జెకర్యా
1
1 దర్యావేషు✽ పరిపాలించిన రెండో సంవత్సరం ఎనిమిదో నెల యెహోవానుంచి బరెకయా కొడుకూ ఇద్దో✽ మనుమడూ ప్రవక్తా✽ అయిన జెకర్యాకు వచ్చిన✽ వాక్కు:2 “యెహోవా మీ పూర్వీకుల✽మీద అధికంగా కోపగించాడు✽. 3 గనుక నీవు ప్రజతో ఇలా చెప్పు: సేనల ప్రభువు✽ యెహోవా చెప్పేదేమంటే, మీరు నావైపు తిరగండి✽. అప్పుడు నేను మీవైపు తిరుగుతాను. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు. 4 మీరు మీ పూర్వీకులలాగా ఉండకూడదు. పూర్వం ఉన్న ప్రవక్తలు✽ వారికి ఇలా ప్రకటించారు: సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, మీ దుర్మార్గాన్నీ దురాచారాలనూ మాని నావైపు తిరగండి. అయినా వారు ఆ మాట వినలేదు✽, నన్ను అలక్ష్యం చేశారు. ఇది యెహోవా వాక్కు. 5 ✽మీ పూర్వీకులు ఏమయ్యారు? ఆ ప్రవక్తలు సర్వదా బ్రతికేవారా? 6 అయితే నేను నా సేవకులైన ప్రవక్తలకు ఆదేశించిన విషయాలు చట్టాల ప్రకారం మీ పూర్వీకుల విషయం జరిగిందే గదా. అప్పుడు వారు నావైపు తిరిగి✽, మన ప్రవర్తనకూ క్రియలకూ తగినట్టుగా✽ సేనల ప్రభువు యెహోవా తాను చేయదలిచిన✽ ప్రకారం మన విషయంలో జరిగించాడు అన్నారు.” 7 ✽దర్యావేషు పరిపాలించిన రెండో సంవత్సరం శెబాట్ అనే పదకొండో నెల ఇరవై నాలుగో రోజున ఇద్దో మనుమడూ బరెకయా కొడుకూ అయిన జెకర్యా ప్రవక్తకు యెహోవా వాక్కు వచ్చింది. 8 రాత్రివేళ నాకు దర్శనం కలిగింది. ఎర్రని గుర్ర✽మెక్కిన వ్యక్తి✽ నాకు కనిపించాడు. ఆయన లోయలో ఉన్న గొంజి చెట్లలో ఉన్నాడు. ఆయన వెనుక ఎర్రని గుర్రాలూ గోధుమ రంగు గుర్రాలూ తెల్లని గుర్రాలూ✽ కనిపించాయి. 9 ✽నేను “స్వామీ! ఇవి ఏమిటి?” అని అడిగాను. నాతో మాట్లాడే దేవదూత “అవి ఏమిటో నీకు తెలియజేస్తాను” అన్నాడు.
10 ✽అప్పుడు గొంజి చెట్లలో నిలుచున్న వ్యక్తి ఇలా వివరించాడు: “ఈ గుర్రాలు లోకమంతటా గస్తీ తిరగడానికి యెహోవా పంపించినవి.”
11 ✽అప్పుడు అవి గొంజి చెట్లలో నిలుచున్న యెహోవా దూతతో “మేము లోకమంతటా గస్తీ తిరిగి, లోకమంతా నెమ్మదిగా శాంతంగా✽ ఉండడం చూశాం” అన్నాయి.
12 ✽అందుకు యెహోవా దూత చెప్పేదేమంటే, “సేనల ప్రభువు యెహోవా! డెబ్భై సంవత్సరాల✽నుంచి నీవు జెరుసలంమీద, యూదా పట్టణాలమీద కోపగిస్తూ ఉన్నావు. ఇంకా ఎన్నాళ్ళ వరకు జాలి చూపకుండా ఉంటావు?”
13 ✽నాతో మాట్లాడిన దూత✽కు జవాబుగా యెహోవా దయగల మాటలూ ఓదార్చే మాటలూ పలికాడు. 14 ఆ తరువాత నాతో మాట్లాడిన దూత నన్ను చూచి ఇలా అన్నాడు: “నీవు చాటించవలసిన సంగతి ఏమంటే సేనలప్రభువు యెహోవా ఇలా చెపుతున్నాడు: జెరుసలం, సీయోను విషయంలో నాకు ఎంతో ఆసక్తి✽ ఉంది. 15 అశ్రద్ధగా బ్రతుకుతూ ఉన్న ఇతర జనాలమీద నాకు అధిక కోపం ఉంది. మునుపు నాకున్న కోపం కొంచెమే గానీ వారు కీడును పెంపొందించారు. 16 అందుచేత యెహోవా చెప్పేదేమంటే, నేను జెరుసలంవైపు మళ్ళుకొని జాలి చూపుతాను. అక్కడ నా ఆలయాన్ని✽ కట్టడం జరుగుతుంది. జెరుసలంమీద నిర్మాతలు కొలనూలు లాగి కొలత✽ చూస్తారు. ఇది యెహోవా వాక్కు. 17 నీవు ఇంకా ఇలా చాటించాలి: సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, నా పట్టణాలు సమృద్ధి అయిన శ్రేయస్సుతో మరల నిండి ఉంటాయి, యెహోవా మరల సీయోనును ఓదారుస్తాడు✽, జెరుసలంను ఎన్నుకొంటాడు✽.”
18 ✽ఆ తరువాత నేను తలెత్తి చూస్తే నా ఎదుట నాలుగు కొమ్ములు కనిపించాయి. 19 “ఇవేమిటి?” అని నాతో మాట్లాడే దేవదూతను అడిగాను. అందుకు ఆయన “ఈ కొమ్ములు యూదా ప్రజనూ ఇస్రాయేల్‌ప్రజనూ జెరుసలం నివాసులనూ చెదరగొట్టిన కొమ్ములు” అన్నాడు.
20 అప్పుడు యెహోవా నాకు నలుగురు లోహకారులను✽ చూపించాడు. 21 “వీరు చేయబోయేదేమిటి?” అని నేను అడిగినప్పుడు ఆయన “ఈ కొమ్ములు ఎవరూ తల ఎత్తకుండా యూదాప్రజను చెదరగొట్టేవి. యూదా దేశస్థులను చెదర గొట్టడానికి ఇతర ప్రజలు తమ కొమ్ములతో వారిని పొడిచారు, ఇప్పుడు ఆ కొమ్ములను భయాక్రాంతులను చేయడానికీ నేలమట్టం చేయడానికీ ఈ లోహకారులు వచ్చారు.”