9
1 ✽యేసు పడవ ఎక్కి సరస్సు దాటి తన సొంత పట్టణం చేరుకొన్నాడు. 2 ✽అప్పుడు కొందరు ఒక పక్షవాతరోగిని పడకమీదే ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. యేసు వారి విశ్వాసం చూచి పక్షవాత రోగితో “కుమారా, ధైర్యం తెచ్చుకో! నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.3 ✽వెంటనే ధర్మశాస్త్ర పండితులు కొందరు “ఇతడు దేవదూషణ చేస్తున్నాడు” అని తమలో తాము చెప్పుకొన్నారు.
4 ✽వారి తలంపులు తెలుసుకొని యేసు ఇలా అన్నాడు: “హృదయంలో మీకెందుకు ఈ దురాలోచనలు? 5 ✽ఏది సులభమంటారు – ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? ‘లేచి నడువు’ అనడమా? 6 అయితే మానవ పుత్రునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి.” అలా చెప్పి ఆయన పక్షవాతరోగితో “లేచి, నీ పడక ఎత్తుకొని ఇంటికి వెళ్ళు” అన్నాడు.
7 అతడు లేచి ఇంటికి వెళ్ళాడు. 8 ✽ఇది చూచి జన సమూహాలకు ఆశ్చర్యం కలిగింది. ఇంత అధికారం మనుషులకు ఇచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు.
9 ✽ యేసు అక్కడనుంచి వెళ్తూ, సుంకం వసూళ్ళ స్థానంలో కూర్చుని ఉన్న ఒక మనిషిని చూశాడు. అతని పేరు మత్తయి. ఆయన అతనితో “నా వెంట రా” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు.
10 యేసు ఇంట్లో భోజనానికి బల్ల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు సుంకంవారు, పాపులు అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చున్నారు. 11 అది చూచి పరిసయ్యులు✽ ఆయన శిష్యులతో “మీ గురువు సుంకంవారితోనూ పాపులతోనూ కలిసి తింటున్నాడేమిటి?” అన్నారు.
12 ✽అది విని యేసు వారితో ఇలా అన్నాడు: “జబ్బు చేసినవారికే వైద్యుడు అవసరం గాని బాగున్నవారికి కాదు. 13 ✽నేను పాపులనే పశ్చాత్తాపపడాలని పిలవడానికి వచ్చాను గాని న్యాయవంతులను కాదు. కనుక మీరు వెళ్ళి ‘మీరు కరుణ చూపడమే నాకిష్టం గాని బలియాగాలు అర్పించడం కాదు’ అనే వాక్కు భావం నేర్చుకోండి.”
14 బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు✽ యేసుదగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “పరిసయ్యులూ, మేమూ తరచుగా ఉపవాసం ఉంటాం గాని మీ శిష్యులు ఉపవాసం ఉండరెందుకని?”
15 ✽యేసు వారికిలా జవాబిచ్చాడు: “పెళ్ళికొడుకు తమతో ఉన్నంతకాలం అతని మిత్రులకు దుఃఖం ఎలా ఉండగలదు? అయితే పెళ్ళికొడుకును వారి దగ్గరనుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి. అప్పుడు వారు ఉపవాసం ఉంటారు. 16 ✽పాత వస్త్రానికి కొత్త బట్ట ఎవరూ మాసిక వేయరు. వేస్తే ఆ మాసిక వస్త్రం నుంచి చించుకొంటుంది, చినుగు పెద్దదవుతుంది. 17 అలానే వారు కొత్త ద్రాక్షరసం పాత తిత్తులలో పోయరు. పోస్తే ఆ తిత్తులు చినిగిపోతాయి, ద్రాక్షరసం కారిపోతుంది, తిత్తులు పాడవుతాయి. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులలో పోస్తారు. అప్పుడు రెంటిలో ఏదీ చెడిపోకుండా ఉంటుంది.”
18 ✽ఆయన ఈ సంగతులు వారితో చెపుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి “నా కూతురు ఇప్పుడే చనిపోయింది. అయినా, మీరు వచ్చి ఆమెమీద మీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది” అన్నాడు.
