12
1 ఆ సమయంలో ఒక విశ్రాంతి దినం యేసు పంట చేల గుండా వెళ్తూ ఉన్నాడు. ఆయన శిష్యులకు ఆకలి వేసింది. వారు కంకులు తెంపుకొని తినసాగారు. 2 అది చూచి పరిసయ్యులు ఆయనతో “చూడు, విశ్రాంతి దినాన చేయకూడని పని నీ శిష్యులు చేస్తున్నారు” అన్నారు.
3 ఆయన వారితో ఇలా అన్నాడు: “దావీదుకూ అతనితో ఉన్నవారికీ ఆకలి వేసినప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా? 4 అతడు దేవుని మందిరంలో ప్రవేశించాడు. సన్నిధి రొట్టెతిన్నాడు. అది యాజులకే గాని అతడూ అతనితో ఉన్నవారూ తినకూడనిది. 5 అంతేగాక, విశ్రాంతి దినాల్లో దేవాలయంలో ఉన్న యాజులు విశ్రాంతి దినానికి చెందిన నియమాన్ని మీరినప్పటికీ వారికి దోషం లేదు. మీరు ఇది ధర్మశాస్త్రంలో చదవలేదా? 6 మీతో నేను చెప్పేదేమిటంటే, దేవాలయంకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 7 ‘మీరు కరుణ చూపడమే నాకిష్టం గాని బలియాగాలు అర్పించడం కాదు’ అనే వాక్కు భావం ఏమిటో మీకు తెలిసి ఉంటే నేరం చేయనివారి విషయం తీర్పు చెప్పి ఉండరు. 8 ఎందుకంటే మానవ పుత్రుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువు.”
9 ఆయన అక్కడనుంచి వెళ్ళి వారి సమాజ కేంద్రంలో ప్రవేశించాడు. 10 అక్కడ చేయి ఎండిపోయినవాడొకడు ఉన్నాడు. యేసుపై నేరం మోపాలని వారు ఆయనను ఇలా అడిగారు: “విశ్రాంతి దినాన బాగు చేయడం ధర్మశాస్త్రానికి అనుగుణమేనా?”
11 ఆయన వారితో అన్నాడు, “మీలో ఎవనికైనా సరే గొర్రె ఒకటి ఉంది అనుకోండి. విశ్రాంతి దినాన అది గుంటలో పడితే దానిని పట్టుకొని పైకి తీయడా? 12 గొర్రెకంటే మనిషికి ఎంతో ఎక్కువ విలువ ఉంది గదా! గనుక విశ్రాంతి దినాన మంచి చేయడం ధర్మశాస్త్రానికి అనుగుణమే!”
13 అప్పుడాయన ఆ మనిషితో “నీ చెయ్యి చాపు” అన్నాడు. అతడు దానిని చాపగానే అది పూర్వ స్థితికి మారి రెండో చేయిలాగా అయింది. 14  కానీ పరిసయ్యులు బయటికి వెళ్ళి, యేసును ఎలా రూపుమాపుదామా అని ఆయనపై కుట్రపన్నారు.
15 యేసు అది తెలుసుకొని అక్కడనుంచి వెళ్ళిపోయాడు. గొప్ప సమూహాలు ఆయనవెంట వెళ్ళాయి. ఆయన వారినందరినీ బాగు చేశాడు. 16 తన విషయం తెలియజేయ కూడదని వారిని ఆజ్ఞాపించాడు. 17  యెషయాప్రవక్తద్వారా దేవుడు చెప్పినది నెరవేరేలా అలా జరిగింది. 18 అదేమిటంటే, ఇడుగో నేను ఎన్నుకొన్న నా ప్రియ సేవకుడు! ఈయన అంటే నా ప్రాణానికి ఎంతో ఆనందం! ఈయనమీద నా ఆత్మను ఉంచుతాను. ఈయన ఇతర జనాలకు న్యాయాన్ని ప్రకటిస్తాడు. 19 ఈయన జగడమాడడు, కేకలు వేయడు. ఈయన స్వరం వీధులలో ఎవరికీ వినిపించదు. 20 న్యాయాన్ని నెగ్గించేవరకూ ఆయన నలిగిన రెల్లును విరవడు, మకమక లాడుతూ ఉన్న వత్తిని ఆర్పడు. 21 ఈయన పేరుమీద ఇతర జనాలకు నమ్మకం కలుగుతుంది.
