2
1 కాబట్టి, యాజులారా, ఈ ఆదేశం మీకోసమే. 2 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే “మీరు నా మాట వినకపోతే, నా పేరును మనసారా గౌరవించడానికి నిశ్చయించకపోతే నేను మీమీదికి శాపం తెప్పిస్తాను. మీ దీవెనలను శాపానికి మారుస్తాను. మీరు అలా నిశ్చయించుకోలేదు గనుక ఇదివరకే నేను వాటిని అలా మార్చాను. 3 మీకారణంగా మీ సంతానాన్ని మందలిస్తాను. మీ పండుగలలో మీరు అర్పించే పశువుల పేడ మీ ముఖాలమీద వేయిస్తాను. దానితోపాటు మిమ్ములను అవతలకు తీసుకు పోవడం జరుగుతుంది. 4 నేను లేవీ వంశంవారితో చేసిన ఒడంబడిక ఉండిపోయేలా మీకు ఈ ఆదేశం ఇచ్చానని మీరు తెలుసుకొంటారు. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు. 5 నేను వారితో ఒడంబడిక చేశాను. ఆ ఒడంబడిక జీవ సంబంధం, శాంతి సంబంధం. వారు నా విషయం భయభక్తులు చూపాలని నేను అవి వారికిచ్చాను. అప్పుడు వారు నాపట్ల భయభక్తులు చూపారు. నా పేరంటే వారికి బీతి. 6 నిజమైన ధర్మోపదేశం వారి నోటిమీదుగా వెలువడింది గాని దుర్బోధ ఏమాత్రమూ కాదు. శాంతితో, నిజాయితీతో నా సహవాసంలో నడుచుకొన్నారు. వారు అనేకులను అన్యాయంనుంచి త్రిప్పారు. 7 యాజులు సేనల ప్రభువు యెహోవా వార్తాహరులు గనుక వారు జ్ఞానాన్ని భద్రపరచాలి. మనుషులు వారి నోట ధర్మశాస్త్రం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. 8 మీరైతే దారి తప్పినవారు. మీరు ఇచ్చిన ఉపదేశం వల్ల అనేకులు తడబడ్డారు. నేను లేవీ వంశంతో చేసిన ఒడంబడికను వమ్ము చేశారు.
9 “నా విధానాలను అనుసరించక, ధర్మశాస్త్రం విషయాలలో పక్షపాతం చూపుతూ ఉన్నారు గనుక ప్రజలందరి కళ్ళెదుటే మిమ్ములను అణచివేశాను, తృణీకారానికి గురి చేశాను. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు.”
10 మనకందరికీ తండ్రి ఒక్కడే గదా. ఒకే దేవుడు మనల్ని సృజించాడు గదా. ఇలా ఉండగా ఒకరిపట్ల ఒకరం ద్రోహం చేస్తూ, దేవుడు మన పూర్వీకులతో చేసిన ఒడంబడికను మనమెందుకు అలక్ష్యం చేస్తున్నట్టు? 11 యూదావారు ద్రోహులయ్యారు. ఇస్రాయేల్‌వారి మధ్య జెరుసలంలోనే అసహ్యమైన కృత్యం జరిగింది యూదావారు యెహోవాకు ప్రియమైన పవిత్రాలయాన్ని అపవిత్రపరిచారు. విదేశీ దేవత పిల్లలను పెండ్లి చేసుకొన్నారు. 12 ఇలా చేసినవారిని ఎవరైనా సరే యాకోబువారి డేరాలలో లేకుండా, సేనల ప్రభువు యెహోవాకు నైవేద్యాలను అర్పించే వారి సహవాసంలో లేకుండా, యెహోవా నిర్మూలిస్తాడు గాక!
13 మీరు చేసే మరొకటి ఏమంటే, మీ కన్నీళ్ళతో యెహోవా బలిపీఠాన్ని తడుపుతారు. ఆయన మీ నైవేద్యాలను లక్ష్యపెట్టక, వాటిని మీచేత సంతోషంతో స్వీకరించకపోయినందుచేత మీరు ఏడుస్తారు, రోదనం చేస్తారు. 14 “ఎందుకు?” అని మీరు అడుగుతారు. దానికి కారణమేమంటే, యువకుడుగా ఉన్నప్పుడు నీవు పెండ్లాడిన భార్య విషయంలో ద్రోహం చేశావు. ఆమె పక్షంగా సాక్షిగా యెహోవా నిలబడి ఉన్నాడు. ఆమె నీతో సహవాసి గదా, నిబంధన ప్రకారం నీ భార్య గదా. 15 ఆయన మీ ఇద్దరిని ఒకటిగా చేయలేదా? శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా. అలా ఒకటిగా చేయడం దేనికి? దేవుడు ప్రసాదించిన సంతానం వారికి కలగాలని. అందుచేత మీ హృదయాన్ని మీరు కాపాడుకోండి. యువకులుగా ఉన్నప్పుడు పెండ్లాడిన మీ భార్యల విషయం ద్రోహం చేయకండి.
16 “వివాహ బంధాన్ని తప్పించడం నాకు అసహ్యం” అని ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా అంటున్నాడు. “మనిషి వస్త్రంతోపాటు దౌర్జన్యంతో తనను కప్పుకోవడం కూడా నాకు అసహ్యం” అని సేనలప్రభువు యెహోవా అంటున్నాడు. గనుక మీ హృదయాలను కాపాడుకోండి. ద్రోహం చేయకండి.
17 మీరు మీ మాటలచేత యెహోవాకు ఆయాసం కలిగించారు. “ఆయనకు ఆయాసం ఎలా కలిగించాం?” అని మీరు అడుగుతున్నారు. “చెడుగు చేసేవాళ్ళంతా యెహోవా దృష్టిలో మంచివారు, అలాంటివారంటే ఆయనకు ఇష్టమే” అని మీరంటారు. “న్యాయం జరిగించే దేవుడు ఏమయ్యాడు?” అంటారు. ఈవిధంగా ఆయనకు ఆయాసం కలిగించారు.