4
1 అప్పుడు యేసును అపనింద పిశాచం వల్ల విషమపరీక్షలకు గురి కావడానికి దేవుని ఆత్మ అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు. 2  అక్కడ యేసు నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది.
3 దుష్‌ప్రేరేపణ చేసేవాడు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు!”
4  అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు: “మనిషి ఆహారంవల్ల మాత్రమే బ్రతకడు గానీ దేవుని నోటనుంచి వచ్చే ప్రతి వాక్కువల్లా బ్రతుకుతాడుఅని వ్రాసి ఉంది.”
5 అప్పుడు అపనింద పిశాచం ఆయనను పవిత్ర నగరానికి తీసుకువెళ్ళి దేవాలయం శిఖరంమీద నిలబెట్టాడు.
6 “నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దూకేసెయ్యి! ఎందుకంటే ఇలా రాసి ఉంది – ఆయన తన దూతలకు నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు నీ పాదానికి రాయి తగలకుండా నిన్ను తమ చేతులలో ఎత్తిపట్టుకొంటారు అని ఆయనతో అన్నాడు.”
7  అందుకు యేసు వాడితో ఇలా చెప్పాడు: “నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించకూడదు అని కూడా వ్రాసి ఉంది.”
8 ఇంకా అపనింద పిశాచం ఆయనను చాలా ఎత్తయిన పర్వతంమీదికి తీసుకువెళ్ళి భూలోక రాజ్యాలన్నీ వాటి వైభవాన్నీ చూపించాడు. 9 అప్పుడు వాడు ఆయనతో “నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే ఇదంతా నీకిస్తాను” అన్నాడు.
10  “సైతానూ! అవతలికి పో! నీ ప్రభువైన దేవుణ్ణే ఆరాధించాలి, ఆయనకు మాత్రమే సేవ చేయాలి అని వ్రాసి ఉంది” అని యేసు వాడితో చెప్పాడు.
11  అప్పుడు అపనింద పిశాచం ఆయనను విడిచివెళ్ళాడు. దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారాలు చేశారు.
12 యోహాను ఖైదు పాలయ్యాడని యేసు విని గలలీ ప్రదేశానికి తిరిగి వెళ్ళాడు. 13 నజరేతు విడిచివెళ్ళి కపెర్‌నహూంలో నివాసం చేశాడు. అది సరస్సు తీరాన, జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలలో ఉంది. 14 యెషయాప్రవక్త మూలంగా వచ్చిన ఈ వాక్కు నెరవేరేందుకే అది జరిగింది: 15  “జెబూలూను ప్రదేశం, నఫ్తాలి ప్రదేశం, యొర్దాను నది అవతల, సముద్రం వైపు ఉన్న యూదేతరుల గలలీ రాష్ట్రంలో, 16 చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప కాంతి కనిపించింది. చావునీడ ఉన్న దేశంలో నివసించేవారిమీద వెలుగు ప్రకాశించింది.”
17 అప్పటినుంచి యేసు “పరలోక రాజ్యం దగ్గరగా ఉంది గనుక పశ్చాత్తాపపడండి” అంటూ ప్రకటించడం మొదలు పెట్టాడు.
18 యేసు గలలీ సరస్సు ఒడ్డున నడుస్తూ, ఇద్దరు అన్నదమ్ములు సరస్సులో వల వేస్తూ ఉంటే చూశాడు. వారు సీమోను, అతడి తోబుట్టువు అంద్రెయ. సీమోనును “పేతురు” అని పిలుస్తారు. వారు చేపలు పట్టేవారు. 19 యేసు వారితో ఇలా అన్నాడు:
“నా వెంటరండి. మనుషులను పట్టే జాలరులుగా మిమ్ములను చేస్తాను.” 20 వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.
21 అక్కడనుంచి వెళ్ళి యేసు ఇంకో ఇద్దరు అన్నదమ్ములను చూశాడు. వారు జెబెదయి కొడుకు యాకోబు, అతడి తోబుట్టువు యోహాను. తమ తండ్రి జెబెదయితో కూడా వారు పడవలో వలలు సిద్ధం చేసుకొంటున్నారు. యేసు వారిని పిలిచాడు. 22 వెంటనే వారు పడవనూ తమ తండ్రినీ విడిచి ఆయన వెంట వెళ్ళారు.
23 యేసు గలలీ ప్రదేశం అంతటా ప్రయాణాలు చేస్తూ, వారి సమాజకేంద్రాలలో ఉపదేశిస్తూ, రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రజలలో ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగుచేస్తూ ఉన్నాడు. 24 ఆయన కీర్తి సిరియా అంతటా వ్యాపించింది. ప్రజలు రోగులందరినీ నానా విధాల వ్యాధులచేత యాతనలచేత పీడితులైన వారిని, దయ్యాలు పట్టినవారిని, మూర్ఛరోగులను, పక్షవాత రోగులను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన వారిని బాగు చేశాడు. 25 గలలీ, దెకపొలి, జెరుసలం, యూదయ, యొర్దానుకు అవతలి ప్రదేశం – ఈ స్థలాలనుంచి పెద్ద జన సమూహాలు ఆయన వెంటవెళ్ళారు.