10
1 ఆ తరువాత ఆయన తన పన్నెండుమంది శిష్యులను✽ దగ్గరకు పిలుచుకొని మలిన పిశాచాలను వెళ్ళగొట్టడానికీ, అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగు చేయడానికీ వారికి అధికారం ఇచ్చాడు.2 ✽ఆ పన్నెండుమంది రాయబారుల పేర్లు ఇవి: మొదట, సీమోను (ఇతణ్ణి “పేతురు” అంటారు), అతని సోదరుడు అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను, 3 ఫిలిప్పు, బర్తొలోమయి✽, తోమా, సుంకంవాడైన మత్తయి✽, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి✽ అనే ఇంటి పేరున్న లెబ్బయి, 4 కనానీయుడైన సీమోను✽, యేసును శత్రువులకు పట్టి ఇచ్చిన ఇస్కరియోతు యూదా✽.
5 ✽ఈ పన్నెండుమందిని పంపుతూ యేసు ఈ విధంగా వారికి ఆదేశించాడు: “ఇతర జనాల దారిలోకి వెళ్ళకండి. సమరయ దేశస్తుల పట్టణాలలో దేనిలోకీ వెళ్ళకండి. 6 ✝ఇస్రాయేల్ వంశంలో నశించిపోతున్న గొర్రెల దగ్గరికే వెళ్ళండి. 7 ✝వెళుతూ, పరలోక రాజ్యం సమీపమైందని ప్రకటించండి.
8 ✽“రోగులను బాగు చేయండి. చనిపోయినవారిని సజీవంగా లేపండి. కుష్ఠురోగులను శుద్ధంగా చేయండి. దయ్యాలను వెళ్ళగొట్టండి. మీరు పొందినది ఉచితంగా పొందారు. ఉచితంగానే ఇవ్వండి. 9 ✽జేబుల్లో బంగారం గానీ వెండి గానీ రాగి గానీ పెట్టుకువెళ్ళకండి. 10 ప్రయాణంకోసం సంచి గానీ రెండో చొక్కా గానీ చెప్పులు గానీ చేతికర్రలు గానీ తీసుకుపోకండి. పని చేసేవాడు ఆహారానికి తగినవాడు.
11 ✽“మీరు ఏ పట్టణంలో, ఏ గ్రామంలో ప్రవేశించినా దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి. అక్కడనుంచి వెళ్ళేవరకు వారి ఇంట్లోనే బస చేయండి. 12 ✽ఒక ఇంట్లో అడుగు పెట్టగానే ఇంటివారికి శుభమని చెప్పండి. 13 ఆ ఇంటిలో యోగ్యత ఉంటే మీ శాంతి దానిమీదికి రానివ్వండి. దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకే తిరిగి రానివ్వండి. 14 ✽మిమ్ములను ఎవరైనా స్వీకరించకపోతే, మీ మాటలు పెడచెవిని పెడితే, ఆ ఇల్లు, ఆ గ్రామం విడిచివెళ్ళేటప్పుడు మీ కాళ్ళ దుమ్ము దులిపివేయండి. 15 నేను ఖచ్చితంగా చెపుతున్నాను, తీర్పు జరిగే రోజున✽ ఆ గ్రామానికి పట్టే గతికంటే సొదొమ, గొమొర్రా✽ పట్టణాలకు పట్టే గతే ఓర్చుకోతగినది అవుతుంది!
16 “ఇదిగో వినండి. తోడేళ్ళ✽ మధ్యలోకి గొర్రెలను పంపినట్టు నేను మిమ్ములను పంపుతూ ఉన్నాను. కనుక పాముల్లాగా తెలివిగా, పావురాల్లాగా హాని చేయనివారుగా ఉండండి. 17 ✽మనుషుల విషయం జాగ్రత్త! వారు మిమ్ములను న్యాయసభలకు అప్పగిస్తారు. తమ సమాజ కేంద్రాలలో కొరడాలతో కొడతారు. 18 నా కారణంగా మిమ్ములను రాష్ట్రాధిపతుల దగ్గరకూ రాజుల దగ్గరకూ తీసుకుపోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మీరు వారి ఎదుట, ఇతర జనాల ఎదుట సాక్ష్యంగా ఉంటారు. 19 ✽వారు మిమ్ములను అలా వారికి అప్పగించేటప్పుడు మీరు ఏమి చెప్పాలో, ఎలా మాట్లాడాలో అని బెంబేలు పడకండి. ఆ సమయంలో మీరు చెప్పవలసినది మీకు అందించబడుతుంది. 20 ✽ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు గానీ మీ పరమ తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతాడు.
