3
1 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే “నేను నా దూతను పంపిస్తాను. అతడు నా ముందర త్రోవ సిద్ధం చేస్తాడు. ఆ తరువాత, మీరు వెదకుతూ ఉన్న ప్రభువు, అంటే మీరు కోరే ఒడంబడిక దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు. 2 అయితే ఆయన రాకడ దినం ఎవరు తట్టుకోగలుగుతారు? ఆయన కనబడే టప్పుడు ఎవరు నిలబడి ఉండగలుగుతారు? ఆయన కంసాలి నిప్పులాంటివాడు. 3 చాకలి సబ్బు లాంటివాడు. వెండిని పరీక్షించి పుటంపెట్టి శుద్ధి చేసేవాడిలాగా కూర్చుంటాడు. వెండి బంగారాలను పుటంపెట్టే విధంగా ఆయన లేవీగోత్రికులను శుద్ధి చేస్తాడు. అప్పుడు వారు నీతి నిజాయితీ అనుసరించి యెహోవాకు నైవేద్యాలు అర్పిస్తారు. 4 గతించిన రోజుల్లో పూర్వకాలంలోలాగే యూదావారూ జెరుసలం నివాసులూ చేసే నైవేద్యాలు యెహోవాకు అంగీకారంగా ఉంటాయి. 5 తీర్పుతీర్చడానికి నేను మీదగ్గరికి వస్తాను. మాంత్రికులమీద, వ్యభిచారుల మీద, అబద్ధసాక్షుల మీద సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నాకు భయపడకుండా, కూలి విషయంలో పనివారినీ వితంతువులనూ తండ్రిలేనివారినీ బాధిస్తూ, విదేశీయులకు అన్యాయం చేస్తూ ఉండేవారిమీద కూడా సాక్ష్యం చెపుతాను. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు.
6 “నేను యెహోవాను. నేను మార్పు చెందను, గనుకనే యాకోబు సంతతి వారలారా, మీరు నాశనం కాలేదు. 7 మీ పూర్వీకుల కాలంనుంచీ మీరు నా చట్టాల విషయం త్రోవతప్పి వాటిని పాటించలేదు. నావైపుకు తిరగండి, అప్పుడు నేను మీవైపుకు తిరుగుతాను. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు. 8 కానీ మీరు ‘మేము ఎలా తిరగాలి?’ అని అడుగుతారు. మనిషి దేవుని ద్రవ్యాన్ని దొంగిలించవచ్చా? అయితే మీరు నా ద్రవ్యాన్ని దొంగిలిస్తున్నారు. ‘మేము నీ ద్రవ్యాన్ని ఎలా దొంగిలిస్తున్నాం’ అని మీరు అడుగుతారు. మీ రాబడిలో పదోభాగాన్నీ కానుకలనూ ఇవ్వకపోవడంచేత దొంగిలిస్తున్నారు. 9 మీరు - ఈ ప్రజలంతా - దొంగిలిస్తూ ఉన్నందుచేత శాపంక్రింద ఉన్నారు. 10 నా ఆలయంలో ఆహారం ఉండేలా పదో భాగమంతా నా గిడ్డంగిలోకి తీసుకురండి. ఈ విషయంలో నన్ను పరీక్షించండి, నేను పరలోక ద్వారాలు తెరచి పట్టలేనంతగా ఆశీస్సులు కుమ్మరిస్తానో లేదో చూడండి. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు. 11 మీ పైరును పురుగులు తినివేయకుండా చేస్తాను. అవి మీ భూపంటను నాశనం చేయవు. మీ ద్రాక్షచెట్ల పండ్లు అకాలంగా రాలవు. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు. 12 అప్పుడు మీ దేశం ఆనందదాయకం అవుతుంది. అన్ని దేశాలవారూ మిమ్ములను ధన్యులు అంటారు. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు.”
13 యెహోవా చెప్పేదేమంటే “నాకు వ్యతిరేకంగా మీరు చాలా గర్వంగా మాట్లాడారు. అయితే మీరు ‘నీకు వ్యతిరేకంగా ఏం చెప్పాం?’ అని అడుగుతారు. 14  మీరు ఇలా చెప్పారు: ‘దేవునికి సేవ చేయడం వ్యర్థం. ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తూ, సేనలప్రభువు యెహోవా ఎదుట దుఃఖాక్రాంతులుగా తిరుగుతూ ఉండడంచేత ప్రయోజనం ఏమిటి? 15 ఇప్పుడు గర్విష్ఠులే ధన్యులని చెప్పుకొంటాం! చెడుగు చేసేవాళ్ళు వర్ధిల్లుతూ ఉన్నారు. దేవుణ్ణి పరీక్షించేవాళ్ళు కూడా తప్పించుకుంటారు.’”
16 అప్పుడు యెహోవా అంటే భయభక్తులున్న వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొన్నారు. యెహోవా చెవి ఒగ్గి విన్నాడు. యెహోవా అంటే భయభక్తులుండి ఆయన పేరును గౌరవించేవారి విషయం ఆయన సన్నిధానంలో జ్ఞాపకార్థమైన పుస్తకంలో ఎక్కించడం జరిగింది.
17 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే “నా నియామకమైన రోజున వారు నావారుగా, నా ప్రత్యేకమైన సొత్తుగా ఉంటారు. తండ్రి తనకు సేవ చేసే కొడుకును కనికరించే విధంగా నేను వారిని కనికరిస్తాను. 18 అప్పుడు సన్మార్గులకూ దుర్మార్గులకూ మధ్య భేదమేమిటో, దేవునికి సేవ చేసేవారికీ చేయనివారికీ మధ్య వ్యత్యాసమేమిటో మీరు మళ్ళీ గుర్తిస్తారు.”