3
1 అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రముఖయాజి అయిన యెహోషువ నిలబడి ఉండడం నాకు చూపాడు. అతని మీద నేరం మోపడానికి అతని కుడిప్రక్కన సైతాను నిలుచున్నాడు. 2 సైతానుతో యెహోవా ఇలా అన్నాడు: “సైతానూ! యెహోవా నిన్ను గద్దిస్తాడు గాక! జెరుసలంను ఎన్నుకొన్న యెహోవా నిన్ను గద్దిస్తాడు గాక! ఈ మనిషి అగ్నిలోనుంచి తీసిన కొరివిలాంటి వాడు గదా.” 3 యెహోషువ ఆ దూత ఎదుట ఇంకా నిలుచున్నాడు. అతడు వేసుకొన్న బట్టలు మురికిగా ఉన్నాయి. 4 ఆ దూత తన ఎదుట నిలుచున్న వ్యక్తులతో “ఇతడి మురికి బట్టలు తీసివేయండి” అన్నాడు. ఆయన యెహోషువతో “చూడు, నేను నీ అపరాధాలను తొలగించాను. నీకు శ్రేష్ఠమైన బట్టలు తొడిగిస్తాను” అన్నాడు. 5 అప్పుడు “ఇతని తలమీద శుద్ధమైన పాగా పెట్టండి” అని ఆయన చెప్పాడు. యెహోవా దూత అతని దగ్గర నిలబడి ఉంటే, వారు అతని తలమీద శుద్ధమైన పాగా పెట్టారు, అతనికి బట్టలు తొడిగించారు. 6 ఆ తరువాత యెహోవా దూత యెహోషువను ఇలా ఆదేశించాడు: 7 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, నీవు నా విధానాలను అనుసరించి పాటించాలని నేను చెప్పిన విషయాలను పాటిస్తూ ఉంటే, నీవు నా ఆలయంమీద అధికారివవుతావు, నా ఆవరణాలలో పైవిచారణ చేస్తావు. అంతేకాక, ఇక్కడ నిలుచున్నవారికి ఇచ్చినట్టే నేను నీకు నా సన్నిధానంలోకి ప్రవేశం ప్రసాదిస్తాను. 8 యెహోషువ ప్రముఖయాజీ! నీవూ నీ ఎదుట కూర్చుని ఉన్న నీ సహచరులూ రాబోయేవాటికి సూచనలుగా ఉన్నారు. నేను చెప్పేది వినండి. నేను నా సేవకుడైన “కొమ్మ” వచ్చేలా చేస్తాను. 9 నేను యెహోషువ ఎదుట పెట్టిన రాయి చూడండి. ఆ రాయికి ఏడు కండ్లు ఉన్నాయి. దానిమీద అక్షరాలు చెక్కుతాను. ఇలా చెప్పినది సేనలప్రభువు యెహోవా. ఒకేరోజులో నేను ఈ దేశస్థుల అపరాధాలు తొలగిస్తాను. 10 ఆ కాలంలో మీలో ఒక్కొక్కరు పొరుగువారిని ద్రాక్షచెట్లక్రింద, అంజూరచెట్ల క్రింద కూర్చోవడానికి పిలుస్తారు. ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు.”