5
1 ✽నేను మళ్ళీ తలెత్తి చూచినప్పుడు చుట్టివున్న పత్రం ఒకటి ఎగిరిపోతూ ఉండడం కనిపించింది. 2 “నీకు కనిపిస్తున్నదేమిటి?” అని ఆయన నన్ను అడిగాడు.“చుట్టివున్న పత్రం ఒకటి ఎగిరిపోతూ ఉండడం కనిపిస్తున్నది. దాని పొడవు ఇరవై మూరలు, వెడల్పు పదిమూరలు” అన్నాను.
3 అందుకాయన నాతో ఇలా అన్నాడు: “ఇది భూలోకమంతటి మీదికి బయలుదేరుతున్న శాపం✽. దానికి ఒక ప్రక్కన వ్రాసినదాని ప్రకారం దొంగతనం✽ చేసే వాళ్ళంతా నాశనం✽ అవుతారు, రెండో ప్రక్కన వ్రాసిన దాని ప్రకారం అబద్ధప్రమాణం చెప్పేవాళ్ళంతా నాశనం అవుతారు. 4 ✽సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, నేనే అది బయలుదేరేలా చేస్తున్నాను. అది దొంగల ఇండ్లలోకి నాపేర అబద్ధ ప్రమాణం చేసేవాళ్ళ ఇండ్లలోకి పోతుంది. వాళ్ళ ఇండ్లలో ఉండి వాటినీ వాటి దూలాలనూ రాళ్ళనూ✽ నాశనం చేస్తుంది.”
5 ✽అప్పుడు నాతో మాట్లాడే దేవదూత వచ్చి “నీ తలెత్తి బయలుదేరుతూ ఉన్నదేమిటో చూడు” అని నాతో అన్నాడు.
6 ✽“అదేమిటి?” అని నేను అడిగినప్పుడు ఆయన “అది కొలత బుట్ట. అది ఈ దేశమంతటా ఉన్న ప్రజలను సూచిస్తుంది” అన్నాడు.
7 ఆ బుట్టకు సీసంతో చేసిన మూత ఉంది. దానిని తీసినప్పుడు బుట్టలో కూర్చుని ఉన్న ఒక స్త్రీ కనిపించింది.
8 అతడు “ఇది దుర్మార్గం” అని చెప్పి, దానిని బుట్టలో అడుక్కు నెట్టివేసి సీసం మూత బుట్టమీద ఉంచాడు. 9 నేను మళ్ళీ తలెత్తి చూస్తే ఇద్దరు స్త్రీలు వస్తూ కనిపించారు. సంకుబుడికొంగ రెక్కలలాంటి రెక్కలు ఆ స్త్రీలకు ఉన్నాయి. గాలి వారి రెక్కలను కదిలిస్తూ ఉంది. వారు బుట్టను భూమికీ ఆకాశానికీ మధ్యకు ఎత్తారు.
10 “వారు బుట్టను ఎక్కడికి తీసుకుపోతున్నారు?” అని నాతో మాట్లాడే దేవదూతను అడిగాను.
11 ✽ఆయన ఇలా జవాబిచ్చాడు: “షీనారు దేశంలో దానికొక ఇల్లు కట్టడానికి పోతున్నారు. ఇల్లు సిద్ధమైనప్పుడు అక్కడ దానిని దాని స్థలంలో ఉంచుతారు.”