3
1 ✽ఆ రోజుల్లో బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో ఇలా చాటిస్తూ ఉన్నాడు: 2 ✽“పరలోక రాజ్యం✽ దగ్గరగా✽ ఉంది, గనుక పశ్చాత్తాపపడండి.”3 ✽అతణ్ణి గురించే యెషయా ప్రవక్త మునుపు ఇలా చెప్పాడు: “ఎడారిలో ఒకతని స్వరం ఇలా ఘోషిస్తూ ఉంది: ప్రభువు✽కోసం దారి సిద్ధం చేయండి! ఆయనకోసం త్రోవలు తిన్ననివి చేయండి!”
4 ✽ఈ యోహాను ఒంటె రోమాల బట్టలు తొడుక్కొని నడుముకు తోలు దట్టి కట్టుకొనేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె. 5 ప్రజలు జెరుసలంనుంచీ యూదయ అంతటినుంచీ యొర్దాను ప్రాంతమంతటినుంచీ యోహాను దగ్గరికి వచ్చారు. 6 ✽తమ పాపాలు ఒప్పుకొంటూ అతనిచేత యొర్దాను నదిలో బాప్తిసం పొందుతూ ఉన్నారు. 7 అతడు బాప్తిసం ఇస్తున్న స్థలానికి చాలామంది పరిసయ్యులూ✽, సద్దూకయ్యులూ✽ రావడం చూచినప్పుడు యోహాను వాళ్ళతో ఇలా అన్నాడు:
“ఓ సర్ప వంశమా✽! రాబోయే ఆగ్రహం✽ తప్పించుకుపోండని మిమ్మల్ని హెచ్చరించినదెవరు? 8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలు✽ వచ్చేలా చేసుకోండి. 9 ✽ ‘అబ్రాహాము మా తండ్రి’ అని భావించుకోకండి. మీతో చెపుతున్నాను గదా, దేవుడు ఈ రాళ్ళను అబ్రాహాము సంతానమయ్యేలా చేయగలడు. 10 ✽ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు పెట్టి ఉంది. మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి అగ్ని✽లో పారవేయడం జరుగుతుంది. 11 ✽పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్ళలో మీకు బాప్తిసమిస్తూ ఉన్నాను. కానీ నాకంటే బలప్రభావాలు ఉన్నవాడు నా తరువాత వస్తున్నాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన దేవుని పవిత్రాత్మలోనూ అగ్నిలోనూ మీకు బాప్తిసమిస్తాడు. 12 తన తూర్పారపట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం పూర్తిగా శుభ్రం చేస్తాడు. తన గోధుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని అగ్ని✽లో కాల్చివేస్తాడు.”
13 ✽ఆ సమయంలో యోహానుచేత బాప్తిసం పొందడానికి యేసు గలలీ ప్రదేశంనుంచి అతని దగ్గరికి యొర్దానుకు వచ్చాడు. 14 యోహాను ఆయనను అడ్డుపెట్టడానికి ప్రయత్నించాడు. “మీ చేత నేను బాప్తిసం పొందవలసినవాణ్ణి. మీరు నా దగ్గరికి వస్తున్నారా?” అన్నాడు.
15 “ఇప్పుడు ఈ విధంగా జరిగిపోనియ్యి. ధర్మం యావత్తూ ఇలా మనం నెరవేర్చడం యుక్తమే” అని యేసు అతనికి జవాబిచ్చాడు. అప్పుడు యోహాను ఆయనకు అలా జరగనిచ్చాడు.
16 ✽యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలోనుంచి బయటికి వచ్చాడు. అప్పుడే ఆయనకు ఆకాశం తెరచుకొంది, దేవుని ఆత్మ✽ ఒక పావురంలాగా దిగివచ్చి తనమీద వాలడం ఆయన చూశాడు. 17 ✽అప్పుడే ఆకాశంనుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనంటే నాకెంతో ఆనందం.”