12
1 ఇది దేవోక్తి✽. ఇస్రాయేల్ ప్రజల విషయం వచ్చిన యెహోవా వాక్కు. యెహోవా ఆకాశాలను విశాలంగా పరచేవాడు, భూమిని స్థాపించేవాడు, మనిషిలో అతడి ఆత్మను రూపొందించేవాడు. ఆయన చెప్పేదేమంటే, 2 “నేను జెరుసలంను చుట్టూ ఉన్న జనాలన్నిటికీ మత్తు రేకెత్తించే పాత్ర✽గా చేస్తాను. శత్రువులు జెరుసలంను యూదా దేశాన్ని కూడా ముట్టడిస్తారు. 3 భూమిమీద ఉన్న జనాలన్నీ జెరుసలంకు వ్యతిరేకంగా సమకూడుతాయి. ఆ కాలంలో✽ నేను జెరుసలంను దేశాలన్నిటికీ బరువైన రాయిగా చేస్తాను. దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసేవారందరికీ చాలా హాని వస్తుంది. 4 ✽ఇది యెహోవా వాక్కు. ఆ కాలంలో నేను గుర్రాలన్నిటికీ✽ భయం, రౌతులకు వెర్రి పుట్టిస్తాను. యూదా వంశంవారి విషయం జాగరూకత వహిస్తాను. జనాల గుర్రాలన్నిటికీ గుడ్డితనం కలిగిస్తాను. 5 ✽అప్పుడు యూదా నాయకులు ‘తమ దేవుడు యెహోవా జెరుసలం నివాసులకు తోడుగా ఉండడంవల్ల మాకు బలం చేకూరింది’ అనుకొంటారు.6 “ఆ కాలంలో నేను యూదా నాయకులను కట్టెలక్రింద మంటలలాగా చేస్తాను, పనలలో✽ దివిటీలాగా చేస్తాను. వారు చుట్టూరా ఉన్న జనాలన్నిటినీ దహించివేస్తారు. అయితే జెరుసలం దాని స్థలంలో సుస్థిరంగా ఉంటుంది. 7 మొట్టమొదట యెహోవా యూదావారి నివాస స్థలాలను✽ రక్షిస్తాడు. దావీదు వంశంవారికీ✽ జెరుసలం నివాసులకూ కలిగిన ఘనత యూదావారికి కలిగిన ఘనతకంటే ఎక్కువ కాకూడదని ఆయన అలా చేస్తాడు. 8 ఆ కాలంలో యెహోవా జెరుసలం నివాసులను కాపాడుతాడు. వారందరిలో బలహీనులు దావీదులాగా✽ ఉంటారు, దావీదు వంశంవారు దేవునిలాగా✽, వారి ముందు✽ నడిచే యెహోవా దేవదూతలాగా✽ ఉంటారు. 9 ✝ఆ కాలంలో జెరుసలం పైబడే జనాలన్నిటినీ నాశనం చేయడానికి పూనుకొంటాను.
10 ✽“అప్పుడు దావీదు వంశీయుల మీద, జెరుసలం నివాసులమీద కరుణకోసం విన్నపం చేసే ఆత్మ✽ను కుమ్మరిస్తాను. తాము పొడిచిన నన్ను✽✽ వారు కండ్లారా చూస్తారు. ఒకే ఒక కొడుకు చనిపోతే విలపించే విధంగా ఆయన విషయం విలపిస్తారు, జ్యేష్ఠపుత్రుడు చనిపోతే ఏడ్చినట్టు ఆయన విషయం నొచ్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తారు✽. 11 మెగిద్దోను మైదానంలోని హదద్ రిమ్మోనులో జరిగిన విలాపంలాగే ఆ రోజున జెరుసలంలో మహా విలాపం ఉంటుంది. 12 దేశ నివాసులంతా✽, ప్రతి వంశం✽ ప్రత్యేకంగా, ఆ వంశంలో స్త్రీలు ప్రత్యేకంగా విలపిస్తారు. దావీదు వంశీయులు ప్రత్యేకంగా, వారి స్త్రీలు ప్రత్యేకంగా విలపిస్తారు. నాతాను వంశీయులు ప్రత్యేకంగా, వారి స్త్రీలు ప్రత్యేకంగా విలపిస్తారు. 13 లేవీ వంశీయులు ప్రత్యేకంగా, వారి స్త్రీలూ ప్రత్యేకంగా, షిమీ వంశీయులు ప్రత్యేకంగా, వారి స్త్రీలు ప్రత్యేకంగా, 14 మిగిలిన అన్నీ వంశాలవారు ప్రత్యేకంగా, వారి స్త్రీలు ప్రత్యేకంగా విలపిస్తారు.