2
1 హేరోదురాజు కాలంలో యూదయలో ఉన్న బేత్‌లెహేంలో యేసు జన్మించాడు. ఆ తరువాత జ్ఞానులు కొందరు తూర్పు దిక్కునుంచి జెరుసలంకు వచ్చి ఇలా అన్నారు: 2 “యూదులకు రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున ఆయన నక్షత్రాన్ని మేము చూశాం, ఆయనను ఆరాధించడానికి వచ్చాం.”
3 ఇది విని హేరోదురాజు అతడితోపాటు జెరుసలం వాళ్ళంతా కంగారుపడ్డారు. 4 అతడు ప్రజల ప్రధాన యాజులనూ ధర్మశాస్త్ర పండితులనూ అందరినీ సమకూర్చి “అభిషిక్తుడు ఎక్కడ పుట్టవలసి ఉంది?” అని వారిని అడిగాడు.
5 వారు అతనికి ఇలా జవాబిచ్చారు: “యూదయలో ఉన్న బేత్‌లెహేంలో. ప్రవక్త రాసినదేమిటంటే, 6 యూదాదేశంలోని బేత్‌లెహేం! యూదా పరిపాలకులలో నీవు దేనికీ తీసిపోవు. ఎందుకంటే నీలోనుంచే నా ప్రజలైన ఇస్రాయేల్‌కు కాపరిగా ఉండే పరిపాలకుడు వస్తాడు.”
7 అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన కాలం వారిమూలంగా తెలుసుకొన్నాడు. 8 తరువాత వారిని బేత్‌లెహేంకు పంపిస్తూ “ఆ పిల్లవాడికోసం బాగా వెదకండి. నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధించేలా మీరు ఆయనను కనుగొన్నాక నాకు వచ్చి చెప్పండి” అన్నాడు.
9 రాజు చెప్పినది విని వారు బయలుదేరారు. తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారికి ముందుగా పోతూ ఆ శిశువు ఉన్న స్థలానికి పైగా నిలిచింది. 10 ఆ నక్షత్రం చూచి వారు అత్యధికంగా సంతోషించారు. 11 ఇంట్లోకి వెళ్ళి శిశువునూ ఆయన తల్లి మరియనూ చూశారు, సాష్టాంగపడి ఆయనను ఆరాధించారు. తరువాత నిధుల పెట్టెలు విప్పి ఆయనకు బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా అర్పించారు. 12 హేరోదు దగ్గరకు తిరిగి వెళ్ళవద్దని కలలో హెచ్చరిక విని వారు వేరే దారిన పడి స్వదేశానికి వెళ్ళిపోయారు.
13 వారు వెళ్ళిన తరువాత ప్రభు దేవదూత ఒకడు యోసేపుకు కలలో కనబడి ఇలా అన్నాడు: “హేరోదు ఈ శిశువును చంపడానికి అంతటా గాలిస్తాడు. లేచి శిశువునూ ఆయన తల్లినీ తీసుకొని ఈజిప్ట్‌కు పారిపో. నేను మళ్ళీ నీకు చెప్పేంతవరకు అక్కడే ఉండు.”
14 కనుక యోసేపు లేచి రాత్రికి రాత్రే శిశువునూ ఆయన తల్లినీ తీసుకొని ఈజిప్ట్‌కు తరలివెళ్ళాడు. 15 హేరోదు చనిపోయేవరకు అక్కడే ఉండిపోయాడు. “ఈజిప్ట్‌నుంచి నా కుమారుణ్ణి పిలిచాను” అని మునుపు ప్రభువు ఒక ప్రవక్త ద్వారా పలికించాడు. ఈ మాట నెరవేరేందుకే ఇది జరిగింది.
16 ఆ జ్ఞానులు తనను నవ్వులపాలు చేశారని గ్రహించి హేరోదు అత్యంత ఆగ్రహంతో మండిపడ్డాడు. అతడు మనుషులను పంపి, జ్ఞానులవల్ల తెలుసుకొన్న కాలం ప్రకారం బేత్‌లెహేంలోనూ దాని పరిసరాలన్నిటిలోనూ రెండేళ్ళు అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు. 17 యిర్మీయాప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట ఆ విధంగా నెరవేరింది – 18 “రమాలో ఒక స్వరం, విలాపం, ఏడుపు, మహా రోదనం వినబడుతున్నాయి. రాహేలు తన పిల్లలకోసం ఏడుస్తూ ఉంది. వారిని కోల్పోయి ఓదార్పును నిరాకరిస్తూ ఉంది.”
19 హేరోదు మృతి చెందాక ప్రభు దేవదూత ఒకడు ఈజిప్ట్‌లో కాపురమున్న యోసేపుకు కలలో కనిపించి అన్నాడు, 20 “ఈ పిల్లవాడి ప్రాణం తీయాలని చూచేవాళ్ళు మరణించారు, గనుక లేచి పిల్లవాణ్ణీ ఆయన తల్లినీ తీసుకొని ఇస్రాయేల్ దేశానికి వెళ్ళు.”
21 అలాగే అతడు లేచి శిశువునూ ఆయన తల్లినీ ఇస్రాయేల్ దేశానికి తీసుకువెళ్ళాడు. 22 అయితే అర్కిలావస్ అతడి తండ్రి హేరోదు స్థానంలో యూదయను పరిపాలిస్తున్నాడని యోసేపు విని అక్కడికి వెళ్ళడానికి జంకాడు. కలద్వారా దేవుని హెచ్చరిక పొంది గలలీ ప్రదేశానికి వెళ్ళిపోయాడు. 23 నజరేతు అనే గ్రామం చేరి అక్కడ నివాసమున్నాడు. యేసును నజరేయుడంటారు అని ప్రవక్తల మూలంగా వచ్చిన మాట నెరవేరేందుకు ఈ విధంగా జరిగింది.