7
1 దర్యావేషు✽ చక్రవర్తి పరిపాలించిన నాలుగో సంవత్సరం కిస్లేవ్ అనే తొమ్మిదో నెల నాలుగో రోజున ఇలా జరిగింది: 2 బేతేల్✽ పురవాసులు యెహోవాను ప్రాధేయపడడానికి షెరెజెర్‌నూ రెగెమ్మెలెక్‌నూ వారితోపాటు వారి మనుషులనూ పంపారు, 3 ✽వారి మూలంగా, సేనలప్రభువు యెహోవా ఆలయంలో ఉన్న యాజులనూ ప్రవక్తలనూ ఇలా అడిగారు: “ఇన్ని సంవత్సరాలనుంచి చేసిన ప్రకారం అయిదో నెల మేము ఉపవాసముండి విలపించాలా, వద్దా?”4 అప్పుడు సేనల ప్రభువు యెహోవానుంచి నాకు వాక్కు వచ్చింది: 5 ✽“నీవు ఈ దేశస్థులందరికీ యాజులకూ ఇలా చెప్పాలి: గడచిన డెబ్భై సంవత్సరాలనుంచి ఏటేటా అయిదో నెల ఏడో నెల మీరు ఉపవాసం ఉంటూ విలపిస్తూ వచ్చారు గాని నా నిమిత్తం ఉపవాసం ఉన్నారా? 6 మీరు తింటూ త్రాగుతూ ఉన్నప్పుడు అది కూడా మీ కోసమే గదా. 7 పూర్వకాలంలో ఉన్న ప్రవక్తలచేత✽ యెహోవా ఈ విషయాలు చాటించలేదా? అప్పుడు జెరుసలం, అన్ని ప్రక్కల ఉన్న పట్టణాలు, దక్షిణ ప్రదేశం, పడమటి మైదానాల ప్రదేశం జనంతో నిండి ఉండి క్షేమస్థితిలో ఉన్నాయి.”
8 మరోసారి యెహోవానుంచి వాక్కు జెకర్యాకు వచ్చింది: 9 ✝“సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, యథార్థంగా న్యాయాన్ని జరిగించండి, ఒకరిమీద ఒకరు దయ, కరుణ చూపుకోండి. 10 విధవరాండ్రనూ తండ్రిలేని వారినీ విదేశీయులనూ దరిద్రులనూ అణగద్రొక్కకండి, మీ మనసులో ఒకరిమీద ఒకరు కుట్ర పన్నుకోకండి. 11 ✝అయితే వారు వినడానికి నిరాకరించారు, అటువైపు మూర్ఖంగా మళ్ళుకొని వినకుండా చెవులు మూసుకొన్నారు. 12 తమ హృదయాలను చెకుముకిరాయి లాగా గట్టి చేసుకొని ధర్మశాస్త్రానికి గానీ పూర్వకాలంలో ప్రవక్తలద్వారా సేనలప్రభువు యెహోవా తన ఆత్మచేత✽ తెలియజేసిన మాటలకు గానీ వారు లోబడలేదు. కాబట్టి సేనలప్రభువు యెహోవా వారిమీద అధికంగా కోపగించాడు✽.
13 ✝“సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, నేను పిలిచినప్పుడు వారు అలక్ష్యం చేశారు గనుక వారు పిలిచినప్పుడు నేను అలక్ష్యం చేశాను. 14 వారికి తెలియని ఇతర జనాల మధ్యకు తుఫానులాగా నేను వారిని చెదరగొట్టాను✽. వారు విడిచిన ఈ దేశంలో రాకపోకలు లేకుండా ఇది పాడైపోయింది. ఈ విధంగా వారిచేత✽ మనోహరమైన ఈ దేశం పాడుగా నిర్జనంగా అయింది.”