21 ✽“సోదరుడు తన సొంత సోదరుణ్ణి, తండ్రి తన సొంత కొడుకును మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రులమీద తిరుగబడి వారిని చంపిస్తారు. 22 నా పేరు కారణంగా మీరు అందరి ద్వేషానికి గురి అవుతారు. అయితే అంతంవరకు సహించేవారికి విముక్తి లభిస్తుంది. 23 ✽మిమ్ములను ఈ గ్రామంలో హింసిస్తే మరో గ్రామానికి పారిపోండి. నేను ఖచ్చితంగా చెపుతున్నాను, మానవపుత్రుడు వచ్చేలోగా మీరు ఇస్రాయేల్ గ్రామాలన్నిటికీ వెళ్ళి ఉండరు.
24 ✽“గురువుకంటే శిష్యుడు, తన యజమానికంటే దాసుడు గొప్పవాడేమీ కాదు. 25 శిష్యుడు తన గురువులాగా, దాసుడు తన యజమానిలాగా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయల్‌జెబూల్ అంటే, ఆయన ఇంటివారిని వారు అలా అనడం మరీ నిశ్చయం గదా.
26 ✽“కనుక వారికి భయపడకండి. కప్పిపెట్టినది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచినది ఏదీ తెలిసిపోకుండా ఉండదు. 27 మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవులకు వినిపించేది ఇంటికప్పుల మీదనుంచి చాటించండి. 28 ✽ ఆత్మను చంపలేక శరీరాన్ని చంపేవారికి భయపడకండి. శరీరాన్నీ ఆత్మనూ కూడా నరకంలో నాశనం చేయగలవానికి, ఆయనకే భయపడండి.
29 ✽“రెండు పిచ్చుకలు పది పైసలకు అమ్ముడు పోతాయి గదా. అయినా వాటిలో ఒక్కటి కూడా మీ పరమ తండ్రి అనుమతి లేకుండా నేల కూలదు. 30 మీ తల వెంట్రుకలు ఎన్నో లెక్క ఉంది. 31 అందుచేత నిర్భయంగా ఉండండి. అనేక పిచ్చుకలకంటే మీ విలువ ఎక్కువ.
32 ✽“నన్ను ఎరుగుదుమని మనుషుల ఎదుట ఒప్పుకొనేవారిని పరలోకంలో ఉన్న నా తండ్రి ఎదుట ఎరుగుదునని నేనూ ఒప్పుకొంటాను. 33 కానీ మనుషుల ఎదుట నన్ను ఎరగననే వారిని పరలోకంలో ఉన్న నా తండ్రి ఎదుట నేనూ ఎరగనంటాను.
34 ✽“భూలోకంమీదికి శాంతిని తేవడానికి నేను వచ్చాననుకోకండి. ఖడ్గం తేవడానికి వచ్చాను గాని శాంతిని కాదు. 35 ✽అంటే, ఒక మనిషి తన తండ్రికి వ్యతిరేకంగా, ఒక కూతురు తన తల్లికి వ్యతిరేకంగా, కోడలు తన అత్తకు వ్యతిరేకంగా అయ్యేలా చేయుదును. 36 ఒక మనిషి సొంత ఇంటివారే తన శత్రువులుగా తయారవుతారు.
37 ✽ “నామీది ప్రేమకంటే తండ్రిమీద గానీ తల్లిమీద గానీ ఎక్కువ ప్రేమగలవాడు నాకు తగినవాడు కాడు. నామీది ప్రేమకంటే కొడుకుమీద గానీ కూతురుమీద గానీ ఎక్కువ ప్రేమగలవాడు నాకు తగినవాడు కాడు. 38 ✽ తన సిలువను ఎత్తుకొని నావెంట రానివాడు నాకు తగినవాడు కాడు.
39 ✽“తన కోసం జీవాన్ని దక్కించుకొనేవాడు దానిని పోగొట్టుకొంటాడు. నాకోసం తన జీవాన్ని పోగొట్టుకొనేవాడు దానిని దక్కించుకొంటాడు.
40 ✽“మిమ్ములను స్వీకరించేవాడు నన్ను స్వీకరిస్తూ ఉన్నాడు. నన్ను స్వీకరించేవాడు నన్ను పంపేవాణ్ణే స్వీకరిస్తున్నాడు. 41 ప్రవక్త అని ప్రవక్తను స్వీకరించేవానికి ప్రవక్తకు తగిన బహుమానం లభిస్తుంది. న్యాయవంతుడని న్యాయవంతుణ్ణి స్వీకరించేవానికి న్యాయవంతులకు తగిన బహుమానం లభిస్తుంది. 42 ఈ చిన్నవారిలో ఒకరికి శిష్యుడని ఒక గిన్నెడు చన్నీళ్ళయినా ఇచ్చేవానికి తన బహుమానం దొరకకుండా పోదని నేను ఖచ్చితంగా చెపుతున్నాను.”