11
1 లెబానోను! నీ ద్వారాలు తెరువు. మంటలు నీ దేవదారు చెట్లను కాల్చివేస్తాయి. 2 దేవదారుచెట్లు కూలాయి, ఘన వృక్షాలు పాడైపోయాయి గనుక సరళ వృక్షాల్లారా! విలపించండి. దట్టమైన అడవిని నరకడం జరిగింది గనుక బాషానులో ఉన్న సిందూర వృక్షాల్లారా! విలపించండి. 3 గొర్రెల కాపరుల రోదనం వినబడుతూ వుంది వారి శ్రేష్ఠమైన పచ్చిక మైదానాలు నాశనం అయ్యాయి. సింహాల గర్జనం వినబడుతూ ఉంది యొర్దాను లోయలోని దట్టమైన పొదల ప్రాంతం పాడైపోయింది.
4 నా దేవుడు యెహోవా చెప్పేదేమంటే “వధకు గురి కాబోయే మందకు కాపరిగా ఉండు. 5 వారిని కొనేవారు వారిని చంపినా శిక్ష పొందకుండా ఉన్నారు. వారిని అమ్మివేసేవారు ‘మేము ధనికులమయ్యాం. యెహోవాకు స్తుతి కలుగుతుంది గాక’ అంటారు. వారి కాపరులు వారిమీద జాలిపడరు. 6 ఇది యెహోవా వాక్కు. ఇకనుంచి నేను ఈ దేశ నివాసులమీద జాలిపడను. ఒకరి వశం ఒకరిని చేస్తాను, రాజు వశం అందరినీ చేస్తాను. వారు దేశాన్ని పాడు చేస్తారు. నేను వారి వశంనుంచి విడిపించను.”
7 అందుచేత వధకు గురి కాబోయే మందకు విశేషంగా బాధలు అనుభవిస్తున్న గొర్రెలకు నేను కాపరినయ్యాను. రెండు కర్రలు చేతపట్టుకొని ఆ పని చేశాను. ఒక కర్రనేమో “దయ” రెండోదానిని “ఐక్యం” అన్నాను. 8 ఒకే నెలలో నేను ముగ్గురు కాపరులను పనిలోనుంచి తీసివేశాను. నేనంటే మందకు అసహ్యం పుట్టింది. మందను నేను సహించలేకపోయాను. 9 గనుక “నేను మీకు కాపరిగా ఉండను. చావబోయేవారు చావవచ్చు. నశించబోయేవారు నశించవచ్చు. మిగతావారు ఒకరి శరీరాన్ని ఒకరు తింటే తినవచ్చు” అన్నాను.
10 అప్పుడు నేను జనులందరితో చేసిన ఒడంబడికను రద్దు చేయడానికి “దయ” అనే కర్రను చేతపట్టుకొని విరిచాను. 11 ఆ రోజున ఆ ఒడంబడిక రద్దయింది. గనుక నేను చెప్పినది యెహోవా వాక్కని మందలో బాధలు అనుభవిస్తూ, నావైపు చూస్తూ ఉన్నవారికి తెలిసింది.
12 వారితో నేనిలా అన్నాను: “మీకు మంచిది అనిపిస్తే నా జీతం నాకివ్వండి. లేకపోతే దాన్ని ఉంచుకోండి.” అందుచేత వారు నా జీతం నాకిచ్చారు.
అది ముప్ఫయి వెండి నాణేలు.
13 అప్పుడు యెహోవా నాతో “వాటిని కుమ్మరికి పారవేయి. వారు నా విలువను ఎంత గొప్పగా అంచనా వేశారు!” అన్నాడు. కనుక నేను ఆ ముప్ఫయి వెండి నాణేలు చేతపట్టుకొని యెహోవా ఆలయంలో కుమ్మరికి పడవేశాను. 14 ఆ తరువాత, యూదావారికీ ఇస్రాయేల్‌వారికీ కలిగిన సహోదర బంధాన్ని తెగతెంపులు చేయడానికి “ఐక్యం” అనే నా రెండో కర్రను చేత పట్టుకొని విరిచాను.
15 అప్పుడు యెహోవా నాతో చెప్పేదేమంటే “మరోసారి కాపరి సామాను తీసుకొని బుద్ధిలేని కాపరిలాగా ప్రవర్తించు. 16 ఎందుకంటే, ఈ దేశంలో అలాంటి కాపరి పైస్థానానికి వచ్చేలా చేస్తాను. వాడు నశిస్తూ ఉన్న గొర్రెలను లక్ష్యపెట్టడు, చెదరిపోయిన వాటిని వెదకడు, గాయపడ్డ వాటిని బాగుచేయడు. ఆరోగ్యమైన వాటిని పోషించడు. కానీ క్రొవ్విన వాటి డెక్కలను చీల్చివేసి వాటి మాంసం దిగమింగివేస్తాడు. 17 మందను వదలివేసే ఆ పనికిమాలిన కాపరికి బాధ తప్పదు! వాడి చెయ్యి, కుడి కన్ను కత్తి దెబ్బకు గురి అవుతాయి. వాడి చెయ్యి పూర్తిగా ఎండిపోతుంది, వాడి కుడి కన్ను గుడ్డిది అవుతుంది.”