5
1 ✽ఆ జన సమూహాలను చూచినప్పుడు ఆయన కొండమీదికి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. 2 ఆయన నోరార వారికి✽ ఇలా ఉపదేశించసాగాడు:3 “తమ ఆధ్యాత్మిక దరిద్య్రాన్ని గుర్తించినవారు ధన్యులు✽. పరలోక రాజ్యం వారిది.
4 దుఃఖించేవారు ధన్యులు✽. వారికి ఓదార్పు కలుగుతుంది.
5 ✽సాధుగుణం గలవారు ధన్యులు. భూలోకానికి వారు వారసులు.
6 ✽నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు. వారికి తృప్తి కలుగుతుంది.
7 ✽కరుణ చూపేవారు ధన్యులు. వారికి కరుణ దొరుకుతుంది.
8 ✽ శుద్ధ హృదయులు ధన్యులు. వారు దేవుణ్ణి చూస్తారు✽.
9 సమాధానం✽ చేకూర్చేవారు ధన్యులు. వారు దేవుని సంతానం అనిపించుకొంటారు.
10 ✽నీతి న్యాయాల కోసం✽ హింసలకు గురి అయ్యేవారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది.
11 ✽“నన్నుబట్టి మనుషులు మిమ్ములను దూషించి, హింసించి, మీమీద అబద్ధంగా అన్ని రకాల అపనిందలు మోపినప్పుడు మీరు ధన్యులు. 12 ✽అప్పుడు సంతోషించండి! అత్యధికంగా ఆనందించండి! ఎందుకంటే, పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు పూర్వం ఉన్న✽ ప్రవక్తలను వారు ఇలాగే హింసించారు.
13 ✽“ఈ లోకానికి మీరు ఉప్పు. ఒకవేళ ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోతే దానికి ఉప్పదనం మళ్ళీ ఎలా కలుగుతుంది? అలాంటి ఉప్పు బయట పారవేయడానికి, మనుషుల కాళ్ళ క్రింద త్రొక్కబడడానికి✽ తప్ప మరి దేనికీ పనికి రాదు.
14 ✽“ఈ లోకానికి మీరు వెలుగు. కొండమీద ఉన్న ఊరు దాచబడడం అసాధ్యం. 15 ఎవరూ దీపం వెలిగించి బుట్టక్రింద పెట్టరు. దానిని దీప స్తంభంమీద ఉంచుతారు గదా. అప్పుడు అది ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది. 16 ✽అలాగే మనుషులు మీ మంచి పనులు చూచి, పరలోకంలో ఉన్న మీ తండ్రి✽ని స్తుతించేలా మీ వెలుగు వారి ఎదుట ప్రకాశించనియ్యండి.
17 ✽“ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దుచేయడానికి నేను వచ్చాననుకోకండి. వాటిని నెరవేర్చడానికే✽ వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు. 18 ✽నేను ఖచ్చితంగా మీతో చెపుతున్నాను, ధర్మశాస్త్రమంతా నెరవేరేవరకు, భూమీ ఆకాశమూ నశించేవరకు, ధర్మశాస్త్రంలో ఉన్న పొల్లు గానీ అర సున్న గానీ ఏదీ నశించదు. 19 ✽ఈ ఆజ్ఞలలో అతి స్వల్పమైన దానినైనా మీరి అలా చేయడం ఇతరులకు నేర్పేవారు పరలోక రాజ్యంలో అత్యల్పులుగా లెక్కలోకి వస్తారు. కానీ ఈ ఆజ్ఞలను పాటిస్తూ వాటిని ఉపదేశిస్తూ ఉండేవారు పరలోక రాజ్యంలో ఘనులుగా లెక్కలోకి వస్తారు. 20 నేను మీతో చెపుతున్నాను, పరిసయ్యుల✽, ధర్మశాస్త్ర పండితుల నీతిన్యాయాలకంటే మీ నీతిన్యాయాలు మించి ఉండకపోతే మీరు పరలోక రాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించరు.
21 “‘హత్య✽ చేయకూడదు; హత్య చేసిన వారెవరైనా తీర్పుకు గురి అవుతారు’ అని పూర్వీకులకు చెప్పినది మీరు విన్నారు గదా. 22 అయితే మీతో నేనంటాను✽, కారణం లేకుండా తన సోదరునిమీద కోపం పెట్టుకొనే ప్రతి ఒక్కడూ తీర్పుకు తగినవాడు. తన సోదరుణ్ణి ‘వ్యర్థుడా’ అనేవాడెవడైనా సరే యూదుల న్యాయ సభ విమర్శకు తగినవాడు. తన సోదరుణ్ణి ‘మూర్ఖుడా’ అనేవాడెవడైనా సరే నరకాగ్ని✽కి తగినవాడు. 23 ✽అందుచేత మీరు పీఠంముందు అర్పణ చేసేటప్పుడు, ఏ విషయంలోనైనా సరే మీమీద మీ సోదరునికి విరోధ భావం ఉందని మీకు గుర్తుకు వస్తే, 24 మీ అర్పణ పీఠం ముందు విడిచివెళ్ళిపోండి! మొట్టమొదట మీ సోదరునితో సఖ్యపడండి, ఆ తరువాత వచ్చి మీ అర్పణ అర్పించండి.
25 ✽“మీ ప్రత్యర్థితో న్యాయస్థానానికి పోయే త్రోవలోనే త్వరగా రాజీపడండి. లేకపోతే మీ ప్రత్యర్థి మిమ్ములను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో, న్యాయాధిపతి మిమ్ములను భటుడికి అప్పగించి ఖైదులో వేయిస్తాడేమో. 26 అలాంటప్పుడు మీరు చివరి పైసాతో సహా చెల్లించేంతవరకు బయటికి రాలేరని నేను మీతో ఖచ్చితంగా చెపుతున్నాను.