19 యేసు లేచి అతడివెంట వెళ్ళసాగాడు. శిష్యులు కూడా వచ్చారు. 20 ✽అప్పుడే, పన్నెండేళ్ళనుంచి రుతుస్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం అంచును తాకింది. 21 ఎందుకంటే, “ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు పూర్తిగా నయం అవుతుంది” అని ఆమె అనుకొంది.
22 ✽యేసు వెనక్కు తిరిగి ఆమెను చూచి “కుమారీ, ధైర్యం తెచ్చుకో! నీ నమ్మకం నిన్ను బాగు చేసింది” అన్నాడు. ఆ గడియనుంచి ఆమెకు ఆరోగ్యం చేకూరింది.
23 ✽యేసు ఆ అధికారి ఇంట్లోకి వెళ్ళినతరువాత అక్కడ పిల్లనగ్రోవులు వాయించేవారినీ గోల చేస్తూ ఉన్న గుంపునూ చూచి వారితో ఇలా అన్నాడు: 24 “వెళ్ళిపోండి! అమ్మాయి చనిపోలేదు. నిద్రపోతూ ఉంది✽.” వాళ్ళు నవ్వి ఆయనను వేళాకోళం చేశారు. 25 ✽గుంపును బయటికి పంపివేసిన తరువాత ఆయన లోపలికి వెళ్ళి ఆ పిల్ల చేయి తన చేతిలోకి తీసుకొన్నాడు. ఆమె లేచి నిలబడింది. 26 దీన్ని గురించిన కబురు ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
27 అక్కడనుంచి యేసు వెళ్తూ ఉన్నప్పుడు గుడ్డివారు ఇద్దరు ఆయనను అనుసరిస్తూ “దావీదు కుమారా✽! మామీద దయ చూపు” అంటూ కేకలు వేశారు.
28 ✽ఆయన ఇంట్లో ప్రవేశించాక ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. వారితో యేసు అన్నాడు, “నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా?” “అవును, స్వామీ!” అని వారు ఆయనతో అన్నారు.
29 ✽అప్పుడు ఆయన వారి కండ్లను ముట్టి, “మీ నమ్మకం ప్రకారం మీకు జరుగుతుంది గాక!” అన్నాడు. 30 ✽వెంటనే వారి కండ్లు తెరచుకొన్నాయి. “ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండేం!” అని యేసు వారిని గట్టిగా హెచ్చరించాడు. 31 ✽కానీ వారు బయటికి వెళ్ళి, ఆయన విషయం ఆ ప్రాంతం అంతటా చాటించారు.
32 ✽వారు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు దయ్యం పట్టిన మూగవాణ్ణి కొందరు ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. 33 ఆయన ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాక మూగవాడు మాట్లాడాడు. జన సమూహాలకు ఎంతో ఆశ్చర్యం వేసింది. “ఇస్రాయేల్‌లో ఇలాంటిది ఎన్నడూ కనిపించలేదు✽” అని వారు చెప్పుకొన్నారు.
34 ✽అయితే పరిసయ్యులు “దయ్యాల నాయకుడి సహాయంతో ఇతడు దయ్యాల్ని వెళ్ళగొడతున్నాడు” అన్నారు.
35 ✽యేసు అన్ని పట్టణాలకూ గ్రామాలకూ వెళ్తూ, వారి సమాజ కేంద్రాలలో ఉపదేశిస్తూ రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రజలలో అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగు చేస్తూ ఉన్నాడు. 36 ✽జన సమూహాలను చూచినప్పుడు ఆయన వారి మీద జాలిపడ్డాడు. ఎందుకంటే, వారు కాపరి లేని గొర్రెలలాగా అలసిపోయి చెదరిపోయి ఉన్నారు. 37 ✽ అప్పుడు ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “నిజంగా కోత చాలా ఎక్కువ, పనివారే తక్కువ, 38 ✽గనుక కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకోండి.”