9
1 ఇది దేవోక్తి✽. యెహోవానుంచి వచ్చిన వాక్కు. హద్రాకు దేశానికీ దమస్కు పట్టణానికీ వ్యతిరేకమైనది. యెహోవా సర్వ మానవకోటినీ ఇస్రాయేల్ గోత్రాలన్నిటినీ చూస్తూ ఉన్నాడు. 2 ✽దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతుకూ చాలా నిపుణతగల తూరు సీదోను✽ పట్టణాలకూ కూడా యెహోవా వాక్కు వ్యతిరేకమైనది.3 “తూరు నగరవాసులు బలమైన కోట✽ను కట్టుకొన్నారు. ఇసుక రేణువులలాగా వెండినీ వీధులలో ఉన్న మట్టిలాగా బంగారాన్నీ✽ పోగు చేశారు. 4 అయితే యెహోవా దాని ఆస్తిని ఇతరుల వశం చేస్తాడు, సముద్రంలో దాని బలాన్ని నాశనం✽ చేస్తాడు. అది మంటలపాలవుతుంది. 5 ✽అష్‌కెలోను పట్టణస్థులు అది చూచి భయపడతారు. గాజా పురవాసులు అది చూచి అల్లాడిపోతారు. ఎక్రోనువాళ్ళు కూడా దాని విషయం ఆశాభంగం పొంది భయాక్రాంతులవుతారు. గాజాలో ఉన్న రాజు నాశనం అవుతాడు. అష్‌కెలోను నిర్జనం అవుతుంది. 6 అష్డోదులో సంకర జనం కాపురం చేస్తుంది. ఫిలిష్తీయ దేశస్థుల గర్వాన్ని నిర్మూలిస్తాను✽. 7 ✽వాళ్ళు రక్తాన్నీ నిషిద్ధమైనవాటినీ తినకుండా, అవి వాళ్ళ నోట ఎప్పుడూ లేకుండా చేస్తాను. అయితే వాళ్ళలో మిగలబోయేవాళ్ళు మన దేవునికి సొత్తుగా ఉంటారు, యూదావారిలో ఒక వంశంలాగా ఉంటారు, ఎక్రోను పురవాసులు యెబూసివాళ్ళ లాంటి వారవుతారు. 8 అప్పటినుంచి తిరుగుతూ ఉన్న ఏ సైన్యమూ నా ఆలయం మీదికి రాకుండేలా✽ నేను మకాం చేసి దాన్ని కాపాడుకొంటాను✽. అప్పటినుంచి ఇంకెన్నడూ నా ప్రజను ఏ నిర్దయుడు అణగద్రొక్కడు. నేను కన్నులారా చూస్తున్నాను.
9 ✽“సీయోనుకుమారీ✽, అధికంగా సంతోషించు! జెరుసలం కుమారీ, ఆనంద ధ్వనులు చేయి✽! ఇడుగో నీ రాజు✽ నీ దగ్గరికి వస్తున్నాడు! ఆయన న్యాయవంతుడు✽, విముక్తిదాత✽, సాధుశీలుడు✽. ఆయన గాడిదను – గాడిదపిల్లను ఎక్కి వస్తూ ఉన్నాడు.
10 ✽ “నేను ఎఫ్రాయింలో రథాలు లేకుండా చేస్తాను. జెరుసలంలో యుద్ధాశ్వాలు లేకుండా చేస్తాను. యుద్ధ ధనుస్సు లేకుండా పోతుంది. ఆయన శాంతిని ఇతర జనాలకు చాటిస్తాడు. ఆయన రాజ్యం సముద్రంనుంచి సముద్రంవరకూ యూఫ్రటీసు నదినుంచి భూమి కొనలవరకూ ఉంటుంది. 11 మీ వారిలో✽ ఉన్న ఖైదీలను✽ నీళ్ళు లేని గోతిలోనుంచి నేను విడిపిస్తాను. నేను మీతో చేసిన ఒడంబడిక రక్తం✽ కారణంగా అలా చేస్తాను. 12 ఆశాభావం ఉన్న ఖైదీలారా✽! కోట✽ ఉన్న మీ స్థలానికి తిరిగి రండి. మీ నష్టానికి నేను మీకు రెండంతలు✽ ఇస్తానని ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను. 13 నేను యూదావారిని విల్లులాగా ప్రయోగిస్తాను. ఎఫ్రాయిం✽ వారిని బాణాలుగా చేస్తాను. సీయోనూ! నీవారిని పురికొలుపుతాను. నిన్ను బలాఢ్యుడి ఖడ్గంలాగా ప్రయోగిస్తాను. గ్రీసు✽ దేశస్థులారా! సీయోనువారిని మీ మీదికి పురికొలుపుతాను”.
14 ✽అప్పుడు యెహోవా వారికి పైగా ప్రత్యక్షం అవుతాడు. ఆయన బాణాలు మెరుపులాగా విడువబడతాయి. యెహోవాప్రభువు బాకానాదం చేస్తాడు. దక్షిణ దిక్కు నుంచి వచ్చే గొప్ప తుఫానులో బయలు దేరుతాడు. 15 సేనల ప్రభువు యెహోవా వారిని కాపాడుతాడు. వారు నాశనం చేస్తూ, వడిసెల రాళ్ళను త్రొక్కివేస్తూ ఉంటారు. ద్రాక్షమద్యం త్రాగి కేకలుపెట్టేవారిలాగా ఉంటారు. వారు బలి పశు రక్తంతో నిండివున్న పాత్రల్లాగా రక్తంతో ముంచబడ్డ బలిపీఠం మూలల్లాగా ఉంటారు. 16 ఆ రోజున✽ వారి దేవుడు యెహోవా వారిని గొర్రెల మందలాగా కాపాడుతాడు. వారు కిరీటంలో తళుకు తళుకుమనే రత్నాల్లాగా✽ ఆయన దేశంలో ఉంటారు. 17 ✽వారి స్థితి ఎంత క్షేమంగా, ఎంత మనోహరంగా ఉంటుంది! ధాన్యం, క్రొత్త ద్రాక్షరసంవల్ల యువకులూ కన్యలూ బలం పుంజుకొంటూ ఉంటారు.