28
1 విశ్రాంతి దినం గడచిన తరువాత ఆదివారం నాడు తెల్లవారుతూ ఉండగానే మగ్దలేనే మరియ, ఆ మరో మరియ సమాధిని చూడడానికి వచ్చారు. 2 అంతకుముందు ఒక పెద్ద భూకంపం కలిగింది. ఎందుకంటే ప్రభుదూత ఒకడు పరలోకంనుంచి దిగివచ్చి, ద్వారం నుంచి ఆ రాయి దొర్లించి దానిమీద కూర్చున్నాడు. 3 అతడి రూపం మెరుపులాగా ఉంది, అతని వస్త్రం చలి మంచంత తెల్లగా ఉంది. 4  అతని భయంచేత కావలివారికి వణకు పుట్టి చచ్చినంత పనైంది.
5 దేవదూత ఆ స్త్రీలతో ఇలా అన్నాడు: “భయపడకండి! సిలువ వేయబడ్డ యేసును మీరు వెదకుతున్నారని నాకు తెలుసు. 6 ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన సజీవంగా లేచాడు. రండి, ప్రభువు పడుకొన్న స్థలం చూడండి. 7  అప్పుడా దూత, త్వరగా వెళ్ళి ఆయన శిష్యులతో ‘ఆయన చనిపోయిన వారిలోనుంచి సజీవంగా లేచాడు. మీకంటే ముందుగా గలలీకి వెళ్ళబోతున్నాడు. అక్కడ మీరు ఆయనను చూస్తారు’ అని చెప్పండి. ఇదిగో, మీతో నేను ఇది చెపుతున్నాను.”
8  వారు భయంతో, గొప్ప సంతోషంతో సమాధినుంచి త్వరగా వెళ్ళి, ఆయన శిష్యులకు ఆ విషయం చెప్పడానికి పరుగెత్తారు. 9 వారు ఆయన శిష్యులకు ఇలా చెప్పడానికి వెళ్ళిపోతుండగా యేసు వారిని ఎదుర్కొని, “శుభం!” అన్నాడు. వారు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనను ఆరాధించారు.
10 యేసు వారితో “భయపడకండి! వెళ్ళి నా సోదరులు గలలీకి వెళ్ళాలనీ అక్కడ వారు నన్ను చూస్తారనీ వారికి తెలియజేయండి” అన్నాడు.
11 వారు వెళ్తూ ఉన్నప్పుడే ఆ కావలివారిలో కొందరు నగరంలోకి వెళ్ళి జరిగినదంతా ప్రధాన యాజులకు చెప్పారు. 12 వారు పెద్దలతో సమకూడి సమాలోచన చేసినతరువాత, ఆ సైనికులకు చాలా డబ్బు ఇచ్చి ఇలా అన్నారు:
13 “మీరు వారితో ఈ విధంగా చెప్పండి – ‘రాత్రివేళ మేము నిద్రపోతూ ఉన్నప్పుడు అతడి శిష్యులు వచ్చి అతణ్ణి ఎత్తుకు పోయారు.’ 14 ఒకవేళ ఇది అధిపతి చెవిని పడితే మేము అతడికి నచ్చచెప్పి మీకేమీ తొందర రాకుండా చేస్తాం.”
15 వారు ఆ డబ్బు తీసుకొని తమకు ఇచ్చిన ఆదేశం ప్రకారం చేశారు. ఈ కథ యూదులలో వ్యాపిస్తూ నేటివరకు ప్రచారంలో ఉంది.
16 పదకొండుమంది శిష్యులు గలలీకి వెళ్ళి యేసు వారికి నిర్ణయించిన కొండ చేరుకొన్నారు. 17 ఆయనను చూచినప్పుడు వారు ఆయనను ఆరాధించారు. గానీ కొందరు సందేహించారు.
18  యేసు దగ్గరగా వచ్చి వారితో ఇలా అన్నాడు: “పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. 19  కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనాలలో శిష్యులను చేయండి. తండ్రి కుమార పవిత్రాత్మల పేరట వారికి బాప్తిసం ఇవ్వండి, 20 నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ పాటించాలనీ వారికి ఉపదేశించండి. ఇదిగో, నేను ఎప్పటికీ – యుగాంతం వరకూ – మీతోకూడా ఉన్నాను.” తథాస్తు.