22 అప్పుడు, దయ్యం పట్టిన ఒకణ్ణి ఆయన దగ్గరికి కొందరు తెచ్చారు. అతడు గుడ్డివాడూ మూగవాడూ. యేసు అతణ్ణి బాగు చేశాడు గనుక ఆ గుడ్డి, మూగవాడైన వ్యక్తి చూడటం మాట్లాడటం మొదలు పెట్టాడు. 23 ప్రజలంతా అధికంగా ఆశ్చర్యపడి “ఈయన దావీదు కుమారుడేనా ఏమిటి?” అని చెప్పుకొన్నారు.
24 అయితే పరిసయ్యులు అది విన్నప్పుడు “దయ్యాల నాయకుడు బయల్‌జెబూల్ సహాయంతో ఇతడు దయ్యాల్ని వెళ్ళగొడతున్నాడు గాని మరెవరి మూలంగా కాదు” అన్నాడు.
25 యేసు వారి ఆలోచనలు తెలుసుకొని వారితో అన్నాడు, “ఏ రాజ్యమైనా సరే తనను తానే వ్యతిరేకించి చీలిపోతే అది నాశనం అవుతుంది. పట్టణమూ ఇల్లూ ఏదైనా తనను తాను వ్యతిరేకించి చీలిపోతే అది నిలవదు. 26 ఒకవేళ సైతాను సైతానును బయటికి వెళ్ళగొట్టివేస్తే వాడు తనకు తాను వ్యతిరేకించి చీలిపోయి ఉన్నాడు! అలాంటప్పుడు వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? 27 ఒకవేళ నేను దయ్యాలను బయల్‌జెబూల్ సహాయంతో వెళ్ళగొట్టివేస్తే మీ కొడుకులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొట్టివేస్తున్నారు? అందుచేత వారు మీకు తీర్పరులు అవుతారు. 28 నేను దేవుని ఆత్మ సహాయంతో దయ్యాలను వెళ్ళగొట్టివేస్తూ ఉంటే, దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందన్నమాటే. 29 ఒకరు మొదట బలవంతుణ్ణి కట్టివేయకుండా ఆ బలవంతుడి ఇంట్లో చొచ్చి అతడి సామాను ఎలా దోచుకోగలరు? అతణ్ణి కట్టివేస్తేనే అతడి ఇంటి సామాను దోచుకొంటారు.
30  “నా పక్షాన ఉండనివాడు నాకు విరోధి. నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టేవాడు. 31 అందుచేత మీతో నేనంటాను, ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుంది గాని దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ అంటూ మనుషులకు దొరకదు. 32 మానవ పుత్రునికి విరోధంగా మాట్లాడేవారికి ఎవరికైనా క్షమాపణ ఉంటుంది. కానీ పవిత్రాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవారికి ఎవరికైనా క్షమాపణ ఉండదు. ఈ యుగంలో ఉండదు, రాబోయే యుగంలోనూ ఉండదు.
33  “చెట్టు ఎలాంటిదో దాని ఫలాన్నిబట్టి తెలుస్తుంది. చెట్టు మంచిది అనుకోండి. దాని ఫలాలు మంచివే. చెట్టు పనికిమాలినది అనుకోండి. దాని ఫలాలు పనికిమాలినవే. 34 ఓ సర్ప వంశమా! మీరు చెడ్డవారు, మంచి ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్నదాన్నే నోరు మాట్లాడుతుంది. 35 మంచి మనిషి తన హృదయంలో సమకూడి ఉన్న మంచివాటిలోనుంచి మంచివే బయటికి తెస్తాడు. చెడు మనిషి తనలో సమకూడి ఉన్న చెడువాటిలో నుంచి చెడ్డవే బయటికి తెస్తాడు. 36 మనుషులు అజాగ్రత్తగా మాట్లాడే ప్రతి మాటకూ తీర్పు రోజున లెక్క అప్పగించాలని మీతో చెపుతున్నాను. 37 మీ మాటలనుబట్టి మీరు నిర్దోషులని లెక్కలోకి వస్తారు, లేదా మీ మాటలనుబట్టి మీకు శిక్షావిధి కలుగుతుంది.”
