10
1 వానకాలంలో వాన దయచేయాలని యెహోవాను వేడుకోండి. పిడుగులను పుట్టించేవాడు యెహోవాయే. ప్రతివాడి పొలంలో మొక్కలు మొలిచేలా వాన కురిపించేవాడు ఆయనే. 2 గృహదేవతలు మోసం మాటలు పలుకుతాయి. శకునాల సోదెగాండ్లకు కలిగిన దర్శనాలు భ్రమ. వాళ్ళు వ్యర్థమైన కలల భావాలు చెపుతారు. వారు పలికే ఓదార్పు మాట వట్టిదే. అందుచేత కాపరి లేకుండా బాధకు గురి అయిన మందలాగా ప్రజలు తిరుగులాడుతూ ఉన్నారు.
3 “కాపరులమీద నా కోపాగ్ని రగులుకొంది. మందలో నాయకులను శిక్షిస్తాను” అని యెహోవా అంటున్నాడు. తన మందగా ఉన్న యూదా వంశంవారిని సందర్శిస్తాడు, వారిని తనకు రాజయోగ్యమైన యుద్ధాశ్వంలాగా చేస్తాడు. 4 ఆ వంశంలోనుంచే మూలరాయి, డేరా మేకు, యుద్ధ ధనుస్సు కలుగుతాయి, అధికారులంతా దానిలో నుంచే బయలుదేరుతారు. 5 వారు యుద్ధంలో వీధుల బురదలో శత్రువులను త్రొక్కివేసే బలాఢ్యులలాగా ఉంటారు. యెహోవా వారికి తోడుగా ఉంటాడు గనుక వారు యుద్ధం చేస్తూ రౌతులను సిగ్గుపాలు చేస్తారు.
6 యెహోవా చెప్పేదేమంటే “నేను యూదా వంశాన్ని బలపరుస్తాను, యోసేపువంశాన్ని రక్షిస్తాను. ఆ ప్రజ అంటే నాకు కనికరం గనుక వారికి మునుపటి క్షేమ స్థితిని మళ్ళీ రప్పిస్తాను. నేను వారి దేవుడు యెహోవాను. వారి ప్రార్థనకు జవాబిస్తాను గనుక నేను వారిని ఎన్నడూ నిరాకరించక పోయినట్టే ఉంటుంది. 7 ఎఫ్రాయింవారు వీరులలాంటి వారవుతారు. ద్రాక్షరసం త్రాగి సంతోషించే వారిలాగా వారు హృదయంలో ఆనందిస్తారు. 8 నేను వారిని విముక్తులను చేసి వారిని ఈల వేసి పిలిచి సమకూరుస్తాను. ఇంతకుముందు వారి సంఖ్య పెరిగినట్టు పెరుగుతుంది. 9 నేను వారిని ఇతర జనాల మధ్యలో చెదరగొట్టినా, వారు దూర దేశాలలో ఉండి నన్ను జ్ఞాపకం చేసుకొంటారు. వారూ వారి సంతానమూ బ్రతికి ఉండి తిరిగి వస్తారు. 10 నేను వారిని ఈజిప్ట్‌నుంచి తిరిగి తీసుకువస్తాను, అష్షూరు నుంచి సమకూరుస్తాను. వారిని గిలాదు లెబానోనులకు తోడుకువస్తాను. ఆ స్థలాలు వారికి చాలేటంత విశాలంగా ఉండవు. 11 వారు దుఃఖ సముద్రం దాటవలసి వచ్చినా సముద్రం అలలు అణగారిపోతాయి. నైలు నది లోతులు ఇంకిపోతాయి. అష్షూరువారి గర్వాన్ని అణగద్రొక్కడం, ఈజిప్ట్ రాజదండాన్ని తీసివేయడం జరుగుతుంది. 12 నేను వారిని యెహోవామూలంగా బలపరుస్తాను. ఆయన పేర వారు ముందుకు సాగుతారు. ఇది యెహోవా వాక్కు.”