2
1 ఆ తరువాత నేను తలెత్తి చూస్తే నా ఎదుట కొలనూలు చేతపట్టుకొని ఉన్న వ్యక్తి నాకు కనబడ్డాడు. 2 “మీరు ఎక్కడికి వెళ్తున్నారు?” అని అడిగాను.
ఆయన “జెరుసలం పరిమాణం తెలుసుకోవడానికి దాని వెడల్పూ పొడుగూ ఎంతో చూడడానికి వెళ్తున్నాను” అన్నాడు.
3 అప్పుడు నాతో మాట్లాడే దేవదూత బయలుదేరుతూ ఉంటే మరో దేవదూత ఆయనను కలుసుకోవడానికి వచ్చి ఇలా అన్నాడు:
4 “నీవు ఆ యువకుడి దగ్గరికి పరుగెత్తి ఇలా చెప్పు: జెరుసలంలో మనుషులూ పశువులూ అత్యధికం కావడంచేత అది గోడలు లేని నగరం అవుతుంది. 5 యెహోవా చెప్పేదేమంటే, నేనే దాని చుట్టూరా మంటల గోడలాగా ఉంటాను. దానిలో నేనే శోభా ప్రకాశంగా ఉంటాను. 6 యెహోవా చెప్పేదేమంటే, రండి, రండి! ఉత్తర దేశంనుంచి తప్పించుకురండి! ఆకాశంలో వీచే నాలుగు గాలుల దిక్కులకు నేను మిమ్ములను చెదరగొట్టాను. ఇది యెహోవా వాక్కు. 7 సీయోను ప్రజలారా! రండి! బబులోను దేశంలో ఉంటున్న మీరు తప్పించుకు రండి! 8 సేనల ప్రభువు యెహోవా నన్ను ఘనపరచి మిమ్ములను దోచుకున్న ఇతర జనాల దగ్గరికి నన్ను పంపాడు. ఎవరైనా మిమ్ములను ముట్టితే యెహోవా కనుగుడ్డును ముట్టినట్టే. 9 ఆయన చెప్పేదేమంటే, నేను ఆ జనాలకు వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తుతాను. వారి దాసులు వారిని దోచుకొంటారు. అప్పుడు సేనల ప్రభువు యెహోవా నన్ను పంపాడని మీరు తెలుసుకొంటారు.”
10 యెహోవా ఇలా అంటున్నాడు: “సీయోనుకుమారీ! నేను వచ్చి మీమధ్య నివాసం చేస్తాను గనుక సంతోషంగా ఉండండి, ఆనంద గీతాలు పాడండి. 11 ఆ రోజున అనేక ఇతర జనాలు యెహోవా దగ్గరికి చేరి నా ప్రజ అవుతారు. నేను మీమధ్య నివాసం చేస్తాను. అప్పుడు సేనల ప్రభువు యెహోవా నన్ను మీదగ్గరికి పంపాడని మీరు తెలుసుకొంటారు. 12 పవిత్ర దేశంలో యెహోవా యూదాప్రదేశాన్ని స్వాధీనం చేసుకొంటాడు. అది ఆయనకు ప్రత్యేక భాగంగా ఉంటుంది. ఆయన జెరుసలంను మళ్ళీ ఎన్నుకొంటాడు. 13 సర్వ మానవ కోటీ! యెహోవా తన పవిత్ర నివాసం విడిచి బయలుదేరాడు గనుక ఆయన ఎదుట మౌనంగా ఉండండి.”