6
1 “మనుషులు చూడాలని వారి ముందర మీ ఉపకార క్రియలు చేయకండి. అలా చేస్తే పరలోకంలో మీ తండ్రి మీకు ఏ ప్రతిఫలం ఇవ్వడు. 2 కనుక మీరు ఉపకారక్రియలు చేసేటప్పుడు కపట భక్తులలాగా మీ ముందర బూర ఊదించుకోకండి. మనుషులు తమను గౌరవించాలని వారు సమాజ కేంద్రాలలో, వీధులలో అలా చేస్తారు. నేను ఖచ్చితంగా చెపుతున్నాను, వారి ప్రతిఫలం వారికి పూర్తిగా ముట్టింది. 3 మీరు ఉపకారక్రియ చేసేటప్పుడు అది రహస్యంగా ఉంచడానికి మీ కుడిచేతితో చేసేది ఎడమ చేతికి తెలియనియ్యకండి. 4 అప్పుడు రహస్యంగా జరిగేవాటిని చూచే మీ తండ్రి తానే బహిరంగంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు.
5 “అదిగాక, మీరు ప్రార్థన చేసేటప్పుడు కపట భక్తులలాగా ఉండకండి. మనుషులు తమను చూడాలని సమాజ కేంద్రాలలో, వీధుల మూలలలో నిలుచుండి ప్రార్థన చేయడం వారికి చాలా ఇష్టం. వారి ప్రతిఫలం వారికి పూర్తిగా ముట్టిందని నేను ఖచ్చితంగా చెపుతున్నాను. 6 మీరైతే ప్రార్థన చేసేటప్పుడు మీ గదిలోకి వెళ్ళి, తలుపు వేసుకొని, రహస్యమైన స్థలంలో ఉన్న మీ తండ్రికి ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యంలో జరిగేవాటిని చూచే మీ తండ్రి బహిరంగంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు. 7 అంతేగాక, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇతర జనాలలాగా వృథాగా పదే పదే పలకకండి. అవసరమైనవి ఎక్కువ మాటలు పలకడం కారణంగా వారి ప్రార్థన వినబడుతుందని వారి ఆలోచన. 8 మీరు వారిలాగా ఉండకండి. ఎందుకంటే, మీరు ఆయనను అడగకముందే మీకు అవసరమైనవి మీ తండ్రికి తెలుసు.
9  అందుచేత ఈ విధంగా ప్రార్థన చేయాలి: ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు అందరికీ పవిత్రమై ఉంటుంది గాక!
10 నీ రాజ్యం వస్తుంది గాక! నీ సంకల్పం పరలోకంలో లాగే భూమిమీద కూడా నెరవేరుతుంది గాక!
11 మా రోజువారీ ఆహారం ఈ రోజున మాకు ప్రసాదించు.
12  మాకు రుణపడ్డవారిని మేము క్షమించినట్టే నీవు మా రుణాలను క్షమించు.
13 మమ్ములను దుష్‌ప్రేరేపణలోకి నడిపించకు. దుర్మార్గతనుంచి మమ్ములను రక్షించు. శాశ్వతంగా రాజ్యం, బలప్రభావాలు, మహిమ నీకే. తథాస్తు!
14  “మనుషులు మీ విషయంలో చేసిన తప్పిదాలను బట్టి మీరు వారిని క్షమిస్తే మీ పరమ తండ్రి మిమ్ములనూ క్షమిస్తాడు. 15 కానీ మనుషులు చేసిన తప్పిదాలను మీరు క్షమించకపోతే, మీ తప్పిదాలు మీ పరమ తండ్రి క్షమించడు.
