13
1 “ఆ రోజున పాపాలనూ అశుద్ధతనూ కడిగి వేయడానికి దావీదు వంశీయులకోసం, జెరుసలం నివాసులకోసం ఒక ఊట తెరవబడుతుంది. 2 ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు. ఆ రోజున దేశంలో విగ్రహ నామరూపాలు లేకుండా చేస్తాను. అప్పటినుంచి అవి ఇంకెన్నడూ జ్ఞప్తికి రావు. పరవశులై పలికేవారినీ అశుద్ధాత్మనూ కూడా దేశంలో లేకుండా చేస్తాను. 3 అప్పుడు ఎవరైనా సరే పరవశులై పలికితే ఆ వ్యక్తిని కన్న తల్లిదండ్రులు ఇలా చెప్పాలి: ‘యెహోవా పేర అబద్ధాలు పలికావు గనుక నువ్వు చావాలి’. వాడు పరవశుడై పలికితే కన్న తల్లిదండ్రులే వాణ్ణి పొడవాలి. 4 ఆ కాలంలో ప్రతి ప్రవక్త పరవశుడై పలికితే తనకు కలిగిన దర్శనం విషయం సిగ్గుపడతాడు. ఇతరులను మోసం చేయడానికి గొంగళ్ళు ధరించడు. 5 ‘నేను ప్రవక్తను కాను, నేను భూమి దున్నేవాణ్ణి. చిన్నప్పటినుంచి నన్ను నేర్పిన మనిషి దగ్గర ఆ పని చేస్తున్నాను’ అంటాడు.
6 “‘నీ చేతులకు ఉన్న గాయాల సంగతి ఏమిటి?’ అని ఎవరైన ఆయనను అడికితే ‘ఇవి నా స్నేహితుల ఇంట్లో నాకు కలిగిన గాయాలు’ అంటాడు. 7  ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు. ఖడ్గమా! నా గొర్రెల కాపరి అయి నాకు సన్నిహితుడై ఉన్న వ్యక్తిపై పడవే! గొర్రెలు చెదరిపోయేలా కాపరిని హతం చెయ్యి. చిన్నవాటిమీద నా చెయ్యి ఉంచుతాను. 8 ఇది యెహోవా వాక్కు. దేశమంతటా జనంలో మూడింట రెండు వంతులు హతమై నశిస్తారు. దేశంలో మూడో భాగంవారు మిగులుతారు. 9 ఆ మూడో భాగాన్ని మంటలగుండా దాటించి వెండిలాగా వారిని శుద్ధి చేస్తాను, బంగారంలాగా వారిని పరీక్షిస్తాను. వారు నా పేర ప్రార్థన చేస్తారు. నేను వారికి జవాబిస్తాను. ‘వీరు నా ప్రజ’ అంటాను. వారు ‘యెహోవా మా దేవుడు’ అంటారు.”