11
1 యేసు తన పన్నెండుమంది శిష్యులకు ఆదేశాలు ఇవ్వడం ముగించిన తరువాత, వారి ఊళ్ళలో ఉపదేశించడానికి, ప్రకటించడానికి అక్కడనుంచి వెళ్ళాడు.
2 క్రీస్తు చేస్తున్న క్రియలను గురించి ఖైదులో ఉన్న యోహాను విన్నాడు. అప్పుడు అతడు తన శిష్యులను ఇద్దరిని పంపి వారిచేత ఆయనను ఈ ప్రశ్న అడిగించాడు: 3 “రావలసినవాడవు నీవేనా, లేక మేము వేరొకరి కోసం ఎదురు చూడాలా?”
4 యేసు వారికిలా సమాధానం చెప్పాడు: “వెళ్ళి, మీరు చూచిందీ విన్నదీ యోహానుకు తెలియజేయండి. 5 గుడ్డివారికి చూపు వస్తూ ఉంది, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధమౌతూ ఉన్నారు, చెవిటివారు వింటూ ఉన్నారు. చనిపోయినవారిని సజీవంగా లేపడం జరుగుతూ ఉంది. బీదలకు శుభవార్త ప్రకటన జరుగుతూ ఉంది. 6  నా విషయంలో అభ్యంతరం లేనివాడు ధన్యజీవి.”
7 వారు వెళ్ళిపోతూ ఉంటే, యేసు యోహాను విషయం జన సమూహాలతో ఇలా చెప్పసాగాడు: “ఏమి చూద్దామని మీరు అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగే రెల్లునా? 8 మరి ఏమి చూద్దామని వెళ్ళారు? సన్నని వస్త్రాలు తొడుక్కొన్న మనిషినా? ఇదిగో సన్నని వస్త్రాలు తొడుక్కొన్నవారు రాజభవనాలలో ఉంటారు గదా! 9 ఇంతకూ మీరేమి చూడడానికి వెళ్ళినట్టు? ప్రవక్తనా? అవును, అతడు ప్రవక్తే! ప్రవక్తకంటే కూడా గొప్పవాడని మీతో చెపుతున్నాను. 10 ఇతణ్ణి గురించే ఈ మాటలు వ్రాసి ఉన్నాయి: ‘ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందర నీ దారి సిద్ధం చేస్తాడు’.
11 “నేను ఖచ్చితంగా చెపుతున్నాను, స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు ఇంతవరకు బయలుదేరలేదు. అయినా, పరలోక రాజ్యంలో అందరిలో అల్పుడు అతనికంటే గొప్పవాడే.
12 “బాప్తిసమిచ్చే యోహాను రోజులు మొదలుకొని ఇప్పటివరకు పరలోక రాజ్యం తీవ్రతకు గురి అవుతూ ఉంది, తీవ్రత గలవారు దానిని ఆక్రమిస్తూ ఉన్నారు.
13 “యోహాను వచ్చేవరకు ధర్మశాస్త్రమూ ప్రవక్తలందరూ దేవుని మూలంగా పలుకుతూ ఉండడమూ జరిగింది. 14 అంగీకరించాలనే ఇష్టం మీకు ఉంటే, రావలసిన ఏలీయా ఈ యోహానే. 15 వినడానికి చెవులున్నవారు వింటారు గాక!
16 “నేను ఈ తరంవారిని దేనితో పోల్చాలి? చిన్న పిల్లలు సంతవీధిలో కూర్చుని కేకలు వేసి వారి సహచరులతో ఇలా చెప్పుకొంటారు: 17 ‘మీకు పిల్లనగ్రోవి ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు. ఏడ్పు పాట పాడాం గాని మీరు ఏడ్వలేదు’. ఈ తరంవారు అంతే. 18 ఎందుకంటే, యోహాను వచ్చి తినకుండా త్రాగకుండా ఉండేవాడు. అతనికి దయ్యం పట్టిందని వారు అంటున్నారు. 19  మానవ పుత్రుడు వచ్చి అన్నపానాలూ పుచ్చుకొంటూ ఉంటే వారు ‘ఇడుగో, తిండిబోతూ, త్రాగుబోతూ, సుంకం వాళ్ళకూ పాపాత్ములకూ మిత్రుడూ!’ అంటున్నారు. అయితే జ్ఞానం దాని పిల్లలను బట్టే జ్ఞానమని లెక్కలోకి వస్తుంది.”
20 అప్పుడాయన ఏ పట్టణాలలో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను ఖండించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవి పశ్చాత్తాపపడలేదు. 21 “అయ్యో కొరజీనూ! నీకు శిక్ష తప్పదు! అయ్యో బేత్‌సయిదా! నీకు శిక్ష తప్పదు! మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోనులో గనుక జరిగి ఉంటే, అక్కడి ప్రజలు చాలా కాలం క్రిందట పశ్చాత్తాపపడి గోనెపట్టలు చుట్టుకొని నెత్తిన బూడిద పోసుకొనేవారే! 22 అయితే మీతో నేనంటాను, తీర్పు రోజున మీకు పట్టే గతికంటే తూరు సీదోనుల గతే ఓర్చుకోతగినది అవుతుంది! 23 కపెర్‌నహూం! ఆకాశానికి హెచ్చిపోయినదానివి, నీవు పాతాళంలోకి దిగిపోతావు! నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో గనుక జరిగి ఉంటే అది ఈనాటి వరకు నిలిచి ఉండేదే! 24 అయితే నీతో నేనంటాను, తీర్పు రోజున నీకు పట్టే గతికంటే సొదొమ ప్రదేశానికి పట్టే గతే ఓర్చుకోతగినది అవుతుంది!”
25 ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు: “తండ్రీ! భూమ్యాకాశాల ప్రభూ! నీవు ఈ సంగతులు జ్ఞానులకూ తెలివైనవారికీ చూపకుండా దాచిపెట్టి, చిన్నపిల్లలకు వెల్లడి చేశావు. 26 అవును, తండ్రీ, అలా చేయడం నీ దృష్టిలో మంచిదై ఉంది. అందుచేత నిన్ను స్తుతిస్తున్నాను.
27  “నా తండ్రి సమస్తమూ నాకు అప్పచెప్పాడు. తండ్రి తప్ప మరెవరూ కుమారుణ్ణి తెలుసుకోవడం లేదు. కుమారుడూ, తన ఇష్టప్రకారం తండ్రిని ఎవరికి వెల్లడి చేస్తాడో వారూ తప్ప మరెవరూ తండ్రిని తెలుసుకోవడం లేదు.
28 “భారం మోస్తూ అలసిపోయిన వారలారా! మీరంతా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతి ఇస్తాను. 29 నా కాడి మీమీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. నేను సాధుశీలుణ్ణి, అహంభావం లేనివాణ్ణి, గనుక మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. 30  ఎందుకంటే, నా కాడి మృదువైనది, నా భారం తేలికైనది.”