16 “మరొకటి – మీరు ఉపవాసం ఉన్నప్పుడు కపట భక్తులలాగా దుఃఖ ముఖం పెట్టుకోకండి. తాము ఉపవాసం ఉన్నట్టు మనుషులకు కనబడాలని వారు వికార ముఖాలతో తయారవుతారు. వారి ప్రతిఫలం వారికి పూర్తిగా ముట్టిందని నేను ఖచ్చితంగా చెపుతున్నాను. 17 మీరు ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసమున్నట్టు మనుషులకు కనబడకుండా, రహస్యమైన స్థలంలో ఉన్న మీ తండ్రి మాత్రమే చూచేలా మీ తలంటి పోసుకొని మీ ముఖం కడుక్కోండి. 18 అప్పుడు రహస్యంగా జరిగేవాటిని చూచే మీ తండ్రి బహిరంగంగా మీకు ప్రతిఫలమిస్తాడు.
19 “భూమిమీద మీ కోసం సంపద కూడబెట్టుకోకండి. ఇక్కడ చిమ్మెటలు, తుప్పు తినివేస్తాయి. దొంగలు కన్నం వేసి దోచుకొంటారు. 20 పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చిమ్మెట గాని, తుప్పు గాని తినివేయవు. దొంగలు కన్నం వేసి దోచుకోరు. 21 మీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయమూ ఉంటుంది.
22 “శరీరానికి దీపం కన్ను. మీ కన్ను మంచిదైతే మీ శరీరంనిండా వెలుగు ఉంటుంది. 23 మీ కన్ను చెడ్డదైతే మీ శరీరంనిండా చీకటే ఉంటుంది. మీలో ఉన్న వెలుగు చీకటై ఉంటే అది ఎంత దట్టమైన చీకటో గదా!
24 “ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకరిని ద్వేషిస్తాడు, రెండో యజమానిని ప్రేమతో చూస్తాడు. లేదా, ఆ మొదటి యజమానికి పూర్తిగా అంకితమై మరొకరిని చిన్న చూపు చూస్తాడు. మీరు దేవునికీ సిరికీ సేవ చేయలేరు.
25 “అందుచేత నేను మీతో చెప్పేదేమిటంటే, ‘ఏమి తింటాం? ఏమి తాగుతాం?’ అంటూ మీ బ్రతుకును గురించి బెంగ పెట్టుకోకండి. ‘మాకు బట్టలు ఎట్లా?’ అనుకొంటూ మీ శరీరాన్ని గురించి బెంగ పెట్టుకోకండి. తిండికంటే జీవితం ప్రధానం గదా! బట్టలకంటే శరీరం ముఖ్యం గదా! 26 గాలిలో ఎగిరే పక్షులను చూడండి. అవి నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూడబెట్టుకోవు. అయినా, మీ పరమ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైనవారు గదా! 27 చింతపడడం వల్ల మీలో ఎవరు తమ ఎత్తును మూరెడు పొడిగించుకోగలరు?
28 “మీకు బట్టల విషయం చింత ఎందుకు? పొలంలో పూల మొక్కలు ఎలా పెరుగుతూ ఉన్నాయో ఆలోచించండి. అవి శ్రమపడవు, బట్టలు నేయవు. 29 అయినా, తన వైభవమంతటితో ఉన్న సొలొమోనుకు కూడా ఈ పూలలో ఒక్కదానికున్నంత అలంకారం లేదని మీతో చెపుతున్నాను. 30 అల్ప విశ్వాసం ఉన్నవారలారా, ఈ వేళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే పొలం గడ్డినే దేవుడు ఇంతగా అలంకరిస్తే, మరి నిశ్చయంగా మీకు వస్త్రాలు ఇస్తాడు గదా. 31 కనుక ‘ఏం తింటామో? ఏం త్రాగుతామో? ఏం బట్టలు వేసుకొంటామో?’ అంటూ చింతించకండి. 32 దేవుణ్ణి ఎరుగని ఇతర ప్రజలు వీటికోసం తాపత్రయపడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరమ తండ్రికి తెలుసు. 33 మీరు మొట్టమొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిన్యాయాలను వెదకండి. అప్పుడు వాటితోపాటు ఇవన్నీ మీకు చేకూరుతాయి. 34  అందుచేత రేపటి విషయం చింతించకండి. దాని విషయం అదే చింతిస్తుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.