7
1 “మీకు తీర్పు జరగకుండేలా ఇతరులకు తీర్పు తీర్చకండి✽. 2 మీరు ఇతరులకు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకూ ఆ కొలతతోనే కొలవడం జరుగుతుంది. 3 ✽నీ కంటిలో దూలం గమనించుకోకుండా నీ సోదరుని కంటిలో నలుసు తేరిచూడడం ఎందుకు? 4 నీ కంటిలో దూలం ఉన్నప్పుడు నీ సోదరునితో ‘మీ కంటినలుసు తీసివెయ్యనియ్యండి’ అంటావేం? 5 కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోనుంచి దూలం తీసివేసుకో, అప్పుడు నీ సోదరుని కంటి నలుసు తీసివేయడానికి తేటగా చూడగలుగుతావు.6 ✽“పవిత్రమైనదాన్ని కుక్కలకు పెట్టకండి. మీ ముత్యాలు పందుల ముందు వేయకండి. అలా చేస్తే అవి వాటిని కాళ్ళక్రింద త్రొక్కి మీమీద పడి మిమ్ములను చీల్చివేస్తాయేమో.
7 ✽“అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి, అది తెరవబడుతుంది. 8 అడిగే ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. వెదికే వ్యక్తికి దొరుకుతుంది. తట్టే వ్యక్తికి తలుపు తెరవబడుతుంది. 9 మీలో ఎవరైనా సరే కొడుకు రొట్టె కావాలని అడిగితే రాయిని ఇస్తారా? 10 చేపకోసం అడిగితే అతనికి పామునిస్తారా? 11 మీరు చెడ్డవారు✽ అయినా మీ పిల్లలకు మంచివాటిని ఇవ్వాలన్న సంగతి తెలుసునే. అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగేవారికి మరి నిశ్చయంగా మంచివి ఇస్తాడు గదా.
12 ✽“కాబట్టి అన్ని విషయాలలో మనుషులు మీకు ఏమి చెయ్యాలని ఆశిస్తారో అదే వారికి చేయండి. ధర్మశాస్త్రమూ, ప్రవక్తల ఉపదేశ సారమూ ఇదే.
13 ✽“ఇరుకు ద్వారంలో ప్రవేశించండి. నాశనానికి దారితీసే ద్వారం వెడల్పు, దారి విశాలం. ఆ ద్వారంలో చాలామంది ప్రవేశిస్తారు. 14 ఎందుకంటే జీవానికి దారితీసే ద్వారం ఇరుకైనది, దారి కష్టమైనది. దాన్ని కనుగొనేవారు కొద్దిమందే.
15 ✽“కపట ప్రవక్తల విషయం జాగ్రత్త! వారు గొర్రె తోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు గానీ లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 16 వారి ఫలాలనుబట్టి మీరు వారిని గుర్తిస్తారు. ముళ్ళ పొదలలో ద్రాక్షపండ్లు, పల్లేరుచెట్లలో అంజూరు పండ్లు మనుషులు కోస్తారా? 17 ఈ విధంగా ప్రతి మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి గదా. పనికిమాలిన చెట్టుకు పనికిమాలిన పండ్లు కాస్తాయి. 18 మంచి చెట్టుకు పనికిమాలిన రకం పండ్లు కాయడం అసాధ్యం. పనికిమాలిన చెట్టుకు మంచి రకం పండ్లు కాయడం అసాధ్యం. 19 మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి అగ్నిలో పారవేయడం జరుగుతుంది. 20 ఈ విధంగా మీరు వారి ఫలాలను బట్టి వారిని గుర్తిస్తారు.
21 “నన్ను ‘ప్రభూ✽, ప్రభూ!’ అనే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్టప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు. 22 ఆ రోజున చాలామంది నాతో ఇలా అంటారు: ‘ప్రభూ, ప్రభూ! మేము నీ పేర ప్రవక్తలుగా ప్రకటించలేదా? నీ పేర దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ పేర అనేక అద్భుతాలు చేయలేదా? 23 అప్పుడు నేను వాళ్ళతో ఇలా అంటాను: ‘అక్రమకారులారా, మీరు ఎన్నడూ నేనెరిగినవారు కారు! నా దగ్గరనుంచి పొండి!’
24 ✽“అందుచేత, ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేసే వారినెవరినైనా బండమీద తన ఇల్లు కట్టుకొన్న తెలివిగల మనిషితో పోలుస్తాను. 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటిమీద కొట్టాయి. అయినా ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకంటే అది బండ పునాదిమీది ఇల్లు. 26 కానీ ఈ నా మాటలు విని వాటిప్రకారం చేయని ప్రతి ఒక్కరూ ఇసుకమీద ఇల్లు కట్టుకొనే తెలివిలేని మనిషిలాగా ఉంటారు. 27 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటిమీద కొట్టాయి. ఆ ఇల్లు కూలిపోయింది. దాని పతనం గొప్పది!”
28 ✽యేసు ఆ మాటలు చెప్పి ముగించిన తరువాత ప్రజలు ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. 29 ఎందుకంటే వారి ధర్మశాస్త్ర పండితుల్లాగా కాక అధికారం గలవాడిలాగా ఆయన వారికి ఉపదేశించాడు.