8
1 మరోసారి సేనలప్రభువు యెహోవానుంచి నాకు వాక్కు వచ్చింది: 2 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “సీయోను విషయం నేను అత్యాసక్తి గలవాణ్ణి. దాని విషయం ఆసక్తిపరుణ్ణయి అధికంగా మండిపడుతున్నాను.”
3 యెహోవా చెప్పేదేమంటే, “నేను సీయోనుకు తిరిగివచ్చి జెరుసలంలో నివాసం చేస్తాను. అప్పుడు జెరుసలంను ‘నమ్మకమైన నగరం’ అంటారు, సేనలప్రభువు యెహోవా పర్వతాన్ని ‘పవిత్ర పర్వతం’ అంటారు.”
4 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “పండు ముసలితనం ఉన్న స్త్రీపురుషులు మరోసారి జెరుసలం వీధులలో కూర్చుంటారు. వయసు ఎక్కువ కావడంచేత వారంతా చేతికర్ర పట్టుకొని ఉంటారు. 5 నగర వీధులు ఆటలాడుతున్న బాలబాలికలతో నిండి ఉంటాయి.”
6  సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే “ఆ కాలంలో ఈ ప్రజలో మిగిలినవారికి ఇది అద్భుతం అనిపించినా, నాకు కూడా అద్భుతమనిపిస్తుందా? ఇది యెహోవా వాక్కు.”
7 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “లోకం యొక్క తూర్పు దిక్కునుంచీ పడమటి దిక్కునుంచీ నేను నా ప్రజను పిలిచి రక్షిస్తాను. 8 జెరుసలంలో నివాసం చేసేలా వారిని తిరిగి తోడుకొని వస్తాను. వారు నా ప్రజగా ఉంటారు. నేను వారికి దేవుడుగా ఉంటాను, వారిపట్ల నీతినిజాయితీతో వ్యవహరిస్తాను.”
9 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “ఈ రోజులలో ప్రవక్తల నోటనుంచి వెలువడ్డ మాటలను వినేవారలారా, ధైర్యం తెచ్చుకోండి. సేనలప్రభువు యెహోవా ఆలయాన్ని కట్టడానికి దాని పునాది వేసిన రోజున వారు మాట్లాడారు. 10 అంతకు ముందు రోజులలో మనుషులకు కూలి దొరకలేదు. పశువులకోసం బాడుగ దొరకలేదు. అప్పుడు శత్రు భయంచేత ఎవరూ సురక్షితంగా పనిమీద వెళ్ళలేకపోయారు. ఎందుకంటే, ఒకరిమీద ఒకరికి విరోధ భావం కలిగించాను. 11 అయితే, గతంలో నేను ఈ ప్రజపట్ల వ్యవహరించినట్టు ఇప్పుడు మిగిలినవారిపట్ల వ్యవహరించను.
12 “ఇప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి. ద్రాక్షచెట్లు ఫలమిస్తాయి, భూమి పైరు ఇస్తుంది. ఆకాశం మంచు కురిపిస్తుంది, ఈ ప్రజలో మిగిలినవారు ఇవన్నీ పొందేలా చేస్తాను. ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు. 13 యూదా వారలారా! ఇస్రాయేల్ వారలారా! మీరు ఇతర జనాలలో ఎలా శాపానికి గురి అయ్యారో అలాగే మీరు దీవెనగా ఉండాలని చెప్పి నేను మిమ్ములను విమోచిస్తాను. భయంతో ఉండకండి! ధైర్యంగా ఉండండి!” 14 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “మీ పూర్వీకులు నాకు కోపం రేపినప్పుడు దయ చూడకుండా నేను మీమీదికి విపత్తు రప్పిస్తానని నిర్ణయించాను. 15 ఇప్పుడు జెరుసలంకూ యూదాకూ మేలు చేద్దామని నా నిర్ణయం. గనుక భయపడకండి. ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు. 16 మీరు ఇలా ప్రవర్తించాలి ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి, సత్యాన్నీ శాంతిప్రదమైన న్యాయాన్నీ అనుసరించి మీ న్యాయస్థానాలలో తీర్పు తీర్చాలి. 17 పొరుగువారి మీద ఎన్నడూ దురాలోచన చేయకూడదు, అబద్ధ ప్రమాణం చేయకూడదు అలా చేయడానికి ఇష్టపడకూడదు కూడా. అలాంటివన్నీ నాకు అసహ్యం. ఇది యెహోవా వాక్కు.”
18 సేనలప్రభువు యెహోవానుంచి మళ్ళీ నాకు వాక్కు వచ్చింది. 19 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “నాలుగో నెలలో అయిదో నెలలో ఏడో నెలలో పదో నెలలో ఉపవాస కాలాలు యూదావారికి సంతోషం, ఉల్లాసంతో నిండి ఉన్న మహోత్సవాలవుతాయి. గనుక మీరు సత్యాన్నీ శాంతినీ ప్రియమైనవిగా ఎంచండి.” 20 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “ఇంకా ప్రజలూ అనేక పట్టణాల నివాసులూ వస్తారు. 21 ఒక పట్టణంవారు మరో పట్టణంవారి దగ్గరికి వెళ్ళి ‘వెంటనే మనం యెహోవాను ప్రాధేయపడడానికి సేనలప్రభువు యెహోవాను వెదకడానికి వెళ్దాం, పదండి. మేము వెళ్తాం’ అంటారు. 22 అనేక జనాలూ బలిష్ఠులైన ఇతర ప్రజలూ సేనలప్రభువు యెహోవాను వెదకి ప్రాధేయపడడానికి జెరుసలంకు వస్తారు.” 23 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “ఆ రోజులలో ఆయా భాషలు మాట్లాడే ఇతర ప్రజలలో పదిమంది ఒకే యూదుడి చెంగు పట్టుకొని ‘దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మేము విన్నాం. మేము మీతో కూడా వస్తాం’ అంటారు.”