27 “వ్యభిచారం✽ చేయకూడదని పూర్వీకులకు చెప్పిన మాట మీరు విన్నారు గదా. 28 కానీ మీతో నేను చెపుతున్నాను, ఎవడైనా ఒక స్త్రీని మోహం చూపు చూస్తే, అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో✽ వ్యభిచరించాడు.
29 “మీ కుడికన్ను మీకు పాపానికి కారణమైతే దాన్ని పీకి మీ దగ్గర నుంచి అవతల పారవేయండి! మీ శరీరాన్నంతా నరకంలో త్రోసివేయడంకంటే మీ శరీర భాగాలలో ఒకటి నశించడం మీకు మేలు. 30 మీ కుడి చేయి మీకు పాపానికి కారణమైతే దాన్ని నరికి మీ దగ్గరనుంచి అవతల పారవేయండి! మీ శరీరాన్నంతా నరకంలో త్రోసివేయడంకంటే మీ శరీర భాగాలలో ఒకటి నశించడం మీకు మేలు.
31 “భార్యతో తెగతెంపులు చేసుకొన్నవాడు ఆమెకు విడాకులు✽ ఇవ్వాలనేది కూడా పూర్వం చెప్పిన మాట. 32 కానీ మీతో నేను చెపుతున్నాను, భార్య వ్యభిచరించి నందుచేత తప్ప మరో కారణంవల్ల ఆమెతో తెగతెంపులు చేసుకొన్నవాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. అలా తెగతెంపులయిన ఒక స్త్రీని పెళ్ళాడేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
33 “మరో సంగతి, ‘ప్రభువుకు చేసిన ప్రమాణం✽ నిలబెట్టుకోవాలి. మీరు అసత్యమైన ఒట్టు పెట్టుకోకూడదు’ అంటూ పూర్వీకులకు చెప్పినది మీరు విన్నారు గదా. 34 కానీ మీతో నేనంటాను, మీరు ఎంతమాత్రం ఒట్టుపెట్టుకోకండి. పరలోకంతోడని ఒట్టుపెట్టుకోకూడదు – అది దేవుని సింహాసనం. 35 భూమితోడని ఒట్టుపెట్టుకోకూడదు – అది దేవుని పాదపీఠం. జెరుసలం మీద ఒట్టుపెట్టుకోకూడదు – అది మహా రాజు నగరం. 36 మీ తలమీద కూడా ఒట్టుపెట్టుకోకూడదు. మీరు ఒక్క వెంట్రుకైనా తెల్లగా గానీ నల్లగా గానీ చేయలేరు. 37 మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టే ఉండాలి. దీనిని మించినది దుర్మార్గంనుంచే కలుగుతుంది.
38 ✽“‘కంటికి బదులుగా కన్ను, పంటికి బదులుగా పన్ను ఊడబెరకాలి’ అని చెప్పిన మాట మీరు విన్నారు గదా. 39 ✽కానీ మీతో నేనంటాను, దుర్మార్గుణ్ణి ఎదిరించకండి. ఎవరైనా మిమ్ములను కుడిచెంపపై కొడితే, ఆ వ్యక్తికి ఎడమ చెంప కూడా త్రిప్పండి. 40 ఎవరైనా మీ విషయం వ్యాజ్యం వేసి మీ అంగీని తీసుకోవాలని చూస్తే ఆ వ్యక్తికి మీ పై చొక్కాను కూడా ఇచ్చివేయండి. 41 ఎవరైనా కిలోమీటరు దూరం వచ్చేలా మిమ్ములను బలవంతం చేస్తే, ఆ వ్యక్తితో రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళండి. 42 ✽మిమ్మల్ని అడిగినవారికి ఇవ్వండి. అప్పుకోసం మీ దగ్గరికి వచ్చినవారికి పెడ ముఖం పెట్టుకోకండి.
43 ✽“‘మీ పొరుగువారిని ప్రేమతో చూడండి. మీ పగవారిని ద్వేషించండి’ అని చెప్పిన మాట మీరు విన్నారు గదా. 44 మీతో నేనంటాను, మీ పగవారిని ప్రేమతో చూడండి. మిమ్ములను శపించేవారిని దీవించండి. మీరంటే ద్వేషమున్న వారికి మేలు చేయండి. దూషణతో మీపట్ల వ్యవహరించే వారి కోసం, మిమ్ములను హింసించేవారి కోసం ప్రార్థన చేయండి. 45 మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి తగిన సంతానంగా ఉండడానికి ఆ విధంగా చేయండి. ఎందుకంటే, ఆయన మంచివారికి, చెడ్డవారికి కూడా, సూర్యోదయం కలిగిస్తాడు. న్యాయవంతులకు, అన్యాయస్థులకు కూడా వాన కురిపిస్తాడు. 46 మిమ్ములను ప్రేమించేవారినే ప్రేమిస్తే మీకు ఏ బహుమానం దొరుకుతుంది? సుంకంవారు✽ కూడా అలా చేస్తారు గదా. 47 ✽మీరు మీ సోదరులకే మర్యాదలు చేస్తే మీరు ఇతరులకంటే ఎక్కువ చేసినదేమిటి? సుంకంవారు కూడా అలా చేస్తారు గదా. 48 ✽పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరు పరిపూర్ణులై ఉండండి.