాలు చల్లాడు. 25 మనుషులు నిద్రపోతూ ఉంటే, అతని పగవాడు వచ్చి గోధుమల మధ్య కలుపుమొక్కల విత్తనాలు చల్లి వెళ్ళిపోయాడు. 26 గోధుమలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపుమొక్కలు కూడా కనిపించాయి. 27 యజమాని దాసులు వచ్చి అతణ్ణి ఇలా అన్నారు: ‘అయ్యగారూ, మీ పొలంలో మంచి విత్తనాలు వేశారు గదా! ఈ కలుపుమొక్కలు ఉండడం ఎలా?’ 28 అతడు వారితో అన్నాడు ‘ఇది పగవాడు చేసిన పని.’ దాసులు, ‘మమ్మల్ని వెళ్ళి ఆ కలుపు మొక్కలు పీకెయ్యమంటారా?’ అని అతణ్ణి అడిగారు. 29 అందుకతడు ‘వద్దు, కలుపు మొక్కలు పీకివేసేటప్పుడు వాటితోకూడా గోధుమ మొక్కలు పెళ్ళగిస్తారేమో. 30 కోతకాలం వరకు రెంటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో నేను కోతవారికి చెపుతాను, ‘ముందుగా కలుపు మొక్కలు పోగుచేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి. అప్పుడు గోధుమలు నా గిడ్డంగిలో చేర్చండి’ అన్నాడు.”
31 ఆయన వారికి మరో ఉదాహరణ చెప్పాడు – “ఒకతను తన పొలంలో ఒక ఆవగింజ నాటాడు. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది. 32 గింజలన్నిట్లో ఆవగింజ చిన్నది. అయితే అది పెరిగినప్పుడు కూరమొక్కలన్నిటినీ మించి చెట్టు అవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి.”
33 ఆయన వారికి మరో ఉదాహరణ చెప్పాడు – “ఒక స్త్రీ మూడు మానికల పిండిలో పొంగజేసే పదార్థం దాచి పెట్టింది. దాని వల్ల పిండి అంతట్లో పొంగజేసే పదార్థం వ్యాపించింది. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది.”
34 ఈ సంగతులన్నీ యేసు ఉదాహరణల్లో జనసమూహానికి చెప్పాడు. ఉదాహరణ లేకుండా వారికి ఏమీ చెప్పలేదు. 35  ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ మాట నెరవేరాలని అలా చెప్పాడు: నోరార నేను ఉదాహరణలు చెపుతాను. లోక సృష్టి నాటినుంచి రహస్యంగా ఉంచబడిన విషయాలు పలుకుతాను.
36 అప్పుడు యేసు జన సమూహాన్ని పంపివేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలో ఉన్న కలుపు మొక్కల ఉదాహరణ మాకు వివరించండి” అని చెప్పారు.
37 ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు: “మంచి విత్తనాలు చల్లేది మానవ పుత్రుడు. 38 పొలం ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి చెందినవారు. కలుపు మొక్కలు దుర్మార్గుడికి చెందినవారు. 39 వారిని చల్లే ఆ పగవాడు అపనింద పిశాచం. కోతకాలం ఈ యుగ సమాప్తి. ఆ కోత కోసేవారు దేవదూతలు. 40 కలుపు మొక్కలను పోగుచేసి అగ్నిలో కాల్చినట్టే ఈ యుగాంతంలో జరుగుతుంది. 41 మానవ పుత్రుడు తన దేవదూతలను పంపుతాడు. వారు తొట్రుపాటుకు కారణమైన ప్రతిదానినీ, దుర్మార్గం చేసేవారందరినీ ఆయన రాజ్యంలోనుంచి పోగుచేస్తారు. 42 వారిని అగ్నిగుండంలో పారవేస్తారు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి. 43  అప్పుడు న్యాయవంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యమండలం లాగా ప్రకాశిస్తారు. వినడానికి చెవులున్నవాడు వింటాడు గాక!
44  “మరొకటి – పరలోక రాజ్యం పొలంలో దాచిపెట్టిన నిధిలాంటిది. ఒక మనిషి దానిని కనుక్కొని అలాగే దాచివేశాడు. అప్పుడు దొరికిందనే సంతోషంతో వెళ్ళి తనకున్నదంతా అమ్మివేసి ఆ పొలం కొనుక్కొన్నాడు.
45 “మరొకటి – వర్తకుడు మంచి ముత్యాలకోసం వెదుకుతూ వచ్చాడు. 46 చాలా విలువైన ముత్యం ఒకటి కనబడగానే అతడు వెళ్ళి తనకున్నది అంతా అమ్మివేసి ఆ ముత్యం కొనుక్కొన్నాడు. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది.
47 “ఇంకొకటి – వల సరస్సులో వేసి ఉంది. దానిలో అన్ని రకాల చేపలు పడ్డాయి. 48 వల నిండినతరువాత దానిని ఒడ్డుకు లాగారు. కూర్చుని మంచి చేపలు బుట్టల్లో వేసుకొన్నారు, పనికిమాలినవి అవతల పారవేశారు. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది. 49 ఈ యుగ సమాప్తిలో అలాగే జరుగుతుంది. దేవదూతలు వచ్చి, న్యాయవంతుల మధ్యనుంచి చెడ్డవారిని వేరుపరుస్తారు. 50 వారిని అగ్నిగుండంలో పారవేస్తారు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.
51 “మీరు ఇవన్నీ గ్రహించారా?” అని ఆయన వారిని అడిగినప్పుడు వారు “అవును, ప్రభూ” అన్నారు. 52 ఆయన వారితో అన్నాడు, “ఇంటి యజమాని తన నిధిలోనుంచి పాతవీ క్రొత్తవీ తెస్తాడు. పరలోక రాజ్యాన్ని గురించిన ఉపదేశం నేర్చుకొన్న ప్రతి ధర్మశాస్త్ర పండితుడూ అలాంటివాడే.”
53 యేసు ఈ ఉదాహరణలు చెప్పడం ముగించాక అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. 54 తన స్వగ్రామం చేరి, సమాజ కేంద్రంలో వారికి ఉపదేశించాడు. వారు చాలా ఆశ్చర్యపడి “ఈ జ్ఞానం, అద్భుతాలు చేసే ఈ సామర్థ్యం ఇతడికి ఎక్కడనుంచి వచ్చాయి? 55 ఇతడు వడ్రంగి కొడుకే గదా! ఇతడి తల్లి పేరు మరియ కాదా. యాకోబు, యోసె, సీమోను, యూదా ఇతడి తమ్ముళ్ళేగా. 56 ఇకపోతే ఇతడి చెల్లెళ్ళంతా మనమధ్యే ఉన్నారు గదా. ఇతడికి ఇవన్నీ ఎక్కడనుంచి వచ్చాయి?” అని చెప్పుకొన్నారు. 57  ఇలా వారు ఆయనలో అభ్యంతర కారణం కనుక్కొన్నారు. అయితే యేసు వారితో ఇలా అన్నాడు:
“ప్రవక్త తన స్వగ్రామంలో, సొంత ఇంట్లో తప్ప మరెక్కడా గౌరవహీనుడు కాడు.” 58  తనమీద వారికి నమ్మకం లేకపోవడం చేత ఆయన అనేక అద్భుతాలు అక్కడ చేయలేదు.