6
1 నేను మళ్ళీ తలెత్తి చూస్తే రెండు పర్వతాల మధ్యనుంచి బయలు దేరుతూ ఉన్న నాలుగు రథాలు కనిపించాయి. ఆ పర్వతాలు కంచు పర్వతాలు. 2  మొదటి రథానికి ఎర్రని గుర్రాలు కట్టి ఉన్నాయి, రెండో రథానికి నల్లని గుర్రాలు, 3 మూడో రథానికి తెల్లని గుర్రాలు, నాలుగో రథానికి పొడల గుర్రాలు పూన్చి ఉన్నాయి. ఆ గుర్రాలు బలమైనవి. 4 నాతో మాట్లాడే దేవదూతను చూచి “స్వామీ, వీటి భావమేమిటి?” అని అడిగాను.
5 అందుకు దేవదూత ఇలా జవాబిచ్చాడు: “ఇవి సర్వలోక నాథుడైన యెహోవా సన్నిధానంనుంచి బయలుదేరిన నాలుగు పరలోక ఆత్మలను సూచిస్తాయి. 6 నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశానికి పోతూ ఉంది, తెల్లని గుర్రాలున్న రథం వాటివెంట పోతూ వుంది, పొడల గుర్రాలు గల రథం దక్షిణ దేశానికి పోతూ వుంది.”
7 ఆ బలమైన గుర్రాలు బయలుదేరి లోకమంతటా గస్తీ తిరగడానికి ఆత్రపడుతూ ఉంటే, ఆయన “లోకమంతటా గస్తీ తిరగండి” అన్నాడు గనుక అవి లోకమంతటా గస్తీ తిరిగాయి.
8 అప్పుడాయన నన్ను పిలిచి “ఉత్తర దేశానికి పోయేవాటిని చూడు. అవి ఉత్తర దేశంలో నా ఆత్మను నెమ్మదిపరుస్తాయి” అన్నాడు.
9 యెహోవానుంచి నాకు ఇలా వాక్కు వచ్చింది: 10 “బందీలుగా వెళ్ళినవారిలో బబులోనునుంచి వచ్చిన హెల్‌దయి, టోబీయా, యెదాయాలను అడిగి వెండి బంగారాలు తీసుకో. ఆ రోజే జెఫన్యా కొడుకు యోషియా ఇంటికి వెళ్ళు. ఆ వెండి బంగారాలు తీసుకొని కిరీటం చెయ్యి. 11 అప్పుడు ప్రముఖ యాజీ యెహోజాదాక్ కొడుకూ అయిన యెహోషువ తలమీద కిరీటం పెట్టి అతనితో ఇలా చెప్పు: 12 ‘సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “కొమ్మ” అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. ఆయన తన స్థలంలోనుంచి అంకురించి యెహోవా ఆలయాన్ని నిర్మిస్తాడు. 13 ఆయనే యెహోవా ఆలయాన్ని నిర్మిస్తాడు. ఆయన హోదా కలిగి సింహాసనంమీద కూర్చుని పరిపాలన చేస్తాడు. అంతేగాక, ఆయన తన సింహాసనం మీద యాజిగా ఉంటాడు. ఈ రెంటికి పొందిక ఉంటుంది. 14 ఆ కిరీటం హేలెంకూ టోబీయాకూ యెదాయాకూ జెఫన్యా కొడుకు హేన్‌కూ జ్ఞాపకార్థంగా యెహోవా ఆలయంలో ఉంచాలి. 15 యెహోవా ఆలయాన్ని కట్టడంలో సహాయం చేయడానికి దూరంగా ఉన్నవారు వస్తారు. అప్పుడు సేనలప్రభువు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకొంటారు. మీరు జాగ్రత్తగా మీ దేవుడు యెహోవా మాట వింటే ఇలా జరుగుతుంది.”