4
1 అప్పుడు నాతో మాట్లాడిన దేవదూత తిరిగి వచ్చి నిద్రపోయినవాణ్ణి లేపినట్టు నన్ను లేపాడు, 2 “నీకు కనబడుతున్నదేమిటి?” అని నన్ను అడిగాడు.
నేను “బంగారు దీపస్తంభం నాకు కనిపిస్తూ ఉంది. దానిమీద నూనె పాత్ర ఉంది. స్తంభానికి ఏడు దీపాలు ఉన్నాయి, దీపాలకు ఏడు గొట్టాలు ఉన్నాయి. 3 రెండు ఆలీవ్ చెట్లు కూడా కనిపిస్తున్నాయి. దీపస్తంభానికి కుడిప్రక్క ఒకటి, ఎడమప్రక్క మరొకటి” అన్నాను. 4 నాతో మాట్లాడే దేవదూతను చూచి “స్వామీ! దీని భావమేమిటి?” అని అడిగాను.
5 ఆయన అన్నాడు “దీని భావమేమిటో నీకు తెలియదా?” “స్వామి! నాకు తెలియద”ని జవాబిచ్చాను.
6 అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు: “జెరుబ్బాబెల్ విషయం యెహోవా చెప్పేదేమంటే, నా ఆత్మ చేతనే పని జరుగుతుంది గానీ శక్తిచేత బలంచేత కాదు. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు. 7 మహా పర్వతమా! నీవు ఏపాటిదానివి? జెరుబ్బాబెల్ ఎదుట నీవు నేలమట్టం అవుతావు. అప్పుడతడు పైరాయి తీసుకొని ఆలయంమీద పెట్టిస్తాడు, ప్రజలు ‘కృప! కృప!’ అంటూ నినాదాలు చేస్తారు.”
8 నాకు యెహోవా నుంచి వాక్కు మళ్ళీ వచ్చింది. 9 “జెరుబ్బాబెల్ తన చేతులతో ఈ ఆలయం పునాది వేశాడు. అతడు ఈ పని ముగిస్తాడు. అప్పుడు సేనల ప్రభువు యెహోవా నన్ను మీదగ్గరికి పంపాడని నీవు తెలుసుకొంటావు. 10 అల్ప క్రియలు జరిగే కాలాన్ని తృణీకరించేవారెవరు? జెరుబ్బాబెల్ చేతిలో ఆ విశేషమైన రాయి చూచి ప్రజలు సంతోషిస్తారు. ఈ ఏడు లోకమంతటా కలయచూస్తూ ఉన్న యెహోవా కండ్లు.” 11 నేను ఆ దేవదూతను “దీపస్తంభానికి ఇరు ప్రక్కల ఉన్న ఈ రెండు ఆలీవ్ చెట్ల భావమేమిటి?” అనీ, 12 “ఆ రెండు ఆలీవ్‌చెట్ల కొమ్మలు ఆ రెండు బంగారు గొట్టాల దగ్గర ఉన్నాయి. వాటిలోనుంచి బంగారు నూనె పారుతూ ఉంది. ఆ కొమ్మల భావమేమిటి?” అనీ అడిగాను.
13 ఆయన “వీటి భావమేమిటో నీకు తెలియదా?” అనీ అడిగితే, “స్వామీ నాకు తెలియదు” అన్నాను.
14 ఆయన “అవి అభిషిక్తులైన ఇద్దరు వ్యక్తులను సూచిస్తాయి. వారు సర్వలోక నాథుడైన యెహోవా సన్నిధాన సేవకులు” అన్నాడు.