38  అప్పుడు పరిసయ్యులలో, ధర్మశాస్త్ర పండితులలో కొందరు ఆయనకు జవాబిస్తూ ఇలా అన్నారు: “ఉపదేశకా, మీరు సూచనకోసం అద్భుతం ఒకదానిని చూపాలని మా కోరిక.”
39 వారికి ఆయన చెప్పిన జవాబు ఇది: “సూచన కోసం అద్భుతం చూడాలనే తరం చెడ్డది, వ్యభిచార సంబంధమైనది. యోనాప్రవక్తను గురించిన సూచన తప్ప ఇంకా ఏ సూచనా ఈ తరంవారికి చూపడం జరగదు. 40 యోనా మూడు రాత్రింబగళ్ళు బ్రహ్మాండమైన చేప కడుపులో ఎలాగున్నాడో అలాగే మానవ పుత్రుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు. 41 నీనెవె నగరవాసులు తీర్పు రోజున ఈ తరంవారితో నిలిచి వీరిమీద నేరం మోపుతారు. ఎందుకంటే యోనా ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు వారు విని పశ్చాత్తాపపడ్డారు. అయితే యోనాకంటే ఘనుడు ఇక్కడే ఉన్నాడు. 42  దక్షిణ దేశం రాణి కూడా తీర్పు రోజున ఈ తరంవారితో నిలిచి వీరిమీద నేరం మోపుతుంది. ఎందుకంటే, ఆమె సొలొమోను జ్ఞానవాక్కులు విందామని భూమి కొనలనుంచి వచ్చింది. అయితే సొలొమోనుకంటే ఘనుడు ఇక్కడ ఉన్నాడు.
43 “మలిన పిశాచం మనిషిలోనుంచి బయటికి వచ్చినప్పుడు నీళ్ళులేని ప్రాంతాలలో తిరుగుతూ విశ్రాంతికోసం వెదకుతూ ఉంటుంది, గాని విశ్రాంతి దొరకదు. 44 అప్పుడది ‘నేను విడిచివచ్చిన నా ఇంటికి మళ్ళీ పోతాను’ అంటుంది. అది వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడమూ అది శుభ్రంగా ఊడ్చి సర్దిపెట్టి ఉండడమూ చూస్తుంది. 45 అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డ పిశాచాలను ఏడింటిని వెంటబెట్టుకొని వస్తుంది. అవి ఆ ఇంట్లో దూరి అక్కడే నివాసం చేస్తాయి. అందుచేత ఆ మనిషి చివరి స్థితి మొదటికంటే అధ్వాన్నం అవుతుంది. దుర్మార్గులైన ఈ తరానికి అలాగే జరుగుతుంది.”
46 ఆయన జన సమూహంతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఆయన తల్లీ తమ్ముళ్ళూ వచ్చి ఆయనతో మాట్లాడాలని బయట నిలుచున్నారు. 47 “మీ తల్లీ మీ తమ్ముళ్ళూ మీతో మాట్లాడాలని బయట నిలుచున్నారు” అని ఎవరో ఆయనతో అన్నారు.
48 తనతో ఆ మాట చెప్పిన వ్యక్తికి ఆయనిలా జవాబిచ్చాడు: “ఎవరు నా తల్లి? ఎవరు నా తమ్ముళ్ళు?” 49 అప్పుడు తన శిష్యులవైపు చేయి చాపి, “ఇరుగో, నా తల్లి, నా తమ్ముళ్ళు! 50 పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్టప్రకారం ప్రవర్తించేవారే నా తమ్ముడూ, నా చెల్లెలూ, నా తల్లీ” అన్నాడు.