మలాకీ
1
1 ఇది దేవోక్తి✽, ఇస్రాయేల్ ప్రజలకు మలాకీ ద్వారా✽ వచ్చిన యెహోవా వాక్కు. 2 యెహోవా చెప్పేదేమంటే “నేను మిమ్ములను ప్రేమతో చూశాను✽. అయితే మీరు, ‘నీవెలా మమ్ములను✽ ప్రేమతో చూశావు?’ అని అడుగుతున్నారు✽. ఇది యెహోవా వాక్కు - ఏశావు✽ యాకోబుకు అన్న గదా. నేను యాకోబును ప్రేమించాను✽, 3 ✽ఏశావును ద్వేషించాను✽. అతని కొండలను పాడు చేశాను, అతడు వారసత్వంగా పొందిన ప్రదేశాన్ని ఎడారి నక్కలపాలు✽ చేశాను.”4 ఎదోంవారు ఇలా అంటున్నారు: “మనం చితికిపోయాం గానీ పాడైపోయిన మన స్థలాలను మళ్ళీ కట్టుకొందాం✽ పట్టండి.”
అయితే సేనల ప్రభువు యెహోవా✽ చెప్పేదేమంటే “వారు కట్టుకొన్నవాటిని నేను పడద్రోస్తాను✽. ఇతరులు, ‘వాళ్ళది దుర్మార్గుల దేశం✽, వాళ్ళు ఎప్పటికీ యెహోవా తీవ్రకోపానికి✽ గురి అయినవాళ్ళు’ అంటారు. 5 మీరు✽ అది కండ్లారా చూచి ‘ఇస్రాయేల్ సరిహద్దుల అవతల కూడా యెహోవా గొప్పవాడు’ అంటారు.”
6 ✽సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే “కొడుకు తన తండ్రిని గౌరవిస్తాడు గదా. దాసుడు తన యజమానిని✽ గౌరవిస్తాడు గదా. నేను తండ్రినైతే నాకు రావలసిన భయం ఏమైంది? నేను యజమానినైతే మీరు చూపవలసిన భయం ఏమైంది? యాజులారా✽! మీరు నా పేరును అలక్ష్యం✽ చేస్తున్నారు. అయితే మీరు ‘నీ పేరును ఎలా అలక్ష్యం చేశాం?’ అని అడుగుతున్నారు. 7 మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన ఆహారాన్ని✽ అర్పిస్తున్నారు. అయినా మీరు ‘నీ పేరును ఎలా అపవిత్ర పరచాం✽?’ అని అడుగుతారు. యెహోవా బల్ల నీచమైనదిగా ఎంచడంచేతనే గదా. 8 మీరు గుడ్డిదానిని తీసుకువచ్చి బలిగా అర్పిస్తారు. అది దుర్మార్గం కాదా? కుంటిదానిని గానీ జబ్బుదానిని గానీ అర్పిస్తారు. అది దుర్మార్గం కాదా? అలాంటి వాటిని మీ అధికారికి✽ ఇవ్వజూపండి! అతడు మిమ్ములను స్వీకరిస్తాడా? దయతో చూస్తాడా? ఇది యెహోవా వాక్కు. 9 ఇప్పుడు దయ చూపమని దేవుణ్ణి ప్రాధేయపడండి గానీ మీరు చేతులారా అర్పించిన బలులను చూచి ఆయన మిమ్ములను స్వీకరిస్తాడా✽? ఇది యెహోవా వాక్కు.
10 “మీరు బలిపీఠంమీద వ్యర్థంగా నిప్పు రాజబెట్టకుండా మీలో ఎవరైన ఆలయం ద్వారాలను మూసివేస్తే✽ ఎంత బావుండేది! మీరంటే నాకు సంతోషం లేదు. మీచేత నేను ఏ నైవేద్యాన్నీ స్వీకరించను. ఇది యెహోవా వాక్కు. 11 ✝తూర్పు నుంచి పడమటికి ఇతర జనాలలో నా పేరును గౌరవించడం జరుగుతుంది. ప్రతి స్థలంలో నా పేరుకు ధూపం వేస్తారు, శుద్ధ నైవేద్యాలను అర్పిస్తారు. ఇతర జనాలలో నా పేరుకు గౌరవం లభిస్తుంది. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు.
12 ✽“మీరైతే యెహోవా బల్ల అపవిత్రమనుకొని దాని ఆహారం నీచమనుకోవడంవల్ల నాపేరును దూషిస్తున్నారు. 13 ‘అయ్యో! ఎంత ఆయాసం!’ అని దానివల్ల తృణీకారం చూపుతున్నారు. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు. మీరు దోచుకొన్న దానినీ కుంటిదానినీ జబ్బుదానినీ తెచ్చి బలిగా అర్పించినప్పుడు అలాంటివాటిని మీనుంచి నేను స్వీకరించాలా? ఇది యెహోవా వాక్కు. 14 ✽నేను గొప్ప రాజును. ఇతర జనాలలో నా పేరంటే భయం✽. గనుక తన మందలో యెహోవాకు మొక్కుబడి చేసిన మగది ఉన్నప్పుడు దానికి బదులు లోపమున్నదానిని అర్పించే వంచకుడు✽ శాపానికి గురి అవుతాడు.