8
1 ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు పెద్ద గుంపులుగా ఆయనను అనుసరించారు.
2 వెంటనే కుష్ఠురోగి ఒకడు వచ్చి ఆయనకు మ్రొక్కి, “ప్రభూ! మీకిష్టం ఉంటే నన్ను శుద్ధం చేయగలరు” అన్నాడు. 3 యేసు చేయి చాచి అతణ్ణి తాకి, “నాకిష్టమే. శుద్ధుడవు కమ్ము!” అన్నాడు. తక్షణమే అతని కుష్ఠు శుద్ధమైంది. 4 అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు, “చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పకు. అయితే వెళ్ళి యాజికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే విధించిన కానుక అర్పించు.”
5 యేసు కపెర్‌నహూంలో ప్రవేశించినప్పుడు రోమ్ సైన్యంలో ఒక శతాధిపతి ఆయనదగ్గరకు వచ్చాడు, 6 “ప్రభూ, నా దాసుడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. తీవ్రంగా బాధపడుతున్నాడు” అంటూ ఆయనను బతిమాలుకొన్నాడు.
7 “నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను” అని యేసు అతనితో అన్నాడు.
8 అయితే ఆ శతాధిపతి ఇలా జవాబిచ్చాడు: “ప్రభూ, మీరు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మీరు మాట మాత్రం అనండి, అప్పుడు నా దాసుడికి జబ్బు పూర్తిగా నయం అవుతుంది. 9 నేను కూడా అధికారం క్రింద ఉన్నవాణ్ణి. నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు. నేను ఎవణ్ణయినా ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు. మరొకణ్ణి ‘రా’ అంటే వస్తాడు. నా దాసుణ్ణి ‘ఇది చేయి’ అంటే చేస్తాడు.”
10 ఈ మాటలు విని యేసు ఆశ్చర్యపడ్డాడు, తన వెంట వస్తున్నవారితో ఇలా అన్నాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఇస్రాయేల్ ప్రజలలో కూడా ఎవరికైనా ఇంత గొప్ప నమ్మకం ఉన్నట్టు నేను చూడలేదు. 11 తూర్పునుంచీ పడమరనుంచీ చాలామంది వచ్చి పరలోక రాజ్యంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతోపాటు విందులో కూర్చుంటారని నేను మీతో చెపుతున్నాను. 12 కానీ ఆ రాజ్య సంబంధులను బయట చీకట్లో పారవేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి.” 13 అప్పుడు శతాధిపతితో యేసు అన్నాడు, “వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది.” అదే వేళకు అతని దాసునికి పూర్తిగా నయం అయింది.
14 తరువాత యేసు పేతురు ఇంట్లోకి వెళ్ళి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండడం చూశాడు. 15 ఆయన ఆమె చెయ్యి ముట్టగానే జ్వరం పోయింది. ఆమె లేచి వారికి పరిచర్య చేయసాగింది.
16 సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టినవారిని అనేకమందిని ప్రజలు ఆయనదగ్గరికి తీసుకువచ్చారు. ఆయన ఒక్క మాటతో ఆ దురాత్మలను వెళ్ళగొట్టాడు. రోగులందరినీ కూడా బాగు చేశాడు. 17  యెషయాప్రవక్త ద్వారా దేవుడు చెప్పినది నెరవేరేలా ఆ విధంగా జరిగింది. ఏమిటంటే, ఆయన మన బలహీనతలను తన మీదికి తీసుకున్నాడు; మన రోగాలను భరించాడు.
18 తన చుట్టూరా ఉన్న పెద్ద జన సమూహాలను చూచి యేసు గలలీ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించాడు. 19 అప్పుడు ధర్మశాస్త్ర పండితుడొకడు వచ్చి ఆయనతో ఇలా అన్నాడు: “గురువర్యా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీ వెంటే వస్తాను.” 20 అందుకు యేసు అతనితో “నక్కలకు గుంటలున్నాయి. గాలిలో ఎగిరే పక్షులకు గూళ్ళు ఉన్నాయి. కానీ మానవ పుత్రునికి తల వాల్చుకొనే స్థలం కూడా లేదు” అన్నాడు.
21 ఆయన శిష్యులలో మరొకడు “స్వామీ, మొట్టమొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టేంత వరకూ సెలవియ్యండి” అన్నాడు. 22 యేసు అతనితో, “నా వెంట రా! చనిపోయినవారే చనిపోయిన తమవారిని పాతిపెట్టనియ్యి” అన్నాడు.
23 అప్పుడు ఆయన పడవ ఎక్కాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళారు. 24 అకస్మాత్తుగా సరస్సుమీద పెద్ద తుఫాను చెలరేగసాగింది. అలలు ఆ పడవమీదికి ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. 25 శిష్యులు దగ్గరగా వెళ్ళి ఆయనను మేల్కొలిపి “స్వామీ! నశించిపోతున్నాం! మమ్మల్ని రక్షించు!” అన్నారు.
26 అందుకు ఆయన “అల్ప విశ్వాసం గలవారలారా, మీరెందుకు భయపడుతున్నారు?” అన్నాడు. అప్పుడాయన లేచి, గాలులను సరస్సునూ మందలించాడు. అంతా ప్రశాంతమైపోయింది.
27 ఆ మనుషులకు ఎంతో ఆశ్చర్యం వేసింది. “ఈయన ఎలాంటివాడో గాని గాలులు, సరస్సు కూడా ఈయనకు లోబడు తున్నాయే!” అని చెప్పుకొన్నారు.
28 ఆయన అవతలి ఒడ్డున ఉన్న గెర్గెసెనువారి ప్రదేశం చేరుకొన్నప్పుడు దయ్యాలు పట్టిన పురుషులు ఇద్దరు సమాధులలో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మహా భయంకరులు కావడంచేత ఆ దారిన ఎవరూ వెళ్ళలేకపోయేవారు. 29 వెంటనే వారు “యేసు! దేవుని కుమారుడా! మా జోలి నీకెందుకు? కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని అరిచారు.
30 వారికి కొంత దూరంలో ఒక పెద్ద పందుల మంద మేస్తూ ఉంది. 31 అప్పుడా దయ్యాలు “ఒకవేళ నీవు మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే ఆ పందుల మందలోకి వెళ్లనియ్యి!” అని యేసును ప్రాధేయపడ్డాయి.
32 ఆయన “పోండి!” అని వాటితో అన్నాడు. అప్పుడు అవి ఆ మనుషులలోనుంచి బయటికి వచ్చి ఆ పందులమందలో దూరాయి. వెంటనే ఆ పందులమందంతా నిటారుగా ఉన్న కొండమీదనుంచి వేగంగా పరుగెత్తుతూ సరస్సులో పడి నీళ్ళలో చచ్చాయి. 33 వాటి కాపరులు పారిపోయి గ్రామంలోకి వెళ్ళి జరిగినదంతా, దయ్యాలు పట్టినవారి సంగతి కూడా తెలియజేశారు. 34 అప్పుడు ఆ గ్రామమంతా యేసును ఎదుర్కోవడానికి వచ్చారు. ఆయనను చూచి తమ ప్రాంతాన్ని విడిచివెళ్ళాలని వేడుకొన్నారు.